
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తులను మోసగించిన నిందితుడిని తిరుమల టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ రమేష్‌ల కథనం మేరకు.. భువనగిరికి చెందిన వెంకటేష్ శ్రీవారి దర్శనం చేసుకోవాలని తిరుపతికి చెందిన నాగరాజు అనే దళారిని ఆశ్రయించాడు. తమ కుటుంబంలోని 11 మంది సభ్యులకు రూ.300 దర్శనం టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు నాగరాజు రూ.16,500 అవుతుందని తెలిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంకటేష్ మొదటి విడతగా ఫోన్‌పే ద్వారా రూ.8 వేలను నాగరాజుకు పంపాడు.
అనంతరం తిరుపతికి చేరుకున్న వెంకటేష్‌కు టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరుతో గతంలో వచ్చిన మెసేజ్‌ను ఎడిట్ చేసి నకిలీ మెసేజ్‌ను పంపాడు నాగరాజు. సదరు మెసేజ్‌తో తిరుమలకు చేరుకున్న వెంకటేష్ చైర్మన్ కార్యాలయాల్లో సంప్రదించగా ఆ మేసేజ్ నకిలీదిగా తేలింది. దీంతో భక్తులు తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా నాగరాజును అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని రావాలని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment