తిరుమల: కరోనా తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల అనంతరం సప్తగిరులు భక్తజన శోభను సంతరించుకున్నాయి. శ్రీవారి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తుల తాకిడి మరింత పెరిగింది. టీటీడీ ఉన్నతాధికారులు, యంత్రాంగం భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో తలమునకలవుతున్నారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా టీటీడీ అధికారులు ఫిజికల్ వెయిటింగ్ క్యూలైన్ సిస్టంను ప్రారంభించారు. టికెట్లు లేకుండానే తిరుమలకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులను లేపాక్షి కూడలి నుంచి వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్‌ల్లోకి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక షెడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు క్యూలైన్ల పరిశీలన
అధిక రద్దీ దృష్ట్యా భక్తులకు కావాల్సిన సదుపాయాలను నిరంతరం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గంటకోసారి క్యూలైన్‌ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు అందించడమే కాకుండా క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా విజిలెన్స్ పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వివిధ విభాగాధిపతులతో ప్రతి గంటకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్షిస్తూ తగిన సూచనలు ఇస్తున్నారు. కాగా, శ్రీవారిని మంగళవారం 72,567 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 40,465 మంది తలనీలాలు సమర్పించగా.. శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.32 కోట్లు సమకూరింది.
పనిగట్టుకుని దుష్ప్రచారం: ధర్మారెడ్డి
తిరుపతిలో 2016వ సంవత్సరం నుంచి ఎస్‌ఎస్‌డీ టోకెన్లను టీటీడీ జారీ చేస్తోందని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న మూడు రోజులకు టోకెన్లు జారీ పూర్తవ్వడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు బుధ, గురు, శుక్రవారాలకు సంబంధించి రోజుకి 35 వేల టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభించామన్నారు. శ్రీగోవిందరాజస్వామివారి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద టోకెన్లు జారీ చేసే సమయంలో కేవలం 20 వేల మంది భక్తులు మాత్రమే ఉన్నారన్నారు.
అదేరోజు దర్శన టోకెన్లు పొందాలనే భక్తుల ఆత్రుత కారణంగా క్యూలైన్లో ఇబ్బందులు తలెత్తాయన్నారు. దర్శన టోకెన్లు ఉన్నాయని సిబ్బంది ఎంతగా నచ్చజెప్పినా భక్తులు వినలేదన్నారు. భక్తుల రద్దీని టీటీడీ సరిగా మేనేజ్ చేయలేకపోయిందని కొంతమంది ఆరోపించడం బాధాకరమన్నారు. ముందస్తుగా సిద్ధం కావడం వల్లే అరగంటలోనే భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించామన్నారు. అయినా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశాయన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు పునఃప్రారంభిస్తామన్నారు. సమావేశంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిశోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చక్కగా స్వామి దర్శనం
క్యూలైన్లో, షెడ్డులో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచి సదుపాయాలను టీటీడీ కల్పించింది. స్వామివారిని చక్కగా దర్శించుకున్నాం. షెడ్లలో నిరంతరం అల్పాహారం, జల ప్రసాదం, పాలను పంచిపెట్టారు.
– కస్తూరి, నరసరావుపేట
టైం స్లాట్ విధానమే మేలు
టైం స్లాట్ విధానమే చాలా బాగుంటుంది. ఆ విధానం ద్వారా టైంకి దర్శనం చేసుకుని బయటకు రావచ్చు. షెడ్‌లో చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. రద్దీ కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్నాం. ఇంతమంది వచ్చినా టీటీడీ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.
– బాబు, పుత్తూరు
అద్దె గదులు దొరకలేదు
వసతి గదులు దొరకలేదు. వెయిటింగ్ హాల్‌లోనే బస చేసి స్వామి వారిని దర్శించుకున్నాం. అద్దె గదులన్నీ మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు.
– శివ నాగేంద్ర, వినుకొండ
Comments
Please login to add a commentAdd a comment