సాక్షి, అమరావతి: దేశంలో కూరగాయలకు డిమాండ్ భారీగా పెరగనుంది. 2030 నాటికి దేశంలో కూరగాయల కొరత ఏర్పడుతుందని, దేశంలో అవసరాలకు తగినంతగా ఉత్పత్తి ఉండదని జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే మాంసం, పండ్లకు కూడా స్వల్పంగా కొరత ఏర్పడుతుందని పేర్కొంది. 2030 నాటికి దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లు కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తి పెరుగుతుందా లేదా అనే అంశంపై నాబార్డు అంచనా వేసింది.
పంట తరువాత వృథాను కూడా తీసివేసిన తరువాత డిమాండ్, లభ్యతను లెక్కగట్టింది. 2030వ సంవత్సరానికి దేశంలో కూరగాయల డిమాండ్ 192 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, అయితే లభ్యత 160 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా 32 మిలియన్ టన్నుల కూరగాయల కొరత ఉంటుంది. అప్పటికి దేశంలో 103 మిలియన్ టన్నుల పండ్లు అవసరమైతే 93.1 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతాయని తెలిపింది. 9.9 మిలియన్ టన్నుల పండ్ల కొరత ఏర్పడుతుందని పేర్కొంది.
ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో 5.54 శాతం వాటాతో భారతదేశం రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఎగుమతులు చేసినప్పటికీ, చేపల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందని చెప్పింది. 2030 నాటికి చేపల డిమాండ్ 11.1 మిలియన్ టన్నులు ఉంటుందని, ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువగా 11.9 మిలియన్ టన్నులు ఉంటుందని వెల్లడించింది. గుడ్లు 5.8 మిలియన్ టన్నులు డిమాండ్ ఉండగా లభ్యత 5.9 మిలియన్ టన్నులు ఉంటుందని పేర్కొంది.
అదేవిధంగా పాలకు కొరత ఉండదని, అవసరానికంటే పాల ఉత్పత్తి ఎక్కువే ఉంటుందని వివరించింది. మాంసం అవసరానికంటే లభ్యత 1.2 మిలియన్ టన్నులు తక్కువ ఉంటుందని నివేదిక తెలిపింది. రైతులు పండించిన పంటలకు రవాణా వ్యయం తగ్గించేందుకు మార్కెటింగ్‌లో సమష్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.
సన్న, చిన్న కారు రైతులతో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతులకు మంచి ధరలకు హామీ లభిస్తుందని నివేదిక పేర్కొంది. వివిధ సమస్యలను అధిగమించేలా ఒప్పంద వ్యవసాయం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.
కూరగాయలకు భారీ డిమాండ్
Published Mon, Feb 27 2023 2:38 AM | Last Updated on Mon, Feb 27 2023 2:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment