తనను ఇంటిలోకి రానివ్వలేదని రోదిస్తున్న హెల్త్ సెక్రటరీ కల్యాణి
ఆల్కాట్‌తోట యాళ్లవారి వీధిలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆమె భార్యను ఆమె అద్దెకుంటున్న ఇంటి యజమాని, స్థానికులు లోపలికి వెళ్లనీయకుండా ఇంటికి తాళాలు వేసేశారు. దీంతో ఆమె ఆరుబయటే ఆ రాత్రంతా ఉండాల్సిన పరిస్థితి. చివరికి పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఆమెను లోపలికి అనుమతించారు.
కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆమెను చూసేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ మండలంలోని అధికారులే దహన సంస్కారాలు చేయించాల్సిన పరిస్థితి. ఈ రెండు అమానవీయ సంఘటనలు జిల్లాలో గురువారం చోటు చేసుకున్నాయి. కరోనా మహమ్మారి మనుషుల్లో భయాన్ని నింపడమే కాదు.. మానవత్వాన్ని కొంచెమైనా లేకుండా చేస్తోందనేందుకు ఈ సంఘటనలే నిదర్శనం..
తూర్పుగోదావరి ,ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్): భర్తకు కరోనా పాజిటివ్. ఆయనను బొమ్మూరు కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి, భార్య ఇంటిలోనే ఉంటోంది. ఆమె బయటకు వెళ్లి వస్తుందన్న కారణంతో ఆమె ఉంటున్న ఇంటి యజమాని ఇంటికి తాళం వేశారు. పోనీ పక్కవీధిలో ఉన్న సొంతింటికి వెళ్లి తలదాచుకుందామనుకుంటే అక్కడా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. చివరికి చేసేదేం లేక తాను అద్దెకు ఉంటున్న ఇంటి ముందే ఆరుబయట కూర్చోవలిసిన దుస్థితిని బుర్రిలంక సచివాలయ హెల్త్ సెక్రటరీ కల్యాణి ఎదుర్కొంది. ఆల్కాట్‌తోట యాళ్లవారివీధిలో జరిగిన ఈ సంఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణిని అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి, ఆమెను తన ఇంటిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు.
ఆల్కాట్‌తోట ప్రాంతం యాళ్లవారివీధికి చెందిన బుర్రిలంక సచివాలయ హెల్త్ సెక్రటరీ కళ్యాణి అద్దె ఇంటిలో ఉంటోంది. బుర్రిలంక గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆమె వైద్యసేవలు అందిస్తోంది. ఈలోపు ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండేలా వైద్యాధికారుల నుంచి అనుమతులు తీసుకుంది. స్థానికులు అభ్యంతరం చెప్పడంతో అతడిని బొమ్మూరు కోవిడ్ కేర్‌సెంటర్‌కు తరలించారు. ఆమె మాత్రం అద్దె ఇంటిలోనే హోమ్ క్వారంటైన్‌లో ఉంది. అయితే కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లి రావడంతో ఇంటి యజమాని ఆమె లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. ఈలోపు ఇంటికి చేరుకున్న కళ్యాణి తాళం వేసి ఉండడంతో ఇంటి యజమానితో మాట్లాడగా.. ఇక్కడ ఉండడానికి వీల్లేదని తెలిపారు. దీంతో పక్కవీధిలో ఉన్న తన సొంతింటికి వెళ్లింది. అక్కడ కూడా స్థానికులు రానివ్వకపోవడంతో ఆమె అద్దెకుంటున్న ఇంటికి వచ్చి బుధవారం రాత్రి నుంచి అక్కడే కూర్చుని ఉంది.
గురువారం ఉదయం కూడా వర్షంలోనే కూర్చొని తన బాధను వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టి తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్బన్ జిల్లా దక్షిణమండల డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, టూటౌన్ ఎస్సైలు లక్ష్మీ, అశోక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. కళ్యాణి ఇంటిలో ఉంటే తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, బయట తిరగడం వల్ల అభ్యంతరం వ్యక్తం చేశామని స్థానికులు డీఎస్పీ వెంకటేశ్వర్లకు వివరించారు. దీంతో డీఎస్పీ నగరపాలకసంస్థ అధికారులతో మాట్లాడి ఆ ఇంటిని శానిటైజేషన్ చేయించి కళ్యాణిని ఇంటిలోకి పంపించారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై లక్ష్మీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment