కనరో భాగ్యము.. గత 70 ఏళ్లలో ఎన్నో మార్పులు | Last 70 Years Many Changes in Srivari Darshan, Que Line Procedures | Sakshi
Sakshi News home page

కనరో భాగ్యము.. గత 70 ఏళ్లలో ఎన్నో మార్పులు

Published Sun, Jul 3 2022 9:22 PM | Last Updated on Sun, Jul 3 2022 9:22 PM

Last 70 Years Many Changes in Srivari Darshan, Que Line Procedures - Sakshi

తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. కొలిచిన వారి కొంగు బంగారం కోనేటి రాయుడి దివ్యమంగళ దర్శనానికి భక్తజన కోటి పోటెత్తుతోంది. ఒకప్పుడు రోజుకు వందల్లో వచ్చే భక్తులు.. ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా స్వామివారి దర్శన విధానాల్లో మార్పులు చేస్తూ వస్తున్నారు. గతంలో ప్రతి భక్తుడూ కులశేఖర పడి వరకు వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. ఇప్పుడు దాదాపుగా జయవిజయల గడప నుంచే స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. గత 70 ఏళ్లుగా శ్రీవారి దర్శన విధానంలో జరుగుతున్న మార్పులపై కథనం.. 

1950 నుంచి భక్తుల సంఖ్యలో పెరుగుదల ఇలా.. 
►1950 ఏడాది మొత్తంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2 లక్షల 26 వేల మంది మాత్రమే. అంటే సగటున రోజుకి 619 మంది. 
►1960కి ఈ సంఖ్య 11 లక్షల 67 వేలకు చేరింది. అప్పట్లో సగటున రోజుకు 3,197 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 
►1970లో భక్తుల సంఖ్య ఏడాదికి 33 లక్షల 94 వేలకు చేరింది. ఈ లెక్కన రోజుకి 9,299 మంది దర్శించుకున్నారు. 
►1980లో ఏడాది కాలానికి 79 లక్షల 52 వేల మంది శ్రీవారిని దర్శించుకోగా, రోజువారీగా భక్తుల సంఖ్య 21,786కి చేరుకుంది. 
►1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది. 1990 ఏడాదిలో 1.18 కోట్ల మంది.. అంటే నిత్యం సరాసరి 32,332 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 
►2000 సంవత్సరంలో 2 కోట్ల 37 లక్షల 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. రోజువారీ భక్తుల సంఖ్య 65 వేలకు చేరింది.  
►2010 ఏడాదిలో స్వామిని దర్శించుకుంది 2 కోట్ల 55 లక్షల మంది కాగా.. నిత్యం 70 వేల మంది భక్తులకు స్వామి దర్శనభాగ్యం లభించింది. 
►2020కి భక్తుల సంఖ్య 2 కోట్ల 70 లక్షలకు 
చేరింది. రోజువారీగా స్వామిని దర్శించుకునే వారి సంఖ్య 75 వేలకు పెరిగింది.  
శ్రీవారి దివ్యమంగళరూపాన్ని అతి దగ్గర నుంచి దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల సంఖ్య పరిమితంగా ఉండటంతో 1992 వరకు శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే సౌలభ్యం కల్పించారు. ఇప్పుడు స్వామివారిని దాదాపు 50 అడుగుల దూరం నుంచే దర్శించుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా భక్తుల రద్దీకనుగుణంగా దర్శన విధానంతో పాటు క్యూలైన్‌ విధానంలోనూ టీటీడీ మార్పులు చేస్తూ వచ్చింది. 

దర్శనం, క్యూలైన్‌ విధానాల్లో మార్పులు ఇలా.. 
►1950లో భక్తులు మహాద్వారం నుంచే నేరుగా ఆలయంలోకి ప్రవేశించే సౌలభ్యం ఉండేది. 
►1970లో రోజువారీ భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది. పీపీసీ షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం టీటీడీ ప్రారంభించింది. 
►1984 వచ్చే సరికి రోజువారీ భక్తుల సంఖ్య 30 వేల దాకా చేరుకోవడంతో ఆ ఏడాది మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించారు. 
►1992 వరకు భక్తులందరినీ కులశేఖరపడి వరకు అనుమతిస్తూ వచ్చిన టీటీడీ 1992 డిసెంబర్‌లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. 
►2001లో రోండో క్యూ కాంప్లెక్స్‌ని నిర్మించారు. ఏడాదిలో దాదాపుగా 150 రోజుల పాటు క్యూలైన్‌ వెలుపలికి భక్తులు వస్తుండటంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 
►2005 నాటికి భక్తుల తాకిడి అన్యూహంగా పెరగడంతో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. జయవిజయల గడప నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.  
►2014లో మహాలఘు విధానంలోనే మూడు వరుసల క్యూలైన్‌ ప్రవేశపెట్టారు. 

ఆగమశాస్త్రం ప్రకారం క్యూలైన్‌ విధానంలో మార్పులు చేసే వెసులుబాటు లేకపోవడంతో టీటీడీ ప్రస్తుతం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌ విధానంలో కేటాయిస్తూ.. కేటాయించిన సమయానికి భక్తులు క్యూలైన్‌ వద్దకు చేరుకుంటే 2 నుంచి 3 గంటల్లో స్వామివారి దర్శనం కల్పిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఇదే తరహాలో టోకెన్లు జారీ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినా.. పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవటంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయంపై టీటీడీ దృష్టి సారించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement