తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. వారాంతాలు, వరుస సెలవలు రావడంతో ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూలైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 64,079 మంది దర్శించుకోగా 32,852 మంది తలనీలాలు సమర్పించారు.
కానుకల రూపంలో భక్తులు రూ. 3.52 కోట్లు సమర్పించారు. శనివారం విపరీతంగా భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రద్దీ విపరీతంగా ఉన్నందున, భక్తులు వారి యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా
శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూలైన్‌లో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్న ప్రసాదం, తాగు నీరు, పాలు వంటివి అందించాలన్నారు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనాకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment