పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం కూరగాయల తోటలకు ప్రసిద్ధి. నెల్లూరులోని ప్రధాన కూరగాయల మార్కెట్‌కు వచ్చే ఆకు కూరలతో పాటు కూరగాయల్లో వంగ, బెండ, దొండ, కాకర, బీర, చిక్కుడు, చేమ వంటివి సింహభాగం ఇక్కడ పండేవే. చిన్న, సన్నకారు రైతులు వందలాది ఎకరాల్లో ఆకు కూరలు, కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. అన్ని కాలాల్లోనూ పంటలు సాగవుతుండడంతో ఈ పనులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకు కూరలు, కూరగాయలు కోసి, స్వయంగా రాత్రి పూట మార్కెట్‌కు తరలించి, విక్రయించుకుని వెళ్తుంటారు. మరి కొందరు టోకు ధరతో కొనుగోలు చేసి ఇక్కడ కూరగాయల మార్కెట్లో విక్రయిస్తుంటారు.
ఇందుకూరుపేట: దక్షిణ కోనసీమగా పిలిచే ఇందుకూరుపేట విభిన్న కోణాల్లో కనిపిస్తోంది. ఓ వైపు ప్రకృతి అందాలు, మరో వైపు ఆధ్యాత్మికత.. ఇంకో వైపు వివిధ రకాల పంటల సాగు దృశ్యాలు ఇందుకూరుపేట సొంతం. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సరఫరా అయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో అత్యధిక శాతం ఇక్కడ పండించేవే. నేల, నీరు, వాతావరణం అనుకూలంగా ఉండడంతోమండలంలోని ఇందుకూరుపేట, కొత్తూరు, డేవిస్‌పేట, జగదేవిపేట, పల్లిపా డు తదితర పంచాయతీల్లో వంగ, బెండ, మిరప, చిక్కడు, చేమ, అరటి తదితర పంటలు సుమారు 1000 నుంచి 1500 ఎకరాల విస్తీర్ణం వరకు సాగు చేస్తున్నారు. అనునిత్యం ప్రతి ఇక్కడి నుంచి టన్నుల కొద్దీ కూరగాయలను నెల్లూరు మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు.
రైతు కుటుంబాలే కూలీలు
ఆకు కూరలు, కూరగాయల పంటలు అతి స్వల్ప కాలిక పంటలే. అర ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు సాగు చేసే రైతులే ఇక్కడ అధికం. సుమారు 400 మందికి పైగా రైతు కుటుంబాలు వారి తోటల్లో వారే కూలీలుగా పని చేస్తుంటారు. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉంటారు. వీరితో పాటు మరి కొందరు సహాయంతో ఈ పనులు చేస్తుంటారు. ఇటు వంటి మరో 300 మంది ఉంటారు. ప్రతి రోజు అందరికి చేతిలో పని ఉంటుంది.
అదను చూసి దుక్కిదున్నడంతో పాటు నీరు పెట్టడం, కలుపు తీయడం,, మందులు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం వంటి పనులు రైతులు దినచర్యగా చేస్తోంటారు. వేకువజామునే లేచి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి తోటకు పయనమవుతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేసిన రైతులు సాయంత్రం పండిన పంటను కోసి తరలిచేందుకు వీలుగా బస్తాలకు, ప్లాస్టిక్ బాక్స్‌ల్లో నింపుకొని సి«ధ్దం చేసుకొంటారు. అర్ధరాత్రి లేచి కాలకృత్యాలకు తీర్చుకొని రెండు, మూడు గంటకు గ్రామం నుంచి నెల్లూరు నగరానికి బయలు దేరుతారు. నెల్లూరు మార్కెట్‌కు వెళ్లి విక్రయించుకుని తెల్లారే సరికి ఇళ్లకు చేరుకుంటారు. ఇదే వీరి నిత్యం జీవితం.
ఉద్యాన పంటలే మాకు ఆధారం
మొదటి నుంచి కూరగాయలు సాగు చేసే మేము జీవిస్తున్నాం. వాతావరణానికి అనుకూలంగా పంటలు వేస్తాను. మేమే కష్టపడి పనిచేసుకొంటాం. ప్రస్తుతం బెండ, ఆకుకూరలు వేసి ఉన్నాను. దీనికి తోడు కొబ్బరి చెట్లను లీజుకు తీసుకున్నాను. బెండ పంటను రోజు మార్చి రోజు కోత కోసి మార్కెట్‌కు తీసుకెళుతున్నాను. ప్రస్తుతం మంచి రేటు ఉంది. ఈ ఉద్యాన పంటలే మాకు ప్రధాన జీవనాధారం.
– తిమ్మిరెడ్డి శేషయ్య, కొత్తూరు
కూరగాయల సాగుతోనే జీవనం
నేను నాకున్న ఎకరం భూమిలో వివిధ రకాల కూరగాయలు కొన్నేళ్లుగా సాగు చేస్తున్నాను. ఇదే నా కుటుంబానికి ఆదాయ వనరు. ప్రస్తుతం బెండ, పచ్చిమిర్చి, గోంగూర, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. ప్రతి రోజు కుటుంబ సభ్యులం ఉదయాన్నే తోటకు చేరి పనులు చేసుకొంటాం. ఎక్కువ దిగుబడి ఉంటే ఇక్కడే దళారులకు విక్రయిస్తాం. కొద్దిగా ఉంటే నెల్లూరు మార్కెట్‌కు వెళ్లి పంటను అమ్ముకొంటాం.
– మేనాటి మురళీ, కొత్తూరు
నేనే సొంతంగా విక్రయిస్తాను
లాక్‌డౌన్ సమయం నుంచి మార్కెట్‌కు వెళ్లడం లేదు. సొంతంగా ఆటో కొనుక్కొని నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, పొరుగున ఉన్న టీపీ గూడూరు మండలంలో గ్రామంలో తిరుగుతూ సరుకును అమ్ముకొంటాను. నేను పండించిన పంటనే కాకుండా పక్కనున్న వారి కూరగాయలు సైతం కొనుక్కొని ఈ పని చేస్తున్నాను. మా కుటుంబంలో అందరికీ కూలి పాటు గిట్టుబాటు అవుతుంది.
– అత్తిపాటి వెంకయ్య, కొత్తూరు
Comments
Please login to add a commentAdd a comment