విజయవాడకు సమీపంలోని కేసరపల్లి వద్ద నిర్వహణ
3.5 లక్షల మంది హాజరుకానున్నట్లు అంచనా
సభలో పాల్గొననున్న వీహెచ్‌పీ అగ్రనేతలు
సాక్షి, అమరావతి/గన్నవరం: ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కలిగించి, స్వయంప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగించేలా చట్ట సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం ‘హైందవ శంఖారావం’పేరుతో విజయవాడకు సమీపంలోని కేసరపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి, ఏపీ నుంచే తొలి బహిరంగ సభ నిర్వహించనుంది.
ఈ సభకు 3.5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. 30 ఎకరాల పరిధిలో బహిరంగ సభ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3,500కి పైగా బస్సులు, 7 రైళ్ల ద్వారా సభకు ప్రజలు తరలిరానున్నారు. సభకు నాలుగు వైపుల 150 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంఘాలు ఏపీలో చాలా ఏళ్ల తర్వాత ఇంతటి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా..వీహెచ్‌పీ, ఏబీవీపీ, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భజరంగ్‌దళ్, భారతీయ వికాస్ పరిషత్ వంటి 40కి పైగా సంస్థల ప్రతినిధులు ఈ సభను విజయవంతం చేసేందుకు 3 నెలలు పాటు పనిచేసినట్లు వీహెచ్‌పీ నేతలు చెప్పారు.
ఈ సభకు వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అర్గనైజింగ్ సెక్రటరీ మిలింద్ పరందే, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవిందదేవ్ గిరి మహరాజ్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్వామీజీలు హాజరుకానున్నారు. సభ నేపథ్యంలో ఆదివారం విజయవాడ, చట్టుప్రక్కల ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment