వైద్యుడి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
Published Sat, Jul 1 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
- చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
- ముందే చెప్పి ఉంటే బతికించుకునే వారిమని ఆవేదన
బేతంచెర్ల: స్థాయికి మించి వైద్య సేవలందించి చివర్లో చేతులెత్తేయ్యడంతో తమ కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ సంజీవనగర్ కాలనీకి చెందిన బాధిత కుటుంబీకులు శుక్రవారం బేతంచెర్లలో ప్రయివేటు క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. సంజీవనగర్ కాలనీకి చెందిన మురళీధర్‌రెడ్డి, సుజాత దంపతుల రెండవ కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి(4) డెంగి జ్వరంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మరణించాడు. అయితే ఈ నెల 19న బాలుడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ప్రయివేటు క్లినిక్‌లో చేర్పించారు.
బాలున్ని పరీక్షించిన వైద్యుడు మలేరియా జ్వరం అంటూ చికిత్స నిర్వహించాడు. 4 రోజులైనా నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలున్ని పరీక్షించిన వైద్యులు డెంగి జ్వరంగా నిర్ధారించి వైద్యం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించాడు. అయితే బాలునికి సోకింది డెంగి జ్వరం అని ముందే చెప్పి ఉంటే తాము మెరుగైన వైద్యం చేయించి బతికించుకునే వారమని, ఏమీ తెలియకున్నా నాలుగురోజులపాటు చికిత్స అందిస్తూ బాలుని ప్రాణాలతో చెలగాటమాడి చివరకు చేతులెత్తేసి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడని ప్రయివేటు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement