
అరచేతిలో వైకుంఠం
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం టికెట్ కావాలంటే.. ఉదయం లేవగానే సమీపంలోని టీటీడీ కార్యాలయానికి పరిగెత్తడం, గంటల కొద్దీ క్యూ.. తీరా.. అందరిని దాటుకుని కౌంటర్ వద్దకు వెళ్లాక దర్శనం స్లాట్ ముగిసి వెనుదిరగడం.. ఒక్కోసారి ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది. ఇకపై భక్తులు ఇలాంటి ఇబ్బందులకు గురికాకుండా టీటీడీ–గోవిందా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. మీకు నచ్చిన సమయంలో దర్శనం వివరాలు తెలుసుకోవచ్చు. ఖాళీ ఉంటే వెంటనే ఫోన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
సాక్షి, తిరుమల : భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు కంకణధారణ లేదా ఆన్‌లైన్‌లో దర్శనం స్లాట్ రిజర్వ్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై ఎక్కడి నుంచైనా కేవలం చేతివేళ్లతో దర్శన సమయాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇటీవలే టీటీడీ టీసీఎస్ సౌజన్యంతో ఓ నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోవిందా తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ యాప్ ద్వారా స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు, అదనపు లడ్డూల కొనుగోలు, విరాళం అందించేందుకు ఈ యాప్ సహకరిస్తుంది. త్వరలో వసతి, ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలను కూడా పొందుపరుస్తామని టీటీడీ ప్రకటించింది. 30 కోట్ల మంది వరకూ ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది.
దర్శనం కోసం..: దర్శన్ ఆప్షన్‌లో మీరు ఎంచుకున్న తేదీ, సమయం, భక్తుల సమాచారం అందించాలి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అయిన వ్యక్తితో పాటు మరో 9 మంది వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అయితే, ప్రతి భక్తుడి ఆధార్ నంబరు, మరేదైనా గుర్తింపుకార్డు నంబరు అందించాల్సి ఉంటుంది. దర్శనానికి సంబంధించిన వివిధ సమయాలు, ఆ సమయంలో భక్తుల రద్దీ డిస్‌ప్లే అవుతుంది. రద్దీని బట్టీ వారి సమయాన్ని కేటాయించుకోవచ్చు. దర్శనంతోపాటు ప్రత్యేక పూజల వివరాలు కూడా ఉంటాయి. ఆ సమాచారం యాప్ ద్వారా తెలుసుకుని దర్శనంతో పాటు పూజలు కూడా నిర్వహించవచ్చు. దర్శనం/పూజ అనంతరం ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల చొప్పున యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ప్రతి లడ్డూకు రూ.25 అదనంగా చెల్లించాలి.
చెల్లింపుల విధానం: ఆన్‌లైన్/యాప్ ద్వారా దర్శనం టికెట్ రూ.300 ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలి. వీటితో పాటు ప్రత్యేక పూజకు అయ్యే ఖర్చు, లడ్డూల మొత్తాన్ని కూడా ఒకే బ్యాంక్ అకౌంట్/కార్డు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలోని 44 అంతర్జాతీయ, జాతీయ, కార్పొరేషన్ బ్యాంకులతో టీటీడీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయా బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఆ సమాచారం అందించిన తర్వాత వినియోగదారుడికి ఎస్‌ఎంఎస్/ఈమెయిల్ ద్వారా మీ ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తిచేశారని లేదా అర్థంతరంగా రద్దయిందన్న సందేశం వస్తుంది.
రద్దు చేసుకోవాలంటే..: దర్శనం స్లాట్ రిజర్వ్ చేసుకున్నాక రద్దు చేసుకునేందుకు ప్రస్తుతం వెసులుబాటు ఉందని, అయితే, రద్దుకు సంబంధించి చెల్లింపులు (రీపేమెంట్) సౌకర్యం అందుబాటులోకి రాలేదని టీటీడీ ప్రకటించింది. చెల్లింపుల సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తే మాత్రం సంబంధిత వినియోగదారుడికి ఏడు పనిదినాల్లో చెల్లింపులు చేస్తామని, అదీ వినియోగదారుడి నుంచి ఆధారపూరిత ఫిర్యాదు ఉంటేనే తప్పా రీపేమెంట్ చేయమని తెలియజేసింది.
ఫిర్యాదులకు..: యాప్ వినియోగంలో సమస్యలు వస్తే టీడీటీ 1800245333333, 18002454141 నంబర్లలో లేదా refundrervicerr@tirumala.of ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
లాగిన్ కావడం ఇలా..: గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి "GOVINDA TIRUMALA TIRUPATI DEVASTHANAMS'’ అని టైప్ చేయాలి. అక్షరాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేదంటే ఫేక్ యాప్స్ డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంది. డౌన్‌లోడ్ చేసుకున్నాక మీ మొబైల్‌కు యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. యాప్‌ను ఓపెన్ చేశాక రిజిస్ట్రేషన్‌కు తగిన వివరాలు అందించాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఈ–మెయిల్, ఫోన్ నంబరు, ఉంటున్న ప్రదేశం, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. 12ఏళ్లు పైబడిన వారు మాత్రమే యాప్ ద్వారా దర్శనం తదితర సేవలు అందుకునేందుకు అర్హులు. ఈ వివరాలు పొందుపరచాక నూతన వినియోగదారులు/భక్తుల లాగిన్ ఉంటుంది. అందులో ఈ–మెయిల్ ద్వారా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ రూపొందించుకోవాలి. పాస్‌వర్డ్‌కు తప్పనిసరిగా నంబరు, చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాలు (ఇంగ్లిష్)తో పాటు ప్రత్యేక క్యారెక్టర్ తదితర వివరాలు ఇవ్వాలి.అనంతరం భక్తులు/వినియోగదారులు తమ ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు వంటి గుర్తింపుకార్డు నంబరును ఎంటర్ చేయాలి. వీటితో పాటు భక్తులు ముందుగా అందించిన ఫోన్ నంబరుకు ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్) వస్తుంది. అది పొందుపరిస్తే చాలు.. యాప్ వినియోగదారుడికి అందుబాటులోకి వస్తుంది.
సత్వర సేవలకు మొబైల్ యాప్: శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం, వసతి తదితర సేవలను సత్వరం పొందేందుకు మొబైల్ యాప్‌ను రూపొందించాం. దీన్ని ఉగాదిరోజు నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. మున్ముందు మరింత విస్తరిస్తాం. ---డాక్టర్ దొండపాటి సాంబశివరావు, టీటీడీ ఈవో