
తిరుమల: సామాన్య భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఇకపై గురు, శుక్ర, శనివారాల్లో సిఫార్సు లేఖలు కలిగిన భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రంలోనే గుర్తించి కొండపైకి అనుమతించబోమని టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి స్పష్టం చేశారు. శనివారం ఆయన తిరుపతిలోని అలిపిరి, తిరుమలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. టీటీడీ నిఘా, భద్రతా అధికారులకు, ఇతర శాఖల అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారులను నమ్మవద్దని, దళారులెవరైనా ప్రలోభాలకు గురి చేస్తే టీటీడీ భద్రత, నిఘా అధికారులకు తెలియజేయాలని కోరారు. శ్రీవారి దర్శన టికెట్లను పెంచిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలను తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment