
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూలైన్ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కేంద్రం వద్దకు చేరుకుంది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 82,392 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 41,800 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.59 కోట్లు వేశారు.
ఆ ట్రస్ట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు: టీటీడీ
తిరుమలలో ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఉచితంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనుందని, అన్నదానం పేరిట ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తామంటూ సికింద్రాబాద్‌కు చెందిన అనంతగోవిందదాస ట్రస్ట్ విరాళాలు కోరడాన్ని టీటీడీ గుర్తించింది. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్ నంబరును కూడా సదరు ట్రస్ట్ అందుబాటులో ఉంచింది. ఈ ట్రస్ట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. అక్రమంగా విరాళాలు సేకరించే ఇలాంటి ట్రస్ట్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.