చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా.. | History Of Former MP Sabbam Hari Controversys | Sakshi
Sakshi News home page

సబ్బం గబ్బు..

Published Sun, Oct 4 2020 8:14 AM | Last Updated on Sun, Oct 4 2020 3:04 PM

History Of Former MP Sabbam Hari Controversys - Sakshi

అధికారులను బెదిరిస్తున్న సబ్బం హరి

.. లేస్తే మనిషిని కాదన్నట్టు ఎప్పుడూ కుర్చీల్లో కూర్చుని టీవీల్లో కనిపిస్తూ సుద్ద పూసలా మాట్లాడే మాజీ మేయర్‌ సబ్బం హరి అసలు బండారం ఇప్పుడు బయటపడింది.
ఘాజీ సబ్‌మెరైన్‌ను విశాఖ తీరానికి తానే తీసుకువచ్చానని అర్ధం పర్ధం లేని విశ్లేషణలు చేస్తూ.. తనకు తాను పెద్ద మనిషిలా బిల్డప్‌ ఇచ్చే హరి వారి నిజరూపం ఇప్పుడు విశాఖ ప్రజలకు నిలువెత్తుగా దర్శనమిచ్చింది. 
ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తాయో.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని కనీస స్పృహ లేకుండా ఎంత దారుణంగా మాటలు అంటారో...  ప్రభుత్వ అధికారులను ఇష్టమొచ్చినట్టు ఎలా దునుమాడుతారో ఇన్నేళ్లకు స్పష్టంగా తెలుసొచ్చింది.
హరి ఓవర్‌ యాక్షన్‌ ఎందుకో తెలుసు కదా... ఆయన మేయర్‌గా వెలగబెట్టిన కాలంలో అడ్డగోలుగా కట్టేసిన ఓ అక్రమ నిర్మాణాన్ని కూలి్చవేయడమే అధికారులు, సర్కారు ఘోర తప్పిదమైనట్టు శనివారం రెచ్చిపోయాడాయన. 
సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్‌ 7లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా రెస్ట్‌రూం, ప్రహరీ నిర్మాణం చేసేసిన నిర్వాకంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం జీవీఎంసీ అధికారులు స్పందించి కూలగొట్టారు. 
అంతే.. దానికి నానాయాగీ చేస్తూ... అధికారులనే కాదు.. పాలకులను సైతం బండబూతులు తిడుతూ కనీస స్పృహ కూడా లేకుండా చేసిన సబ్బం గబ్బు చూసి సామాన్యులు సైతం ఛీ కొట్టారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇంతకూ అసలు సుద్దపూసలా కబుర్లు చెబుతున్న సబ్బం హరి జీవిత ప్రస్థానం ఏమిటో ఒక్కసారి చూద్దాం రండి. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  సబ్బం హరి.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం... విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు ప్రతిరూపం... ఇదేంటి అన్నేసి మాటలు. అని అనుకుంటున్నారా... అయితే సబ్బం హరి చిట్టా విప్పాల్సిందే.. 
విశాఖ నగరంలో పనీ పాటా లేకుండా చిల్లర వేషాలు, రౌడీవ్యవహారాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరిని అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలకసంస్థ మేయర్‌ అయ్యారు. గౌరవప్రదమైన మేయర్‌ పదవిలో ఉండి...ఓ సారి కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేసిన ఉదంతంలో అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్‌కమిషనర్‌ ఆర్‌íపీ మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు బూటుకాళ్లతో బుద్ధి చెప్పారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్‌గా ఉంటూనే.. ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్నే జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు. (చదవండి: సబ్బం హరి కాదు.. పబ్బం హరి)
 

ఒక్క దఫా మేయర్‌గా పని చేసి... చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్‌ పార్టీనే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు. అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్‌ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్‌ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్‌సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం హరి ఎలాంటి ‘కృతజ్ఞత’ చూపించారో అందరికీ తెలుసు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా)

2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి.. ఆనక చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల తర్వాత ఐదేళ్లు 2014 నుంచి 2019 వరకు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. 2019లో సరిగ్గా ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చి తెలుగుదేశం పారీ్టలో ఎవ్వరూ వద్దన్న భీమిలి బరిలో నిలుచుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. సబ్బం రుద్దుడు భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో ఎన్నికల తర్వాత బయటకు మొహం చూపించలేక టీవీలకే పరిమితమయ్యాడు. కేవలం టీవీల్లో తప్పించి బయట ఎక్కడా కానరాని సబ్బం హరి విన్యాసాలు చూస్తే.. జబర్దస్త్‌ కామెడీకి మించి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే శనివారం ఆ కామెడీ శృతి మించి సీరియస్‌ కావడంతో సబ్బం హరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హరిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు వెనుకాడబోమని జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement