సాక్షి, తిరుపతి: తిరుమలలో రద్దీ కొనసాగుతోందని, రద్దీ కారణంగా, భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. సోమవారం ఉదయం టీటీ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, శిలాతోరణం మార్గంలో గల క్యూలైన్స్, గోగర్భం డ్యాం వరకూ ఉన్న క్యూలైన్స్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం క్యూలైన్స్ వద్ద భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు కల్పిస్తున్న సౌఖర్యాలపై టీటీడీ అధికారులకు భూమన కరుణాకర్ రెడ్డి సలహాలు, సూచనలు చేసారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ..పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, స్వామీ వారి సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుందన్నారు. భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు. క్యూలైన్స్‌లో ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు రేయింబవళ్ళు కష్టపడి సౌఖర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు దగ్గరుండి సౌకర్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ టికెట్ల దర్శనాల్లో నియంత్రణ చేశామని భుమన తెలిపారు. నారాయణవనంలోని షెడ్లు దాటి ఐదు కిలో మీటర్ల దూరం మేర భక్తులు క్యూలైన్స్‌లో వేచి ఉన్నారని, లైన్‌లో ఉన్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా టీటీడీ అధికార యంత్రంగం పని చేస్తుందన్నారు. భక్తులకు ప్రాథమిక అవసరమైన ఆహారం, నీరును నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. భక్తుల భధ్రత, సౌఖర్యాల పట్ల టీటీడీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పని చేస్తుందన్నారు.
గత మూడు రోజులుగా అధిక రద్దీ కొనసాగుతుందని, అయితే వర్షంలో కూడా యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ అధికారులు పని చేశారని, ఇది అభినందించ విషయమన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఉన్న నియంత్రణ పూర్తిగా తొలగించామని, నడిచి వెళ్ళే భక్తులకు మరింత భధ్రత కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అపాయం లేదని అటవీ శాఖా అధికారులు చెప్పే వరకూ నడక మార్గంలో ఆంక్షలను అలానే కొనసాగిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment