srivari darshanam
-
జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి. ► మార్చి 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ► మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ► మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 65,051 మంది స్వామివారిని దర్శించుకోగా 23,107 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.78 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమల: సర్వదర్శనానికి 15 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ పరిస్థితికి చేరుకుంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, అలాగే ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న శ్రీవారిని 80,551 మంది దర్శించుకున్నారు. పెరటాసి మాసం కారణంగా రద్దీ కొనసాగగా.. సర్వదర్శనానికి ఏకంగా 35 గంటల సమయం పట్టింది. మరోవైపు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లుగా లెక్క తేలింది. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,028 మంది. -
తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ.. టీటీడీ సూచనలివి
సాక్షి, తిరుపతి: తిరుమలలో రద్దీ కొనసాగుతోందని, రద్దీ కారణంగా, భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. సోమవారం ఉదయం టీటీ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, శిలాతోరణం మార్గంలో గల క్యూలైన్స్, గోగర్భం డ్యాం వరకూ ఉన్న క్యూలైన్స్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం క్యూలైన్స్ వద్ద భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌఖర్యాలపై టీటీడీ అధికారులకు భూమన కరుణాకర్ రెడ్డి సలహాలు, సూచనలు చేసారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ..పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, స్వామీ వారి సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుందన్నారు. భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు. క్యూలైన్స్‌లో ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు రేయింబవళ్ళు కష్టపడి సౌఖర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు దగ్గరుండి సౌకర్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ టికెట్ల దర్శనాల్లో నియంత్రణ చేశామని భుమన తెలిపారు. నారాయణవనంలోని షెడ్లు దాటి ఐదు కిలో మీటర్ల దూరం మేర భక్తులు క్యూలైన్స్‌లో వేచి ఉన్నారని, లైన్లో ఉన్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా టీటీడీ అధికార యంత్రంగం పని చేస్తుందన్నారు. భక్తులకు ప్రాథమిక అవసరమైన ఆహారం, నీరును నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. భక్తుల భధ్రత, సౌఖర్యాల పట్ల టీటీడీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పని చేస్తుందన్నారు. గత మూడు రోజులుగా అధిక రద్దీ కొనసాగుతుందని, అయితే వర్షంలో కూడా యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ అధికారులు పని చేశారని, ఇది అభినందించ విషయమన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఉన్న నియంత్రణ పూర్తిగా తొలగించామని, నడిచి వెళ్ళే భక్తులకు మరింత భధ్రత కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అపాయం లేదని అటవీ శాఖా అధికారులు చెప్పే వరకూ నడక మార్గంలో ఆంక్షలను అలానే కొనసాగిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
TTD: శ్రీవారి ఉచిత(సర్వ) దర్శనానికి 24 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండడంతో.. క్యూలైన్ల బయట వేచి ఉన్నారు భక్తులు. ఈ క్రమంలో శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నేటి(శుక్రవారం) నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఎనభైవ దశకం నుంచి జేష్టాభిషేకం ప్రారంభించారు. ఉత్సవమూర్తుల అరుగుదల గురికావడంతో బింభరక్షనార్థం జేష్టాభిషేకం నిర్వహిస్తారు. 🙏 సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఉత్సవమూర్తులకు కవచాల తొలగిస్తారు. ఉత్సవమూర్తులకు కవచాలు తిలగించి, మరమ్మత్తులు చేపడుతారు. 🙏 మొదటి రోజు వజ్రాభరణాలు, రెండవరోజు ముత్యాల ఆభరణాలు, మూడవరోజు స్వర్ణకవచాలతో అలంకరణ చేపడతారు. ఎల్లుండి అర్జిత సేవలు రద్దు చేస్తారు. -
TTD: శ్రీవారి ఉచిత దర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ గత రెండ్రోజులతో పోల్చితే కొద్ది మేర తగ్గింది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి(ఉచిత) 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 75,871 మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 32,859 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం లభించింది. 🙏 అప్పలాయగుంటలో నేటి నుంచి ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మిధున లగ్నంలో ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు. నేటి నుంచి జూన్ 8 వరకు వైభవంగా జరగనున్నాయి అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు. 🙏 నారాయణవనం శ్రీపద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం తో ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి జూన్ 8 వరకు నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. -
ఆరు లక్షల టికెట్లు 60 నిమిషాల్లో ఖాళీ
తిరుమల: శ్రీవారి దర్శనాలకు ఆన్లైన్లో డిమాండ్ కొనసాగుతూనే ఉంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను భక్తులు 60 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసేసుకున్నారు. ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తే కేవలం 9 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 6.2 లక్షల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే గంటా 25 నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేసేశారు. దీంతో టీటీడీ ఖాతాలో గంట వ్యవధిలో రూ.18.6 కోట్లు జమైంది. వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించి రోజుకు వెయ్యి చొప్పున మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే గంటా 35 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు. ఇక మూడు నెలలకు సంబంధించి రూ.10 వేల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే భక్తులు నుంచి అదే స్పందన లభిస్తోంది. మూడు నెలల కాలానికి సంబంధించిన 46 వేల టికెట్లను విడుదల చేస్తే రెండు గంటల వ్యవధిలో 10 వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేయడంతో టీటీడీకి రూ.10 కోట్లు జమైంది. ఇలా ధరలతో సంబంధం లేకుండా శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయడమే తరువాయి అన్నట్లుగా భక్తులు పొందుతున్నారు. కాగా, తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి వరకు 61,265 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
శ్రీవారి దర్శనానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ (ఫొటోలు)
-
శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కేంద్రం వద్దకు చేరుకుంది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 82,392 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 41,800 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.59 కోట్లు వేశారు. ఆ ట్రస్ట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు: టీటీడీ తిరుమలలో ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఉచితంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనుందని, అన్నదానం పేరిట ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తామంటూ సికింద్రాబాద్‌కు చెందిన అనంతగోవిందదాస ట్రస్ట్ విరాళాలు కోరడాన్ని టీటీడీ గుర్తించింది. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్ నంబరును కూడా సదరు ట్రస్ట్ అందుబాటులో ఉంచింది. ఈ ట్రస్ట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. అక్రమంగా విరాళాలు సేకరించే ఇలాంటి ట్రస్ట్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. పది కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ రోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆ విధంగా భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరబోవని తెలియజేసింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. క్యూలైన్లో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలను టీటీడీ అందిస్తోంది. దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,361 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.53 కోట్లు వేశారు. స్వామి వారి సేవలో ప్రముఖులు శ్రీవారిని శనివారం చత్తీస్‌గఢ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎం.వేలుమణి, ఏపీ రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, సినీ నటుడు నిఖిల్, కార్తికేయ–2 చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. -
శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వీరికి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్మెంట్ల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 92,328 మంది స్వామిని దర్శించుకున్నారు. 52,969 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.36 కోట్లు వేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి క్యూలైన్ ఆస్థాన మండపం వద్దకు చేరుకుంది. అద్దె గదులు దొరకకపోవడంతో భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు. -
కొండ కిటకిట
తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోవడంతో 3 కి.మీ మేర భక్తులు వేచి ఉన్నారు. నడక మార్గం నుంచి కూడా భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనం నుంచి ఆళ్వార్ ట్యాంక్ మీదుగా ఏటీసీ, ఎస్ఎంసీ మీదుగా లేపాక్షి సర్కిల్ దాటుకుని, షాపింగ్ కాంప్లెక్స్, పాత అన్నదానం మీదుగా రాంభగీచ, ఆక్టోపస్ బిల్డింగ్ వద్దకు క్యూలైన్ చేరుకుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 నుంచి 6 గంటలు, సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు భక్తులు హుండీలో రూ.4.27 కోట్లు వేశారు. -
శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. వారాంతాలు, వరుస సెలవలు రావడంతో ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూలైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 64,079 మంది దర్శించుకోగా 32,852 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో భక్తులు రూ. 3.52 కోట్లు సమర్పించారు. శనివారం విపరీతంగా భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రద్దీ విపరీతంగా ఉన్నందున, భక్తులు వారి యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. భక్తులకు ఇబ్బందుల్లేకుండా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూలైన్లో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్న ప్రసాదం, తాగు నీరు, పాలు వంటివి అందించాలన్నారు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. -
కనరో భాగ్యము.. గత 70 ఏళ్లలో ఎన్నో మార్పులు
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. కొలిచిన వారి కొంగు బంగారం కోనేటి రాయుడి దివ్యమంగళ దర్శనానికి భక్తజన కోటి పోటెత్తుతోంది. ఒకప్పుడు రోజుకు వందల్లో వచ్చే భక్తులు.. ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా స్వామివారి దర్శన విధానాల్లో మార్పులు చేస్తూ వస్తున్నారు. గతంలో ప్రతి భక్తుడూ కులశేఖర పడి వరకు వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. ఇప్పుడు దాదాపుగా జయవిజయల గడప నుంచే స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. గత 70 ఏళ్లుగా శ్రీవారి దర్శన విధానంలో జరుగుతున్న మార్పులపై కథనం.. 1950 నుంచి భక్తుల సంఖ్యలో పెరుగుదల ఇలా.. ►1950 ఏడాది మొత్తంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2 లక్షల 26 వేల మంది మాత్రమే. అంటే సగటున రోజుకి 619 మంది. ►1960కి ఈ సంఖ్య 11 లక్షల 67 వేలకు చేరింది. అప్పట్లో సగటున రోజుకు 3,197 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ►1970లో భక్తుల సంఖ్య ఏడాదికి 33 లక్షల 94 వేలకు చేరింది. ఈ లెక్కన రోజుకి 9,299 మంది దర్శించుకున్నారు. ►1980లో ఏడాది కాలానికి 79 లక్షల 52 వేల మంది శ్రీవారిని దర్శించుకోగా, రోజువారీగా భక్తుల సంఖ్య 21,786కి చేరుకుంది. ►1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది. 1990 ఏడాదిలో 1.18 కోట్ల మంది.. అంటే నిత్యం సరాసరి 32,332 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ►2000 సంవత్సరంలో 2 కోట్ల 37 లక్షల 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. రోజువారీ భక్తుల సంఖ్య 65 వేలకు చేరింది. ►2010 ఏడాదిలో స్వామిని దర్శించుకుంది 2 కోట్ల 55 లక్షల మంది కాగా.. నిత్యం 70 వేల మంది భక్తులకు స్వామి దర్శనభాగ్యం లభించింది. ►2020కి భక్తుల సంఖ్య 2 కోట్ల 70 లక్షలకు చేరింది. రోజువారీగా స్వామిని దర్శించుకునే వారి సంఖ్య 75 వేలకు పెరిగింది. శ్రీవారి దివ్యమంగళరూపాన్ని అతి దగ్గర నుంచి దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల సంఖ్య పరిమితంగా ఉండటంతో 1992 వరకు శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే సౌలభ్యం కల్పించారు. ఇప్పుడు స్వామివారిని దాదాపు 50 అడుగుల దూరం నుంచే దర్శించుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా భక్తుల రద్దీకనుగుణంగా దర్శన విధానంతో పాటు క్యూలైన్ విధానంలోనూ టీటీడీ మార్పులు చేస్తూ వచ్చింది. దర్శనం, క్యూలైన్ విధానాల్లో మార్పులు ఇలా.. ►1950లో భక్తులు మహాద్వారం నుంచే నేరుగా ఆలయంలోకి ప్రవేశించే సౌలభ్యం ఉండేది. ►1970లో రోజువారీ భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది. పీపీసీ షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం టీటీడీ ప్రారంభించింది. ►1984 వచ్చే సరికి రోజువారీ భక్తుల సంఖ్య 30 వేల దాకా చేరుకోవడంతో ఆ ఏడాది మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ►1992 వరకు భక్తులందరినీ కులశేఖరపడి వరకు అనుమతిస్తూ వచ్చిన టీటీడీ 1992 డిసెంబర్లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. ►2001లో రోండో క్యూ కాంప్లెక్స్‌ని నిర్మించారు. ఏడాదిలో దాదాపుగా 150 రోజుల పాటు క్యూలైన్ వెలుపలికి భక్తులు వస్తుండటంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ►2005 నాటికి భక్తుల తాకిడి అన్యూహంగా పెరగడంతో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. జయవిజయల గడప నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ►2014లో మహాలఘు విధానంలోనే మూడు వరుసల క్యూలైన్ ప్రవేశపెట్టారు. ఆగమశాస్త్రం ప్రకారం క్యూలైన్ విధానంలో మార్పులు చేసే వెసులుబాటు లేకపోవడంతో టీటీడీ ప్రస్తుతం భక్తులు క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయిస్తూ.. కేటాయించిన సమయానికి భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకుంటే 2 నుంచి 3 గంటల్లో స్వామివారి దర్శనం కల్పిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఇదే తరహాలో టోకెన్లు జారీ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినా.. పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవటంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయంపై టీటీడీ దృష్టి సారించింది. -
దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం
తిరుమల: దళారీ వ్యవస్థకు టీటీడీ చెక్ పెడుతుండడంతో శ్రీవారి ఖజానా కాసులతో నిండుతోంది. సిఫార్సు వ్యవస్థని ఆసరాగా చేసుకొని జేబులు నింపుకుంటున్న దళారులను ఇంటిదారి పట్టించడంతో శ్రీవారి ఖజానాకు ఏడాదికి రూ.500 కోట్లు పైగానే ఆదాయం లభిస్తోంది. దర్శనాలు, ప్రసాదాలు సులభతరంగా లభిస్తుండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామి దర్శనం తరువాత అధిక ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. ఈ డిమాండ్‌ను దళారీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2004కి పూర్వం శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రోజుకి లక్ష వరకు మాత్రమే తయారు చేసేవారు. దీంతో భక్తులు అదనపు లడ్డూల కోసం దళారులను ఆశ్రయించేవారు. సిఫార్సు లేఖలపై కేటాయించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు రూ.50 చొప్పున దళారీలు విక్రయించేవారు. 2004లో బూందీ పోటుని ఆలయం వెలుపలికి మార్చడంతో లడ్డూల తయారీని దశలవారీగా టీటీడీ పెంచుతూ వచ్చింది. రోజుకి 3 నుంచి 5 లక్షల లడ్డూలు తయారుచేసే వెసులుబాటు లభించడంతో సిఫార్సు లేఖలు లేకుండా భక్తులకు లడ్డూ ప్రసాదాలు పొందే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నడకదారి భక్తులకు మాత్రం ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తుండడం, అదనపు లడ్డూలను వివిధ స్లాబ్‌లలో అందజేశారు. ఇదే అదనుగా దళారులు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కుమ్మక్కై లడ్డూ టోకెన్లు పక్కదారి పట్టిస్తూ భక్తులుకు అదనపు లడ్డూలను రూ.50 చొప్పున విక్రయించడం ప్రారంభించారు. దీంతో టీటీడీ ఈ స్లాబ్‌ల విధానాన్ని రద్దు చేసింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదంతోపాటు అదనంగా లడ్డూలు కావాలంటే రూ.50 చెల్లిస్తే చాలు కోరినన్ని లడ్డూలు అందించే ఏర్పాటు చేసింది. దీంతో దళారీ వ్యవస్థకు చెక్ పడింది. దీని ద్వారా శ్రీవారి ఖజానాకు ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయం లభిస్తోంది. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) దర్శన దళారీలకు బ్రేక్ దర్శన విధానంలోనూ దళారీ వ్యవస్థకు బ్రేకులు వేయడంలో టీటీడీ సఫలీకృతమైంది. గతంలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను డిమాండ్ బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు దళారీలు విక్రయించేవారు. దీంతో శ్రీవారి ఖజానాకు గండి పడుతుండగా, భక్తుల జేబుకు చిల్లుపడేది. అదే సమయంలో భక్తులు అందించే విరాళాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించడం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం కోసం ప్రారంభించిన శ్రీవాణి ట్రస్ట్‌కి రూ.10 వేలు విరాళంగా అందిస్తే చాలు. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించడం టీటీడీ ప్రారంభించింది. దీనికి భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 2019 అక్టోబర్‌లో ప్రారంభించిన ఈ పథకానికి మొదటి సంవత్సరం రూ.57 కోట్లు విరాళంగా అందగా, 2020లో రూ.76 కోట్లు విరాళాలు అందితే, 2021లో రూ.217 కోట్లు విరాళంగా అందాయి. ఇక ఈ ఏడాది శ్రీవాణి ట్రస్ట్‌కి నెలకు రూ.20 కోట్లు చొప్పున ఏడాదికి రూ.250 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. దీంతో దళారీ వ్యవస్థకి చెక్ పడగా మరోవైపు భక్తుల సొమ్ము నేరుగా స్వామి ఖజానాకు చేరుతోంది. ఇలా దర్శన, ప్రసాదాల విక్రయాలలో దళారీ వ్యవస్థ ను రూపుమాపేలా టీటీడీ సంస్కరణలు తీసుకురావడంతో ఏడాదికి స్వామి వారికి అదనంగా రూ.500 కోట్ల ఆదాయం లభిస్తోంది. -
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి 36,936 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.51 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. అద్దె గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నడక దారి భక్తులకు గ్రీన్ కార్పెట్ అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చలించిపోయారు. భక్తులు కాళ్లు కాలకుండా యుద్ధప్రాతిపదికన గ్రీన్‌కార్పెట్ ఏర్పాటు చేయించారు. ఆయన శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో నడక దారిలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడివరకు భక్తులు కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూసి ఈ ఏర్పాట్లు చేయించారు. భక్తులు టీటీడీ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
3 గంటల్లోనే శ్రీవారి దర్శనం
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,265 మంది దర్శించుకోగా, స్వామివారికి 31,217 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.50 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనం 3 గంటల్లోనే లభిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫొటోలు నిషేధం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమతాలకు సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అలాంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలు కలిగి ఉన్న ఎడల వాటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు వివరించి తీసివేస్తున్నారు. కావున వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి వారపు సేవలు తాత్కాలికంగా రద్దు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో వేసవిలో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. అందులో భాగంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా టీటీడీ రద్దు చేయనుంది. ఈ సేవలు రద్దు చేసిన రోజుల్లో కూడా సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే టీటీడీ శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇకపై శుక్రవారం అభిషేక సేవ మినహా మిగిలిన వారపు సేవలన్నీ జూన్ 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు సమాచారం. -
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 67,681 మంది దర్శించుకున్నారు. 31,738 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.54 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. -
అన్నదానం కాంప్లెక్స్‌లో మరో దాతల కౌంటర్
తిరుమల: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బుధవారం దాతల కోసం మరో కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ప్రారంభించారు. దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. అయితే చిన్నమొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఈ కౌంటర్ ఏర్పాటైంది. భక్తులు ఇక్కడ రూ.100 నుంచి విరాళాలు అందించవచ్చు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ప్రత్యేకాధికారి జి.ఎల్.ఎ.శాస్త్రి, యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్ శాస్త్రి, బ్రాంచ్ మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల రద్దీ హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారిని మంగళవారం 67,858 మంది దర్శించుకున్నారు. స్వామికి 28,536 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.15 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో భక్తులకు సకల సౌకర్యాలు
తిరుమల: కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు సిబ్బందిని దింపి భక్తులకు అన్ని రకాల సేవలు అందిస్తోంది. అన్నప్రసాద కేంద్రాలు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లతోపాటు ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం, పాలు, అన్నప్రసాదం పంపిణీ చేస్తోంది. ఆయా విభాగాల అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే.. దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే లక్ష్యంతో ఈ నెల 17 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తుల మధ్య తోపులాట లేకుండా చూస్తున్నారు. పరిశుభ్రంగా క్యూ కాంప్లెక్స్‌లు మరోవైపు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లోనూ మెరుగైన పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రధాన కల్యాణకట్టతోపాటు మినీ కల్యాణకట్టల్లో 24 గంటలపాటు క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. తిరుమలలో రోజూ 1,700 మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తుండగా.. తిరుపతిలో మరో 300 మంది స్థానిక ఆలయాల్లో భక్తులకు సేవలు అందిస్తున్నారు. మరో 200 మంది పరకామణి సేవల్లో ఉన్నారు. భక్తుల లగేజీ కౌంటర్ల వద్ద కూడా అదనపు సిబ్బంది సేవలు అందిస్తున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ ఈ నెల 11 నుంచి 17 వరకు తిరుమలను దర్శించిన భక్తులు, వారికి అందిన సేవలు.. ► శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 5,29,926 ► తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 2,39,287 ► అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు: 10,55,572 ► భక్తులకు కేటాయించిన గదులు: 30,650 ► అశ్విని ఆస్పత్రిలో వైద్యసేవలు పొందిన భక్తుల సంఖ్య: 10,768 రద్దీకి అనుగుణంగా.. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే లక్ష్యంతో గత వారంలో నాలుగు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశాం. సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కౌంటర్లలో భక్తులకు నిరంతరాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నాం. భక్తులు సంచరించే అన్ని ముఖ్య ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాం. గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లోనే శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నాం. సోమవారం నుంచి బ్రేక్ దర్శనాలను ప్రారంభించాం. – ఎ.వి.ధర్మారెడ్డి, అదనపు ఈవో, టీటీడీ కాస్త తగ్గిన భక్తుల రద్దీ తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఆదివారం 68,299 మంది భక్తులు దర్శించుకోగా 26,421 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.90 కోట్లు కానుకల రూపంలో వేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. -
సౌకర్యంగా శ్రీవారి దర్శనం
తిరుమల: కరోనా తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల అనంతరం సప్తగిరులు భక్తజన శోభను సంతరించుకున్నాయి. శ్రీవారి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తుల తాకిడి మరింత పెరిగింది. టీటీడీ ఉన్నతాధికారులు, యంత్రాంగం భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో తలమునకలవుతున్నారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా టీటీడీ అధికారులు ఫిజికల్ వెయిటింగ్ క్యూలైన్ సిస్టంను ప్రారంభించారు. టికెట్లు లేకుండానే తిరుమలకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులను లేపాక్షి కూడలి నుంచి వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్‌ల్లోకి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక షెడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్యూలైన్ల పరిశీలన అధిక రద్దీ దృష్ట్యా భక్తులకు కావాల్సిన సదుపాయాలను నిరంతరం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గంటకోసారి క్యూలైన్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు అందించడమే కాకుండా క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా విజిలెన్స్ పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వివిధ విభాగాధిపతులతో ప్రతి గంటకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్షిస్తూ తగిన సూచనలు ఇస్తున్నారు. కాగా, శ్రీవారిని మంగళవారం 72,567 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 40,465 మంది తలనీలాలు సమర్పించగా.. శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.32 కోట్లు సమకూరింది. పనిగట్టుకుని దుష్ప్రచారం: ధర్మారెడ్డి తిరుపతిలో 2016వ సంవత్సరం నుంచి ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ జారీ చేస్తోందని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న మూడు రోజులకు టోకెన్లు జారీ పూర్తవ్వడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు బుధ, గురు, శుక్రవారాలకు సంబంధించి రోజుకి 35 వేల టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభించామన్నారు. శ్రీగోవిందరాజస్వామివారి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద టోకెన్లు జారీ చేసే సమయంలో కేవలం 20 వేల మంది భక్తులు మాత్రమే ఉన్నారన్నారు. అదేరోజు దర్శన టోకెన్లు పొందాలనే భక్తుల ఆత్రుత కారణంగా క్యూలైన్లో ఇబ్బందులు తలెత్తాయన్నారు. దర్శన టోకెన్లు ఉన్నాయని సిబ్బంది ఎంతగా నచ్చజెప్పినా భక్తులు వినలేదన్నారు. భక్తుల రద్దీని టీటీడీ సరిగా మేనేజ్ చేయలేకపోయిందని కొంతమంది ఆరోపించడం బాధాకరమన్నారు. ముందస్తుగా సిద్ధం కావడం వల్లే అరగంటలోనే భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించామన్నారు. అయినా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశాయన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు పునఃప్రారంభిస్తామన్నారు. సమావేశంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిశోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చక్కగా స్వామి దర్శనం క్యూలైన్లో, షెడ్డులో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచి సదుపాయాలను టీటీడీ కల్పించింది. స్వామివారిని చక్కగా దర్శించుకున్నాం. షెడ్లలో నిరంతరం అల్పాహారం, జల ప్రసాదం, పాలను పంచిపెట్టారు. – కస్తూరి, నరసరావుపేట టైం స్లాట్ విధానమే మేలు టైం స్లాట్ విధానమే చాలా బాగుంటుంది. ఆ విధానం ద్వారా టైంకి దర్శనం చేసుకుని బయటకు రావచ్చు. షెడ్లో చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. రద్దీ కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్నాం. ఇంతమంది వచ్చినా టీటీడీ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. – బాబు, పుత్తూరు అద్దె గదులు దొరకలేదు వసతి గదులు దొరకలేదు. వెయిటింగ్ హాల్లోనే బస చేసి స్వామి వారిని దర్శించుకున్నాం. అద్దె గదులన్నీ మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. – శివ నాగేంద్ర, వినుకొండ -
భక్తుల రద్దీ.. స్లాట్ టోకెన్ల రద్దు
తిరుమల: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం మంగళవారం తిరుపతిలో అనూహ్య రద్దీ ఏర్పడడంతో స్లాట్ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2లను తనిఖీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనూహ్య రద్దీ కారణంగా 2020కి పూర్వం ఉన్న విధానంలోనే భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతించామని తెలిపారు. దీంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం 20 నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా భక్తులు తిరుమలకు రావాలని సూచించారు. టోకెన్లు ఉన్న భక్తుల దర్శనం పూర్తయిన అనంతరం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి అనుమతిస్తామని, ఇందుకు రెండురోజుల వరకు సమయం పడుతుందని చెప్పారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం పాలు, నీళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. -
ఒక్క రోజులో 61,052 మందికి శ్రీవారి దర్శనం
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారిని ఆదివారం అర్ధరాత్రి వరకు 61,052 మంది దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామి వారికి 27,500 మంది తలనీలాలు సమర్పిం చారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.57 కోట్లు వేశారు. సర్వ దర్శనం టోకెన్లు ఇస్తున్న తేదీలకు అనుగుణంగా భక్తులు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజు సత్రం సముదా యాల్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ కేటాయిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దర్శనానికి వచ్చే 48 గంటల ముందు చేయించుకున్న కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు. -
ఆ మూడు రోజులూ వారికి అనుమతి లేదు
తిరుమల: సామాన్య భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఇకపై గురు, శుక్ర, శనివారాల్లో సిఫార్సు లేఖలు కలిగిన భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రంలోనే గుర్తించి కొండపైకి అనుమతించబోమని టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి స్పష్టం చేశారు. శనివారం ఆయన తిరుపతిలోని అలిపిరి, తిరుమలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. టీటీడీ నిఘా, భద్రతా అధికారులకు, ఇతర శాఖల అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారులను నమ్మవద్దని, దళారులెవరైనా ప్రలోభాలకు గురి చేస్తే టీటీడీ భద్రత, నిఘా అధికారులకు తెలియజేయాలని కోరారు. శ్రీవారి దర్శన టికెట్లను పెంచిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలను తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. -
15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు
తిరుమల: కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన శ్రీవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు అనుమతి మేరకు ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్‌లైన్‌లో రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లోనూ రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవల అనుమతికి సంబంధించి ఈ నెల 17న జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ల జారీకి సంబంధించి వెబ్ పోర్టల్ సిద్ధమైందన్నారు. టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించిన దాతలకు ప్రివిలేజ్ కింద శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9.30 నుంచి భక్తులు టీటీడీ వెబ్సైట్ నుంచి శ్రీవారి ఉదయాస్తమాన సేవాటికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్వీబీసీలో ప్రచారం చేస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు..
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ మరోసారి భక్తులకు తెలిపింది. పలువురు భక్తులు నెగిటివ్ సర్టిఫికెట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. దీనివల్ల అనేక మంది భక్తులు ఇబ్బందికి గురవుతున్నారు. ఇటీవల కోవిడ్ మూడో వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. భక్తులు తమ ఆరోగ్యం, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టీటీడీ కోరింది. -
కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే శ్రీవారి దర్శనం
-
పేద వర్గాలకు వరం.. ‘దివ్య దర్శనం’
తిరుమల: శ్రీవారి దివ్య దర్శనం విధానం పేద వర్గాలకు వరంగా మారుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రాష్ట్ర భక్తులకు ప్రయోగాత్మకంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు భక్తులకూ అదే తరహా ఏర్పాట్లకు సిద్ధమైంది. శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. అయితే వ్యయప్రయాసలకోర్చి శ్రీనివాసుడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తులు కోకొల్లలు. తమ జీవిత కాలంలో స్వామి కరుణించకపోతారా, ఎప్పటికైనా దర్శన భాగ్యం లభించకపోతుందా అని నిరీక్షించే భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ దివ్యదర్శనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేద భక్తులకు ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యాలతో స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. అది కూడా పర్వదినాల సమయంలో కావడం విశేషం. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజుల పాటు 13 జిల్లాలకు చెందిన భక్తులకు ఈ సౌకర్యం టీటీడీ కల్పించింది. నిత్యం రెండు జిల్లాల భక్తులను తిరుమలకు తీసుకొచ్చి స్వామి దర్శనభాగ్యం కల్పించింది. ఇలా తొమ్మిది రోజుల పాటు 248 మండలాల నుంచి 6,464 మంది భక్తులు ఉచితంగా స్వామిని దర్శించుకున్నారు. ఇందులో ఎíస్సీలు 3,485 మంది, ఎస్టీలు 2,114 మంది, మత్స్యకారులు 382 మంది భక్తులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో దర్శన భాగ్యం కలిగింది. తమ చిరకాల వాంఛను ఇలా సులభతరంగా తీర్చిన టీటీడీకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు భక్తులకూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో కూడా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు (రోజూ సుమారు 1000 మందికి) స్వామివారి దర్శనభాగ్యం ఉచితంగా కల్పించాలని పాలక మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల భక్తులకు స్వామి దర్శనం కలగనుంది. మామూలుగా స్వామి దర్శనమే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటిది ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుండటం భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. నేడు వర్చువల్ సేవా దర్శన టికెట్ల విడుదల తిరుమల శ్రీవారికి జనవరి 1, 2 తేదీలు, 13 నుంచి 22, 26 తేదీలలో వర్చువల్ విధానంలో జరిపే సేవా దర్శనానికి సంబంధించి 5,500 టికెట్లను గురువారం సాయంత్రం 4 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదేవిధంగా జనవరి 1, 13 నుంచి 22 తేదీల వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రోజుకు 20 వేల చొప్పున, జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31వ తేదీల వరకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లను 24వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల వసతికి సంబంధించి 27న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. కాగా, జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. భక్తులు ఆన్లైన్లో ముందుగా దర్శన, వసతిని బుక్ చేసుకోవాలి. -
‘శ్రీవారి దర్శనం’పై అసత్య కథనాలు హేయం
తిరుమల: భక్తులను టీటీడీ కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని భారత్ మార్గ్ అనే యూట్యూబ్ చానల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. లాక్డౌన్ సమయంలో 21 రోజులపాటు శ్రీవారికి నైవేద్యం సమర్పించలేదని ఆ చానల్లో ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. లాక్డౌన్ సమయంలో కేవలం భక్తులకు దర్శనాలు రద్దు చేశారే తప్ప, స్వామికి పూజలు, నైవేద్యాలు యథాతథంగా కొనసాగాయని వివరించింది. సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసి, మత మార్పిడులను అరికట్టేందుకు సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో 2021 అక్టోబరు 7 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించినట్లు వెల్లడించింది. ఇదే తరహాలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని వివరించింది. టీటీడీ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లను పోషిస్తోందని, జెరూసలేం, హజ్ యాత్రలకు నిధులు అందిస్తోందనడం పూర్తి అవాస్తవమైన ఆరోపణగా టీటీడీ కొట్టిపారేసింది. గోసంరక్షణకు టీటీడీ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ఇందులో భాగంగా తిరుపతి, పలమనేరు గోశాలల్లో దేశవాళీ ఆవుల సంరక్షణతోపాటు వాటి సంతతిని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే.. భక్తులను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ఆరోపణలు చేయడం, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం తగదని సూచించింది. ఈ విధంగా దుష్ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. -
TTD: నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ
తిరుమల: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్ నెలల టికెట్లను టీటీడీ ఆన్లైన్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. గత నెలలో రోజుకు 8 వేల ఎస్ఈడీ టికెట్లు జారీ చేయగా ప్రస్తుతం రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను విడుదల చేయగా మధ్యాహ్నం 1:30 గంటలకల్లా భక్తులు వీటిని కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా శ్రీవారి ఎస్ఈడీ టికెట్ల కోసం ఆన్లైన్లో ప్రయత్నించడంతో రికార్డు సమయంలో టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు లభించలేదు. టీటీడీ ఐటీ విభాగం, టీసీఎల్, జియో సంస్థ క్లౌడ్ మేనేజ్మెంట్ విధానం సాయంతో భక్తులు సులభంగా ఆన్లైన్లో టికెట్లను పొందారు. వెబ్సైట్లోకి ప్రవేశించేందుకు వర్చువల్ క్యూ ద్వారా ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు సమయాన్ని కేటాయించారు. అనంతరం భక్తులు వర్చువల్ క్యూ పద్ధతి ద్వారా వెబ్సైట్లోకి ప్రవేశించి టికెట్లను బుక్ చేసుకున్నారు. దీంతో సర్వర్ల క్రాష్ సమస్య లేకుండా భక్తులు టికెట్లను పొందగలిగారు. టీటీడీకి రూ.21 కోట్ల ఆదాయం ఒకానొక దశలో దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్సైట్లో ఏడు లక్షల హిట్లు వచ్చాయి. కేవలం మొదటి 24 నిమిషాల్లోనే రెండు లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. 45 నిమిషాల వ్యవధిలో 3.35 లక్షల టికెట్లు, గంటలో 4 లక్షల 20 వేల టికెట్లు భక్తులు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 6 లక్షల 50 వేల టికెట్లు, 1.30 గంటలకు నవంబర్, డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.21 కోట్ల ఆదాయం లభించింది. భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో టీకా ఒక డోసు, రెండు డోసుల సర్టిఫికెట్, 12 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టుతో గానీ శ్రీవారి దర్శనానికి రావచ్చు. శనివారం ఉదయం 9 గంటలకు నవంబర్‌కు సంబంధించిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
7 నుంచి 14 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం
తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయించనున్నారు. హిందూ ధర్మ ప్రచారం, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలను టీటీడీ నిర్మించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో వెనుకబడిన వర్గాల భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకురానున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో ఇద్దరు సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గం మధ్యలో ఆహార పానీయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. దర్శన టికెట్లు ఉంటేనే అనుమతి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గానీ, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్టు గానీ తప్పనిసరిగా తీసుకురావాలని సోమవారం టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పలువురు భక్తులు దర్శన టికెట్లు లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నామని తెలిపింది. ఇతర ఆలయాల్లోనూ టీటీడీ విధానాలు! 9 కమిటీలతో అధ్యయనం భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీలో అమలు చేస్తున్న విధానాలను.. దేవదాయ శాఖ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన వారం కిందట జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల మేరకు దేవదాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. ఆన్లైన్లో పూజ టికెట్ల జారీ, బంగారు ఆభరణాల డిజిటలైజేషన్, నిర్వహణ, ఆలయ భద్రత, అవసరమైన సామగ్రిని పారదర్శకంగా కొనుగోలు చేయడం తదితర అంశాలపై దేవదాయ శాఖలో పనిచేసే కీలక అధికారులతో 9 కమిటీలను ఏర్పాటు చేస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఆయా కమిటీల్లోని సభ్యులు 2 విడతల్లో తిరుమల ఆలయాన్ని సందర్శించి.. టీటీడీలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఈ నెల 5–9 తేదీల మధ్య 4 బృందాలు, 18–22 తేదీల మధ్య 5 బృందాలు తిరుమల సందర్శనకు వెళ్లాలని ఆదేశించారు. -
శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తులను మోసగించిన నిందితుడిని తిరుమల టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రమేష్‌ల కథనం మేరకు.. భువనగిరికి చెందిన వెంకటేష్ శ్రీవారి దర్శనం చేసుకోవాలని తిరుపతికి చెందిన నాగరాజు అనే దళారిని ఆశ్రయించాడు. తమ కుటుంబంలోని 11 మంది సభ్యులకు రూ.300 దర్శనం టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు నాగరాజు రూ.16,500 అవుతుందని తెలిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంకటేష్ మొదటి విడతగా ఫోన్‌పే ద్వారా రూ.8 వేలను నాగరాజుకు పంపాడు. అనంతరం తిరుపతికి చేరుకున్న వెంకటేష్‌కు టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరుతో గతంలో వచ్చిన మెసేజ్‌ను ఎడిట్ చేసి నకిలీ మెసేజ్‌ను పంపాడు నాగరాజు. సదరు మెసేజ్‌తో తిరుమలకు చేరుకున్న వెంకటేష్ చైర్మన్ కార్యాలయాల్లో సంప్రదించగా ఆ మేసేజ్ నకిలీదిగా తేలింది. దీంతో భక్తులు తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా నాగరాజును అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని రావాలని పోలీసులు సూచించారు. -
శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పించండి
సారంగాపూర్(జగిత్యాల): తిరుపతిలోని శ్రీవారి దర్శనం కోసం టికెట్లు కావాలంటూ ఓ భక్తుడి ఫోన్‌కు స్పందించి పనయ్యేలా చూశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన సాయిని తిరుపతి స్రవంతి దంపతులు, వారి ఇద్దరు కుమారులు, తల్లినర్సమ్మతో కలసి శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని తెలియకపోవడంతో ఈనెల 2న కరీంనగర్ నుంచి రైల్లో బయల్దేరేందకు టికెట్లు మాత్రమే రిజర్వు చేయించుకున్నారు. ఈ నెల 1న వీరికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న తిరుపతి ఆన్లైన్ టికెట్ల కోసం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేయగా..స్పందించిన ఆయన వారి వివరాలను వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపమని చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి ఈనెల 3న శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించారు. దర్శనం అనంతరం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ మెసేజ్ ద్వారా తిరుపతి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు: టీటీడీ
తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లు, సేవా టికెట్ల పేరుతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెలా 20వ తేదీ ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ ఆధార్ కార్డు నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని కోరింది. -
కర్ఫ్యూ నుంచి శ్రీవారి భక్తులకు మినహాయింపు
తిరుమల: కరోనా నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆన్లైన్లో రూ.300 టికెట్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా మినహాయింపు ఇచ్చినట్లు టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. దర్శన టికెట్లున్న భక్తులు తిరుపతి చేరుకుంటే ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమల వచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవచ్చని చెప్పారు. దూరప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చే భక్తులు దర్శన టికెట్లను చూపి తిరుమలకు రావచ్చని తెలిపారు. భక్తులు లేక బోసిపోయిన క్యూలైన్లు తిరుమలలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ నిబంధనల్ని అనంతరం కర్ఫ్యూ నిబంధనల్ని పోలీసు అధికారులు అమలు చేస్తున్నారు. శ్రీవారిని మంగళవారం అతితక్కువ సంఖ్యలో 4,723 మంది భక్తులు దర్శించుకున్నారు. 2,669 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.39 లక్షలు లభించింది. బుధవారం కూడా దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మే నెలకు టీటీడీ ఆన్లైన్లో రోజుకు 15 వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇస్తుండగా అందులో సగం మంది కూడా స్వామి దర్శనానికి రాలేకపోతున్నారు. దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఈ సంవత్సరం చివరివరకు ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఆలయంతోపాటు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల వద్ద భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భక్తులు మాసు్కలు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని భక్తులకు మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. -
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆదివారం శుభవార్త చెప్పింది. ఆన్లైన్ దర్శనం టికెట్ల కోటాను పెంచుతున్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రతిరోజు ఇస్తున్న 6 వేల టికెట్లను జులై 1 నుంచి 9 వేల వరకు పెంచనున్నట్టు తెలిపింది. రేపు (సోమవారం) ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తామని చెప్పింది. రోజుకు 9వేల చొప్పున స్లాట్ల వారిగా అందుబాటులో ఉంచనున్నామని బోర్డు ప్రకటించింది. జులై 1 నుంచి రోజుకు 3 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నామని తెలిపింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారా.. ఒకరోజు ముందుగా భక్తులు టికెట్లు పొందొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం, జులై 30 నుంచి ఆగస్టు వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. (చదవండి: యూట్యూబ్ చానల్స్ ప్రతినిధుల బరితెగింపు) -
శ్రీవారి దర్శన టికెట్లకోసం పోటెత్తిన భక్తులు
-
నిబంధనల ప్రకారమే దర్శనాలు
-
వెంకన్నదర్శనం మహాభాగ్యం
-
మూడు రోజులు శ్రీవారి దర్శనం ట్రయల్ రన్
సాక్షి, తాడేపల్లి : కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు భౌతిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు, స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత అధికారుల సూచనల మేరకు శ్రీవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. ప్రతి భక్తుడు శానిటైజేషన్ చేసుకోవడంతో పాటుగా, భౌతిక దూరం పాటించాలని సూచించారు.(చదవండి : శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్) ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీరికి అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్ తర్వాతనే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి పుష్కరిణిలో భక్తుల స్నానానికి అనమతి లేదన్నారు. శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనాపై కేంద్రం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని కోరారు. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
-
తిరుమలలో మరిన్ని సంస్కరణలు
తిరుపతి ఎడ్యుకేషన్: కలియుగ ప్రత్యక్ష దైవమైన గోవిందుడు అందరివాడని, స్వామి దర్శనంలో పేద, ధనిక తేడా చూడకూడదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమలలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. అలాగే, స్వామివారిని త్వరగా దర్శించుకునేలా, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు మున్ముందు మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఐపీలకు సంబంధించి ప్రోటోకాల్, నాన్ ప్రోటోకాల్ దర్శనాలను తీసుకొచ్చి దళారీ వ్యవస్థను తగ్గించగలిగామని చెప్పారు. సర్వదర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు వసతి సౌకర్యాలు పెంచే అంశంపై దృష్టిసారిస్తున్నామని.. ఇందులో భాగంగా తిరుపతిలో మినీ టౌన్‌షిప్స్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, బాలాజి రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ ద్వారా తిరుమల నీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకోనున్నామని, అంతేకాక.. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మరో వంద కోట్లు బడ్జెట్‌ను పెంచనున్నట్లు చైర్మన్ తెలిపారు. సుమారు 15వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఉద్యోగుల వేతనాల పెంపుపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
మహాసంప్రోక్షణా... నిర్బంధమా?
సంప్రోక్షణ సమయంలో భక్తుల రాకను నిరోధిస్తూ తిరుమల ఆలయాన్ని పూర్తిగా మూసేయాల్సిన అవసరం ఏముంది? తాజా వివాదంపై డాక్టర్ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రజలు ఆసక్తి ప్రదర్శించడమేగాక, దేన్నో కప్పిపుచ్చుకోవడానికే టీటీడీ తాజా చర్యలకు ఉపక్రమించిందని అనుమానిస్తున్నారు. గర్భగుడికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాములవారి మేడ వరకూ 500 రంధ్రాలు వేయడం గురించి జనం మాట్లాడుకుంటున్నారు. రహస్య నిధి అన్వేషణకు శాస్త్రీయ పద్ధతిలో ఏమైనా పరిశోధన జరుగుతోందా? అసలు టీటీడీ పథకం ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబులు అవసరం. అన్ని ప్రధాన హిందూ దేవాలయాల్లో మహా సంప్రోక్షణం (వైష్టవాల యాల్లో) లేదా కుంభాభిషేకం (శివాలయాలు, ఇతర గుడుల్లో) పన్నెండేళ్లకోసారి చేయాలనే సంప్రదాయం ఉంది. తిరుమల గుడిలో వైఖానస ఆగమ సంప్ర దాయం పాటిస్తారు కాబట్టి 12 ఏళ్లకు ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని వైఖానస భృగులో ‘మహానిమితే సంప్రాసే మహాసంప్రోక్షణం మాచరితే’ అని సూచించారు. మహానిమితే అంటే– ఆలయంలో దోపిడీ జరిగినపుడు, పద్మపీఠంపై విగ్ర హం ఊగిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా కార ణాల వల్ల నైవేద్యం, పూజలు లేదా ఆరాధన ఆగి పోతే మహాసంప్రోక్షణం తప్పనిసరి అని అర్థం. కాని, తిరుమలలో మిరాసీ అర్చకులు నిర్ణయం మేరకు పన్నెండేళ్లకోసారి మహాసంప్రోక్షణం జరిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది నిర్వహించడం జరుగుతోంది. ఆలయం లోపల, కొన్నిసార్లు చిన్న, పెద్ద మరమ్మతులు జరపడానికి, అలంకారంలో భాగంగా కొన్నాళ్లకు నగల బరువు వల్ల విగ్రహం పద్మపీఠంపై కదిలే పరిస్థితి వచ్చినప్పుడు ఇది నిర్వహిస్తారు. ఏ గుళ్లో అయినా భక్తులు పెద్ద సంఖ్యలో చేరి ఆనందంతో గడిపే సందర్భం మహా సంప్రోక్షణం. గర్భగృహ గోపురంపైనున్న కుంభం నుంచి జాలువారే పవిత్ర సంప్రోక్షణ తీర్థం కోసం వారు పోటీపడతారు. తీర్థం చుక్కలు పడితే తలలు పవిత్రమవుతాయనేది వారి నమ్మకం. ఈసారి ఆగస్టు 9 సాయంత్రం నుంచి 17 ఉదయం 6 గంటల వరకూ శ్రీవారి ఆలయం మూసివేయాలని తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయిం చింది. ఇలాంటి సంప్రోక్షణ గురించి టీటీడీ బోర్డుకు తెలియదనే అభిప్రాయంతో నేను తిరుమలలో 1800 సంవత్సరం నుంచి ఈ విషయంపై నేను అధ్య యనం చేశాను. అప్పటి నుంచి సంప్రోక్షణ జరిగిన ఏ సందర్భంలోనూ ఇప్పటి బోర్డు నిర్ణయించినట్టు శ్రీవారి దర్శనాన్ని భక్తులకు నిరాకరించలేదు. ఇలా చేయడం మహా నిర్బంధమే. 1800 నుంచి మహా సంప్రోక్షణాలు 1800లో మిరాసీ అర్చకుడు శ్రీనివాస దీక్షితులు శ్రీవారి రెండు హస్తాలకు బంగారు పూత కోసం ఈ కార్యక్రమం జరిపించిన సమయంలో ప్రజలను మూలవిరాట్టు దర్శనానికి అనుమతించారు. 1908 సెప్టెంబర్ 30న ఆనంద నిలయంలో కొత్త బంగారు కలశం అమర్చినప్పుడు భక్తులకు దర్శనం కొన సాగించారు. ఇంకా 1934, 1946లో శ్రీవారికి కొత్త నగలతో ఇతర అలంకారాలు జరిగిన సందర్బంగా కూడా మూలవిరాట్టు దర్శనంపై ఆంక్షలేవీ లేకుండా మామూలుగానే భక్తులను అనుమతించారు. 1958 ఆగస్టులో పెద్ద స్థాయిలో జరిగిన బంగారు తాపడం పని సందర్బంగా మూల విరాట్టు దర్శనాన్ని మధ్యా హ్నం 12 నుంచి 3 గంటల మధ్యే కొనసాగించారు. 1970లో కూడా తిరుమల గుడిలో భారీ అదనపు ఏర్పాట్లు చేసినప్పుడు కూడా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించారుగాని కొన్ని గంటలకు కుదించారు. 1982లో బంగారు తాపడంతో కొత్త ధ్వజస్తంభం నిలబెట్టినప్పుడు కూడా కొన్ని నిర్ణీత వేళల్లో మూలవిరాట్టును దర్శించుకోవడానికి అనుమ తించారు. 1994, 2006లో చేపట్టిన సంప్రోక్షణ సందర్భంగా ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కుంభం నుంచి పవిత్ర తీర్థాన్ని భక్తులపై స్వయంగా చల్లారు. ఈ రెండుసార్లూ సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనానికి ఆటంకం కలగలేదు. 2006లో సర్వ దర్శనం ఆపకుండా దాన్ని కొన్ని గంటలకే పరిమితం చేశారు. ఈ వాస్తవాలు గమనిస్తే 1800 నుంచి 2006 వరకూ సంప్రోక్షణ జరిగిన సందర్భాల్లో మూల విరాట్టు దర్శనం ఆగలేదు గాని నిర్ణీత సమయాలకే పరిమితం చేశారనే విషయం స్పష్టమౌతోంది. దర్శనంతో పాటు హోమాలూ చూశారు! సంప్రోక్షణకు సంబంధించిన అన్ని పనులూ ఆనంద నిలయ ప్రాకారంలోని పాత కల్యాణ మండపం లోనే(ప్రస్తుత పరకామణి) గతంలో నిర్వహించారు. ప్రదక్షిణ చేస్తూ దేవుడి దర్శనంతోపాటు భక్తులకు యాగశాలలో జరిగే హోమాలు చూసే అవకాశం కూడా దక్కింది. సంప్రోక్షణ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 70 మంది రుత్విక్కులను ఎంపిక చేసి వారితో హోమాలు జరిపిస్తారు. వేద మంత్రా లతో చేసే దివ్య హోమాలు చూడటానికి భక్తులు కిట కిటలాడతారు. ఇంకా వేదాలు, మహాభారతం, భాగ వతం పారాయణం కూడా వారిని ఆకట్టుకునేలా సాగుతుంది. అయితే, ఈ ఏడాది ఇవన్నీ జరిగే సమ యంలో ఆలయంలోకి భక్తులను టీటీడీ అనుమతిం చడం లేదు. ఈ కార్యక్రమాలు చూడడానికి, పురా ణాల పఠనం వినడానికి భక్తులను విమాన ప్రదిక్షణ సమయంలో యాగశాల మీదుగా నడవడానికి అవ కాశం లేకుండా చేశారు. ఏకాంతంలో తప్ప బహిరం గంగా నిర్వహించే అన్ని ఇలాంటి పవిత్ర కార్యక్ర మాల్లో భక్తులు పాల్గొనడాన్ని మిరాసీ అర్చకులు ప్రోత్సహించేవారు. ప్రస్తుత ప్రధాన అర్చకుడు పూర్వపు ప్రధాన మిరాసీ అర్చకుల్లాంటి వ్యక్తి కాదు. టీటీడీ బోర్డు అంటే ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను నియమించింది. ఇతర అర్చ కులు టీటీడీ ఉద్యోగం కారణంగా కాంట్రాక్టుపై ఉన్న వారు. ఈ కారణంగా వారు సంప్రోక్షణ వంటి పవిత్ర కార్యక్రమాల్లో టీటీడీ అధికారుల జోక్యాన్ని అడ్డు కోలేరు. ఆలయ నిర్వహణ, అర్చనపై పూర్తి పట్టు, నియంత్రణ సంపాదించడానికి ఈ అధికారులు ఎప్పుడూ ఉవ్విళ్లూరుతుంటారనేది వాస్తవం. టీటీడీ నిర్వహణ సక్రమ మార్గంలో నడిచేలా మిరాసీ అర్చ కులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా వారు రాజకీయ కారణాలతో నియమితులైన టీటీడీ పాలకవర్గం లక్ష్యాలకు అవరోధంగా మారారు. భక్తులకు దర్శనభాగ్యం లేకుండా చేస్తారా? సంప్రోక్షణ సమయంలో భక్తుల రాకను నిరోధిస్తూ ఆలయాన్ని పూర్తిగా మూసేయాల్సిన అవసరం ఏముంది. భక్తుల రద్దీని తట్టుకోవడం కష్టమని చెబు తున్న కారణం సహేతుకంగా లేదు. సెప్టెంబర్, అక్టో బర్ మాసాల్లో వచ్చే పురత్తాసి శనివారాల్లో ఎప్పుడూ లేనంత సంఖ్యలో భక్తులు వస్తారు. చాలా మంది ఈ సమయంలో మందిరం బయటి నుంచే వరాహ స్వామి, బేడీ ఆంజనేయ స్వామి దర్శనంతోపాటు గోపుర దర్శనం చేసుకుంటారు. ఆనంద నిలయాన్ని కూడా చూస్తారు. తన దర్శనంపై నిర్ణయాధికారం వేంకటేశ్వరస్వామికి మాత్రమే ఉంటుందని అత్యధిక ప్రజానీకం నమ్ముతారు. ఒక వేళ ఎవరికైనా దర్శన భాగ్యం కలగకపోతే ఇది తమ ప్రాప్తమని భావిస్తారు. తాజా వివాదంపై డాక్టర్ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రజలు ఆసక్తి ప్రదర్శించడమేగాక దేన్నో కప్పిపుచ్చుకోవడా నికే టీటీడీ తాజా చర్యలకు ఉపక్రమించిందని అను మానిస్తున్నారు. గర్భగుడికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాములవారి మేడ వరకూ 500 రంధ్రాలు వేయడం గురించి జనం మాట్లాడుకుంటు న్నారు. రహస్య నిధి అన్వేషణకు శాస్త్రీయ పద్ధతిలో ఏమైనా పరిశోధన జరుగుతోందా? ఇందులో ఏమైనా నిజం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబులు అవసరం. తిరుమలలోని మూడు ప్రదేశాల్లో రహస్య నిధులున్నాయనే నమ్మకం విస్తృతంగా వ్యాపించింది. ఈ మూడింటిలో మొదటిది వేయి కాళ్ల మండపం. గతంలో మాస్టర్ ప్లాన్ పేరిట దాన్ని పద్ధతి లేకుండా తొలగించారు. రెండోది వకుళ మాత పోటు. ఇక్కడే శ్రీవారికి అన్న ప్రసాదాలు, నైవేద్యం తయారు చేస్తారు. ఇటీవల ఇక్కడ కూడా తవ్వకాలు జరిపారు. నేలను, గోడ పలకలను మార్చేశారు. మూడోది గర్భ గృహానికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాము లవారి మేడ వరకూ ఉన్న ప్రదేశం. దీనికి, ఆగస్టు 9 నుంచి 16 వరకూ భక్తులకు దర్శనం నిలిపివేయడా నికి ఏమైనా సంబంధం ఉందా? ఈ సందర్భంగా అనేక మంది మందిరం ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్టు కూడా చెబు తున్నారు. అంతేగాక సంప్రోక్షణ సమయంలో సీసీ టీవీ కెమేరాలు పనిచేయవని కూడా కొందరంటు న్నారు. ఈ అంశాలపై టీటీడీ వివరణ ఇస్తుందా? గతంలో కొత్త ఏర్పాట్లు, అలంకారాల కోసం మరమ్మ తులు జరిపిన సందర్భంగా చేసిన సంప్రోక్షణల సమ యంలో భక్తులను మూలవిరాట్టు దర్శనానికి అను మతించినప్పుడు ఈ ఏడాది జరిపే ఈ కార్య క్రమంలో ప్రజలు రాకుండా గుడిని పూర్తిగా ఎందుకు మూసేయాల్సి వస్తోంది? అంతటి గొప్ప ఆలయ నవీకరణ, మరమ్మతులు ఏం జరుగుతాయి? గుడిలో పాతవాటి స్థానంలో కొత్తవి ఏమేమి ఏర్పాటు చేస్తారు? స్వయంభూ సాలగ్రామ విగ్రహాన్నే మారు స్తున్నారా? సంప్రోక్షణ జరిగే రోజుల్లో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రహదారిని ఎందుకు మూసేస్తు న్నారు? ఈ కాలంలో ఎటువంటి తనిఖీలు లేకుండా టీటీడీ వాహనాలు కిందికి, పైకి పోవడానికి ఎలా అనుమతిస్తారు? అసలు టీటీడీ పథకం ఏంటి? టీటీడీ ధర్మాచార్యులు నిలదీయాలి! వీటినే కాకుండా, మరిన్ని ముఖ్య ప్రశ్నలతో మన ధర్మాచార్యులు టీటీడీని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకమండలి నుంచి జవాబులు రాబట్టే స్థాయి, అర్హత వారికున్నాయి. అలాగే హిందూ సమాజం సంక్షేమం కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. అందుకే వారు ప్రజల సమ క్షంలో ఈ ప్రశ్నలు లేవనెత్తాలి. హిందూ సమాజం కూడా స్పష్టమైన బాధ్యతతో నడుంబిగించాలి. మహాసంప్రోక్షణ సమయంలో లోపలికి అనుమతిం చకపోవడంపై నిరసన తెలుపుతూ టీటీడీ ఈఓకు లేఖలు రాసే అవకాశం ఉపయోగించుకోవాలి. తాజాగా ఏపీ సీఎం బాబు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పలేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నిరసనతో దిగిరాక తప్పలేదు. టీటీడీ బోర్డు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం గురించి ఆయనకు తెలి యదనుకోలేం. గత మహాసంప్రోక్షణాల కాలాల్లో మాదిరిగానే భక్తులను శ్రీవారి దర్శనానికి పరిమిత సమయాల్లో అనుమతించాలని సోషల్ మీడియా కారణంగా ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. వ్యాసకర్త ఎస్వీ బద్రి తమిళనాడు ఆలయ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక సభ్యులు contact@globalhinduheritagefoundation.org -
నేడు దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా కాలిబాట భక్తులకు 2 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాగా, సోమవారం వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం చంటి పిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ఉచిత ప్రత్యేక దర్శనం ఉంటుంది. -
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. స్వామివారిని శనివారం 82,660 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ. 2.26 కోట్లు వచ్చింది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి బిమిలేంద్ర నిధి శ్రీవారిని దర్శించుకున్నారు. -
క్యూలైన్లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం
-
క్యూలైన్లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుగు ప్రయాణంలో బస్సులు చాలక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ద్వాదశిని పురస్కరించుకుని శనివారం కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో నారాయణగిరి వనంలోని షెడ్లలోనూ వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఈరోజు అర్ధరాత్రి వరకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. శనివారంనాటి భక్తులకు రేపు దర్శనభాగ్యం ఉంటుంది. కాగా, తిరుమలలో గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల కొరతతో భక్తులకు అవస్థలు తప్పడంలేదు. బస్సు రాగానే ఎవరికివారు బస్సులో చోటు కోసం పరుగులు తీస్తున్నారు. . ... -
తిరుమలలో 30 గంటలుగా క్యూలైన్లోనే..
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అయింది. ఆలయంలో వైకుంఠ ద్వారాలను ఆలయ పెద్ద జీయర్ స్వామి తెరిచారు. ధనుర్మాస కైంకర్యాల అనంతరం విఐపి దర్శనం ప్రారంభం అయింది. స్వామి దర్శనానికి విఐపిలు బారులు తీరారు. సామాన్య భక్తులు 30 గంటలుగా క్యూలైన్లో పడిగాపులు పడుతూ చలికి అల్లాడుతున్నారు. నాలుగు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూలైన్లో వేచివున్నారు. ఉదయం 8 గంటలకు సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం ప్రారంభం అయింది. భక్తులు భారీగా తరలిరావడంతో వసతి దొరక్క రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశికి 3563 విఐపి టికెట్లను టీటీడీ జారీ చేసింది. విఐపిలకు 4 గంటలుగా శ్రీవారి దర్శనం కొనసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సంతానగౌడర్, హైకోర్టు న్యాయమూర్తులు రామలింగేశ్వర్రావు, శంకర్‌నారాయణ, సునీల్ చౌదరి,అమర్నాథ్గౌడ్, నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తులు డి.సుబ్రహ్మణ్యం, నూతి రామ్మోహన్, రవీంద్రన్ ఉన్నారు. అలాగే ఏపీ మంత్రులు కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, శిద్ధా రాఘవరావు, సోమిరెడ్డి, విప్‌లు మేడా మల్లికార్జునరెడ్డి, రామసుబ్బారెడ్డి, కోన రవికుమార్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, మాధవనాయకుడు, సుగుణమ్మ, బొల్లినేని రామారావు, సత్యప్రభ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలారి ఆదిత్య, అనిల్‌కుమార్ యాదవ్, మండలి బుద్ద ప్రసాద్, నారాయణస్వామి, రవీంద్రరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, సండ్ర వెంకటవీరయ్య, డి.కె.అరుణ ఉన్నారు. టీటీడీ మాజీ చైర్మన్లు కనుమూరి బాపిరాజు, చదలవాడ కృష్ణమూర్తి, సినీ నటులు మోహన్‌బాబు, సప్తగిరి, అంబరీష్, నిర్మాత బండ్ల గణేష్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు, మాజీ ప్రధాని దేవెగౌడ, చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మృదంగ వాద్య కళాకారుడు ఎల్లా వెంకటేశ్వర్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు 28 కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
అరచేతిలో వైకుంఠం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం టికెట్ కావాలంటే.. ఉదయం లేవగానే సమీపంలోని టీటీడీ కార్యాలయానికి పరిగెత్తడం, గంటల కొద్దీ క్యూ.. తీరా.. అందరిని దాటుకుని కౌంటర్ వద్దకు వెళ్లాక దర్శనం స్లాట్ ముగిసి వెనుదిరగడం.. ఒక్కోసారి ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది. ఇకపై భక్తులు ఇలాంటి ఇబ్బందులకు గురికాకుండా టీటీడీ–గోవిందా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీకు నచ్చిన సమయంలో దర్శనం వివరాలు తెలుసుకోవచ్చు. ఖాళీ ఉంటే వెంటనే ఫోన్లోనే బుక్ చేసుకోవచ్చు. అదెలాగంటే.. సాక్షి, తిరుమల : భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు కంకణధారణ లేదా ఆన్లైన్లో దర్శనం స్లాట్ రిజర్వ్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై ఎక్కడి నుంచైనా కేవలం చేతివేళ్లతో దర్శన సమయాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇటీవలే టీటీడీ టీసీఎస్ సౌజన్యంతో ఓ నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోవిందా తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ యాప్ ద్వారా స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు, అదనపు లడ్డూల కొనుగోలు, విరాళం అందించేందుకు ఈ యాప్ సహకరిస్తుంది. త్వరలో వసతి, ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలను కూడా పొందుపరుస్తామని టీటీడీ ప్రకటించింది. 30 కోట్ల మంది వరకూ ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. దర్శనం కోసం..: దర్శన్ ఆప్షన్లో మీరు ఎంచుకున్న తేదీ, సమయం, భక్తుల సమాచారం అందించాలి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిన వ్యక్తితో పాటు మరో 9 మంది వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అయితే, ప్రతి భక్తుడి ఆధార్ నంబరు, మరేదైనా గుర్తింపుకార్డు నంబరు అందించాల్సి ఉంటుంది. దర్శనానికి సంబంధించిన వివిధ సమయాలు, ఆ సమయంలో భక్తుల రద్దీ డిస్ప్లే అవుతుంది. రద్దీని బట్టీ వారి సమయాన్ని కేటాయించుకోవచ్చు. దర్శనంతోపాటు ప్రత్యేక పూజల వివరాలు కూడా ఉంటాయి. ఆ సమాచారం యాప్ ద్వారా తెలుసుకుని దర్శనంతో పాటు పూజలు కూడా నిర్వహించవచ్చు. దర్శనం/పూజ అనంతరం ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల చొప్పున యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ప్రతి లడ్డూకు రూ.25 అదనంగా చెల్లించాలి. చెల్లింపుల విధానం: ఆన్లైన్/యాప్ ద్వారా దర్శనం టికెట్ రూ.300 ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలి. వీటితో పాటు ప్రత్యేక పూజకు అయ్యే ఖర్చు, లడ్డూల మొత్తాన్ని కూడా ఒకే బ్యాంక్ అకౌంట్/కార్డు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలోని 44 అంతర్జాతీయ, జాతీయ, కార్పొరేషన్ బ్యాంకులతో టీటీడీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయా బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఆ సమాచారం అందించిన తర్వాత వినియోగదారుడికి ఎస్ఎంఎస్/ఈమెయిల్ ద్వారా మీ ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తిచేశారని లేదా అర్థంతరంగా రద్దయిందన్న సందేశం వస్తుంది. రద్దు చేసుకోవాలంటే..: దర్శనం స్లాట్ రిజర్వ్ చేసుకున్నాక రద్దు చేసుకునేందుకు ప్రస్తుతం వెసులుబాటు ఉందని, అయితే, రద్దుకు సంబంధించి చెల్లింపులు (రీపేమెంట్) సౌకర్యం అందుబాటులోకి రాలేదని టీటీడీ ప్రకటించింది. చెల్లింపుల సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తే మాత్రం సంబంధిత వినియోగదారుడికి ఏడు పనిదినాల్లో చెల్లింపులు చేస్తామని, అదీ వినియోగదారుడి నుంచి ఆధారపూరిత ఫిర్యాదు ఉంటేనే తప్పా రీపేమెంట్ చేయమని తెలియజేసింది. ఫిర్యాదులకు..: యాప్ వినియోగంలో సమస్యలు వస్తే టీడీటీ 1800245333333, 18002454141 నంబర్లలో లేదా refundrervicerr@tirumala.of ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లాగిన్ కావడం ఇలా..: గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి "GOVINDA TIRUMALA TIRUPATI DEVASTHANAMS'’ అని టైప్ చేయాలి. అక్షరాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేదంటే ఫేక్ యాప్స్ డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. డౌన్లోడ్ చేసుకున్నాక మీ మొబైల్‌కు యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్‌ను ఓపెన్ చేశాక రిజిస్ట్రేషన్‌కు తగిన వివరాలు అందించాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఈ–మెయిల్, ఫోన్ నంబరు, ఉంటున్న ప్రదేశం, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. 12ఏళ్లు పైబడిన వారు మాత్రమే యాప్ ద్వారా దర్శనం తదితర సేవలు అందుకునేందుకు అర్హులు. ఈ వివరాలు పొందుపరచాక నూతన వినియోగదారులు/భక్తుల లాగిన్ ఉంటుంది. అందులో ఈ–మెయిల్ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్ రూపొందించుకోవాలి. పాస్‌వర్డ్‌కు తప్పనిసరిగా నంబరు, చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాలు (ఇంగ్లిష్)తో పాటు ప్రత్యేక క్యారెక్టర్ తదితర వివరాలు ఇవ్వాలి.అనంతరం భక్తులు/వినియోగదారులు తమ ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు వంటి గుర్తింపుకార్డు నంబరును ఎంటర్ చేయాలి. వీటితో పాటు భక్తులు ముందుగా అందించిన ఫోన్ నంబరుకు ఓటీపీ (వన్‌టైం పాస్వర్డ్) వస్తుంది. అది పొందుపరిస్తే చాలు.. యాప్ వినియోగదారుడికి అందుబాటులోకి వస్తుంది. సత్వర సేవలకు మొబైల్ యాప్: శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం, వసతి తదితర సేవలను సత్వరం పొందేందుకు మొబైల్ యాప్‌ను రూపొందించాం. దీన్ని ఉగాదిరోజు నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. మున్ముందు మరింత విస్తరిస్తాం. ---డాక్టర్ దొండపాటి సాంబశివరావు, టీటీడీ ఈవో -
క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి
తిరుపతి : ఇంటర్నెట్, ఈ-దర్శనం కౌంటర్ల కోసం మూడు వందల రూపాయల టికెట్లను టీటీడీ ఈవో గోపాల్ బుధవారం విడుదల చేశారు. ఐదు వేల టికెట్లు విడుదల కాగా.. క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి. మరోవైపు విజయవాడలో ఈ టికెట్ల కోసం భారీ క్యూ కనిపించింది. ప్రయోగాత్మకంగా తొలివిడత 5 వేల టికెట్లు ఇచ్చారు. అందులో 2500 టికెట్లను ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా కేటాయించారు. మిగిలిన వాటిని టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల నుంచి కేటాయింపు జరిగింది. టీటీడీ ఈ-దర్శన్ టికెట్లను హైదరాబాద్ కౌంటర్లో 850, విశాఖపట్నం 675, విజయవాడ 350, కర్నూలు 100, తిరుపతి 200, నెల్లూరు 100, నిజామాబాద్ 75, వరంగల్ 75, అనంతపురం కౌంటర్లో 75 కేటాయించారు. టికెట్లు పొందిన భక్తులను ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటల సమయం స్లాట్లలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక ఇంటర్నెట్ ద్వారా టికెట్లు పొందే భక్తులు వారి ఫొటో గుర్తింపు కార్డును అప్లోడ్ చేసి, పేమెంట్ గేట్ వే ద్వారా క్రెడిట్, లేదా మాస్టర్ వీసా కార్డులద్వారా నగదు చెల్లింపులు చేయాలి. ఈ దర్శన కౌంటర్లలో భక్తులే నేరుగా వెళ్లి నగదు చెల్లించి ఫొటోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్ర, ఫొటో తీసుకుని టికెట్టు పొందవచ్చు. -
శ్రీవారి ఆన్లైన్ టికెట్లు ప్రారంభించిన టీటీడీ ఈవో
తిరుమల: తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం ఇంటర్నెట్, ఈ దర్శన్ కౌంటర్లకు రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ ఈవో ఎం.జి.గోపాల్ బుధవారం తిరుమలలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రోజుకు 5 వేల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ రోజు టికెట్ తీసుకున్నవారికి 7వ రోజు దర్శనం లభిస్తుందని తెలిపారు. అలాగే ఈ నెల 31వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఈ టికెట్లు విడుదల చేసిన కొన్ని నిముషాల వ్యవధిలోనే భక్తులు 300 టికెట్లు కొనుగోలు చేశారు.