గెలుపు ధ్రువీకరణ పత్రంతో గురుమూర్తి
సాక్షి, తిరుపతి / సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. గత ఎన్నికలే కాదు 1989 నుంచి చూసినా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిన పార్టీలు ఫ్యాన్ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. బీజేపీ – జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కాగా టీడీపీ మరోసారి పరాజయం పాలైంది.
తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో గత నెల 17వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో 11,04,927 ఓట్లు పోల్ కాగా 64.42 శాతం ఓటింగ్ నమోదైంది. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించింది. తిరుపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ అక్కడే మకాం వేసి రోజుల తరబడి ప్రచారం నిర్వహించారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. తాను అధికారం చేపట్టిన తరువాత 22 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రజలకు లేఖ రాశారు.
56.67 శాతం ఓట్లతో విజయభేరీ..
తిరుపతి ఉప ఎన్నికలో పోలైన మొత్తం 11,04,927 ఓట్లలో అధికార పార్టీకి సగానికిపైగా 56.67 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదు కాగా 55.03 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా పోలింగ్ శాతం తగ్గినా గత ఎన్నికల కంటే 1.64 శాతం ఓట్లను అధికంగా వైఎస్సార్‌సీపీ సాధించడం గమనార్హం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగినా 2019 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 5.57 శాతం ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనసేన జతకట్టడంతో బీజేపీ 5.2 శాతం ఓట్లతో ఎట్టకేలకు ‘నోటా’ను అధిగమించింది. కాంగ్రెస్ 1.78 శాతం ఓట్లను కోల్పోగా సీపీఎం 0.5 శాతం ఓట్లకే పరిమితమైంది.
పోస్టల్ బ్యాలెట్ నుంచే ఆధిక్యం..
ఆదివారం ఉదయం 8 గంటలకు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సూళ్లూరుపేట, వెంకటగిరి గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైఎస్సార్‌సీపీ ఆధిక్యం కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లలో 809 ఓట్ల ఆధిక్యంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఖాతా తెరిచారు. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 35 నుంచి 40 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగారు. మొదటి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆధిక్యం పూర్తి స్థాయిలో కొనసాగింది. ఆ సమయంలో గురుమూర్తితోపాటు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొదటి రౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ రావడంతో పనబాక లక్ష్మి నిరుత్సాహంతో వెనుదిరిగారు.
మారుమూల గ్రామం.. మధ్య తరగతి కుటుంబం
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామం మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దెల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగు చేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ పూర్తి చేశారు.
మహానేత స్ఫూర్తి.. జగనన్న వెన్నంటి..
గురుమూర్తి స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నేతగా నాడు సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ కలిసేవారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే నడిచారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించిన రోజే ఆయన విజయం ఖరారైంది. ప్రజలపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని ఉప ఎన్నిక ఫలితం ద్వారా మరోసారి నిరూపించారు.
డిక్లరేషన్ అందుకున్న గురుమూర్తి..
ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎం.గురుమూర్తికి ఆదివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవిఎన్ చక్రధర్‌బాబు డిక్లరేషన్ అందజేశారు. గురుమూర్తితో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురుమూర్తి నెల్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ ఘన విజయం అందరిదీ
నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘23 నెలల పాలన తరవాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ ఘన విజయం ప్రజలందరిదీ. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజారిటీ ఇవ్వటం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పవి. ఇది నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ విజయం సాధ్యమైంది..’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment