తిరుమల: శ్రీవారి దర్శనాలకు ఆన్‌లైన్‌లో డిమాండ్ కొనసాగుతూనే ఉంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను భక్తులు 60 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసేసుకున్నారు. ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే కేవలం 9 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు.
మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 6.2 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే గంటా 25 నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేసేశారు. దీంతో టీటీడీ ఖాతాలో గంట వ్యవధిలో రూ.18.6 కోట్లు జమైంది.
వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించి రోజుకు వెయ్యి చొప్పున మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే గంటా 35 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు.
ఇక మూడు నెలలకు సంబంధించి రూ.10 వేల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే భక్తులు నుంచి అదే స్పందన లభిస్తోంది. మూడు నెలల కాలానికి సంబంధించిన 46 వేల టికెట్లను విడుదల చేస్తే రెండు గంటల వ్యవధిలో 10 వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేయడంతో టీటీడీకి రూ.10 కోట్లు జమైంది.
ఇలా ధరలతో సంబంధం లేకుండా శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయడమే తరువాయి అన్నట్లుగా భక్తులు పొందుతున్నారు. కాగా, తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి వరకు 61,265 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఆరు లక్షల టికెట్లు 60 నిమిషాల్లో ఖాళీ
Published Sun, Feb 26 2023 4:02 AM | Last Updated on Sun, Feb 26 2023 9:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment