Private clinic
-
ప్రాణం ఖరీదు రూ.లక్ష!.. సూది మందు వికటించి వ్యక్తి మృతి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న నేటి రోజుల్లో రాతియుగం నాటి అనాగరిక సంస్కృతికి తెరలేపారు కొందరు. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందితే... రూ.లక్ష పరిహారం చెల్లించేలా దుప్పటి పంచాయితీ చేశారు. పెద్దల పంచాయితీకి వైద్యాధికారులు, పోలీసులూ తలొగ్గారు. ఆదివారం నిశిరాత్రి జరిగిన ఈ దారుణం సోమవారం తెల్లారేసరికి గుట్టుచప్పుడు కాకుండా తొక్కేశారు. సాక్షి, గుత్తి రూరల్: సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం తొండపాడుకు చెందిన నల్లబోతుల రంగయ్య (45), సునీత దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రంగయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జ్వరంతో బాధపడుతున్న రంగయ్య ఆదివారం రాత్రి కుమారుడు సాయంతో గుత్తిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ కృష్ణప్రసాద్ నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. డాక్టర్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీంతో వైద్యుడి సూచన మేరకు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే రంగయ్య మృతి చెందాడు. దీంతో డాక్టర్ కృష్ణప్రసాద్ వైద్యం సరిగా చేయకపోవడం వల్లనే రంగయ్య మృతి చెందాడంటూ బంధువులు, కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న డాక్టర్ కృష్ణప్రసాద్‌పై దాడికి యత్నించారు. సకాలంలో అక్కడకు చేరుకున్న సీఐ వెంకటరామిరెడ్డి, సిబ్బంది వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) డ్యూటీ సమయంలోప్రైవేట్ క్లినిక్‌లో ఇటీవల బదిలీపై గుత్తి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణప్రసాద్.. స్థానికంగానే ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ అదనపు ఆదాయంపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కాల్ డ్యూటీలో ఉన్న ఆయన... తన సొంత క్లినిక్‌లో పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రంగయ్య కుటుంబసభ్యులు నేరుగా ప్రైవేట్ క్లినిక్‌కు చేరుకున్నారు. పరీక్షించిన డాక్టర్ కృష్ణాప్రసాద్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి చేజారుతున్నట్లు గమనించిన డాక్టర్ వెంటనే... ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని రోగి కుటుంబసభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఘటనపై డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. జ్వర తీవ్రత కారణంగానే రంగయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. రోగి ప్రాణాలు కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నాలు వివరించారు. పంచాయితీ పెద్దలు పోలీసులేనా? రంగయ్య మృతికి డాక్టర్ కృష్ణ ప్రసాద్‌నే కారణమంటూ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దుప్పటి పంచాయితీకి తెరలేపినట్లు సమాచారం. వైద్యుడిని కాపాడే క్రమంలో బాధిత కుటుంబసభ్యులను రాజీ చేసి రూ.లక్ష పరిహారాన్ని డాక్టర్ కృష్ణప్రసాద్ చెల్లించేలా ఒప్పందం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. -
రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, రేణిగుంట: తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లోని ఓ ప్రైవేటు క్లినిక్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో క్లినిక్‌లో మొత్తం 5 మంది ఉన్నారు. ఆసుపత్రి పైఅంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసముంటోంది. దట్టమైన పొగలు అలుముకోవటంతో ఇద్దరు చిన్నారులు సిద్దార్థరెడ్డి, కార్తిక సహా డాక్టర్ రవిశంకర్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ భార్య, తల్లిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ముందుగా ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించగా.. క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ రవిశంకర్ భవనంలోనే చిక్కుకుపోయారు. రవిశంకర్‌ను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్ రవిశంకర్‌తో పాటు.. ఆయన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ రెడ్డి, కార్తికలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. -
వైద్యుడి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
- చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన - ముందే చెప్పి ఉంటే బతికించుకునే వారిమని ఆవేదన బేతంచెర్ల: స్థాయికి మించి వైద్య సేవలందించి చివర్లో చేతులెత్తేయ్యడంతో తమ కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ సంజీవనగర్ కాలనీకి చెందిన బాధిత కుటుంబీకులు శుక్రవారం బేతంచెర్లలో ప్రయివేటు క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. సంజీవనగర్ కాలనీకి చెందిన మురళీధర్‌రెడ్డి, సుజాత దంపతుల రెండవ కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి(4) డెంగి జ్వరంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మరణించాడు. అయితే ఈ నెల 19న బాలుడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ప్రయివేటు క్లినిక్‌లో చేర్పించారు. బాలున్ని పరీక్షించిన వైద్యుడు మలేరియా జ్వరం అంటూ చికిత్స నిర్వహించాడు. 4 రోజులైనా నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలున్ని పరీక్షించిన వైద్యులు డెంగి జ్వరంగా నిర్ధారించి వైద్యం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించాడు. అయితే బాలునికి సోకింది డెంగి జ్వరం అని ముందే చెప్పి ఉంటే తాము మెరుగైన వైద్యం చేయించి బతికించుకునే వారమని, ఏమీ తెలియకున్నా నాలుగురోజులపాటు చికిత్స అందిస్తూ బాలుని ప్రాణాలతో చెలగాటమాడి చివరకు చేతులెత్తేసి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడని ప్రయివేటు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విషజ్వరంతో విద్యార్థిని మృతి
గాంధీనగరం (శిరివెళ్ల ): విషజ్వరంతో మండలంలోని గాంధీనగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వట్టికట్టి శ్రీలక్ష్మి (16) బుధవారం మృతిచెందింది. ఈ నెల 27వ తేదీన సైన్స్ పరీక్ష రాయాల్సిన ఈ విద్యార్థిని..జ్వరం అధికం కావడంతో వైద్యం కోసం ఆళ్లగడ్డకు చికిత్స చేయించుకుంది. బుధవారం జ్వరం మరింత అధికం కావడంతో హుటాహుటిన యర్రగుంట్లలోని ఓ ప్రై వేట్ క్లినిక్‌కు తరలించగా అక్కడ పరిస్థితి విషమించింది. మెరుగైన lవైద్యం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలో దీబగుంట్ల వద్ద మృతి చెందింది. విషయం తెల్సుకున్న ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యం, టీచర్లు గ్రామానికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు. జ్వరం కారణంగా ఈ విద్యార్థిని శ్రీకాళహస్తీలో జరగనున్న రాష్ట్రస్థాయి త్వైక్వాండో పోటీలకు హాజరు కాలేకపోయిందని ఉపాధ్యాయులు తెలిపారు. -
క్లినిక్‌లు నిర్వహిస్తే చర్యలు
ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రైవేట్ క్లినిక్‌లను నిర్వహించే ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ హెచ్చరించారు. హాసనలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సేవలు అందించకుండా, ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వహణ ద్వారా సంపాదించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత నిజమేనని అంగీకరిస్తూ, కొత్త నియామకాలకు చర్యలు చేపడతామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో వైద్యుల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో స్వచ్ఛతను పాటించడానికి మేనేజ్మెంట్ వ్యవస్థను అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యులు విధిగా రెండేళ్ల పాటు గ్రామీణ సేవలను అందించాలనే నిబంధన విధించాలని యోచిస్తున్నామని, దీనికి కేంద్ర న్యాయ శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నించడం లేదని చెప్పారు. అయితే వారే జేడీఎస్‌ను వీడే యోచనలో ఉన్నారని తెలిపారు. దీనిపై ఆ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు.