‘త్రీ స్టార్’ పోస్టుకు భారీ డిమాండ్
రూ.10 లక్షలతో మొదలై రూ.30 లక్షలకు ఖరారు
ఇటీవల కాకినాడ రూరల్‌లో ఓ పోస్టు అర కోటికి అమ్మకం.. పెత్తనమంతా షాడో ఎమ్మెల్యేదే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ‘త్రీ స్టార్’ రేటింగ్ అదిరిపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేలం వేసి మరీ పోస్టులు ఖాయం చేశారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓ సర్కిల్ పోస్టు అర కోటికి ఖరారు కాగా.., ఇప్పుడు ప్రత్తిపాడు సర్కిల్ రూ. 30 లక్షలకు బేరం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు సర్కిల్ హాట్ సీటు.
ఈ సర్కిల్ కోసం కొందరు ‘త్రీ స్టార్’లు ఓ నాయకుడి చుట్టూ నెల రోజులుగా తిరగ్గా.. గురువారం పోస్టు భర్తీ అయ్యింది. ప్రత్తిపాడుతో పాటు తుని, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో త్రీ స్టార్ రేటింగ్ అదిరిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి చూడలేదని పోలీసులే విస్తుబోతున్నారు.
సర్వం షాడో ఎమ్మెల్యేనే..
ఇటీవలి ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై వ్యవహరించి, ఇప్పుడు ఎమ్మెల్యేకు షాడోగా వ్యవహరిస్తున్న నాయకుడే పోలీసు బదిలీలు అన్నింటినీ ఫైనల్ చేస్తున్నారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఒక సర్కిల్ పోస్టును రూ.అర కోటికి ఖాయం చేశారు.
ఈ పోస్టు కోసం ఇద్దరు ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. చివరకు తన సర్వీసులో ఎక్కువ కాలం కాకినాడలోనే పనిచేసిన ఓ ‘త్రీ స్టార్’ అడిగినంతా ఇచ్చుకుని పోస్టు ఎగరేసుకుని పోయారు. ఇప్పుడు ప్రత్తిపాడుకు రూ. 10 లక్షల నుంచి మొదలై రూ.30 లక్షలకు ఖరారైంది.
అందుకే అంత ధర!
నాలుగు స్టేషన్లు ఉన్న ప్రత్తిపాడు సర్కిల్ అధికారులకు ఆయిల్ మాఫియా నుంచి నెల నెలా రూ.లక్షల్లో రాబడి వస్తుంది. మిగతా ఆదాయమూ పెద్దగానే ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో ఎస్‌ఐగా పనిచేస్తూ కల్తీ ఆయిల్ వ్యవహారంలో రూ.లక్షలు లంచం తీసుకొని ట్యాంకర్‌ను వదిలేసి, సస్పెండైన ఓ పోలీసు అధికారి, గుప్త నిధుల వ్యవహారంలో దొంగ సొమ్మునే దోచేసి చివరకు అసలు నిందితుడు పట్టుబడడంతో 2020లో సస్పెండైన మరో అధికారి కూడా ప్రత్తిపాడు కోసం ప్రయత్నించారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో మూడు, రూరల్‌లో రెండు, పెద్దాపురం నియోజకవర్గంలో ఒక సర్కిల్ పోస్టుకు ఒక్కో దానికి రూ.20 లక్షలు పైనే బేరం పెట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment