
సాక్షి, రేణిగుంట: తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో క్లినిక్‌లో మొత్తం 5 మంది ఉన్నారు. ఆసుపత్రి పైఅంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసముంటోంది. దట్టమైన పొగలు అలుముకోవటంతో ఇద్దరు చిన్నారులు సిద్దార్థరెడ్డి, కార్తిక సహా డాక్టర్ రవిశంకర్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ భార్య, తల్లిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ముందుగా ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించగా.. క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ రవిశంకర్ భవనంలోనే చిక్కుకుపోయారు. రవిశంకర్‌ను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్ రవిశంకర్‌తో పాటు.. ఆయన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ రెడ్డి, కార్తికలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment