తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద శ్రీవారి దర్శన టిక్కెట్ల కోసం క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు
తిరుమల: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం మంగళవారం తిరుపతిలో అనూహ్య రద్దీ ఏర్పడడంతో స్లాట్ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2లను తనిఖీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనూహ్య రద్దీ కారణంగా 2020కి పూర్వం ఉన్న విధానంలోనే భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతించామని తెలిపారు. దీంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం 20 నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా భక్తులు తిరుమలకు రావాలని సూచించారు.
టోకెన్లు ఉన్న భక్తుల దర్శనం పూర్తయిన అనంతరం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి అనుమతిస్తామని, ఇందుకు రెండురోజుల వరకు సమయం పడుతుందని చెప్పారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం పాలు, నీళ్లు అందిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment