
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు 103 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు తమ పోలీస్ శాఖ వచ్చాయని హోం మంత్రి మేకతోటి సుచరిత సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఈ అవార్డులు వచ్చాయన్నారు. శుక్రవారం వేలంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, వాసుపల్లి గణేష్ కుమార్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు విళ్ళూరు రావు, కనకా రెడ్డి సనపల భరత్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలీసులపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, స్వేచ్ఛగా వారి పని వారు చేసుకుంటున్నారని తెలిపారు. ( యమ డిమాండ్.. ఓ సారి టేస్ట్ చూడండి )
రాష్ట్ర పోలీస్ శాఖ సంస్కరణలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ అవార్డులు పోలీసుశాఖపై మరింత బాధ్యతను పెంచాయని అన్నారు. గత ప్రభుత్వం పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుందని, గత ప్రభుత్వ హయాంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేవని అన్నారు. అమరావతి రైతుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, అందుకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి అన్ని అంశాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ క్యాబినెట్లోనే కాకుండా.. నామినేటెడ్ పదవుల్లో కూడా ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. గీతం యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment