
మంగళగిరిలో టిడ్కో ఇళ్లు
(నానాజీ అంకంరెడ్డి), సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ జగనన్న నగర్ (టిడ్కో)లో వందల కుటుంబాల వారు తమ సొంతింటి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ నిర్మించిన 1,728 టిడ్కో ఇళ్లల్లో దాదాపు 400 మంది ఉంటున్నారు. డిసెంబర్‌లో మంచి ముహూర్తాలు ఉండడంతో మిగిలిన వాళ్లు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లుచేసుకుంటున్నారు. ఇళ్లు పొందిన వారి పిల్లలు చిల్డ్రన్స్ డే సందర్భంగా సోమవారం టిడ్కో ప్రాంగణంలోని తమ ఫ్లాట్లలో కలియదిరుగుతూ గదుల్లోని గోడలను తడిమి చూసుకుని ఆనందంగా గడిపారు. విశాలమైన 60, 40 అడుగుల రోడ్లు.. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ, ప్రతిబ్లాక్‌కు 20 అడుల సెట్‌బ్యాక్, ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన 0.8 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న ఎస్టీపీతో చక్కటి ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది.
సిరామిక్ టైల్స్‌తో ప్రతి గదినీ ముచ్చటగా తీర్చిదిద్దారు. ‘ఇలాంటి చోట ఇంతమంచి ఇల్లు మా జీవితంలో కట్టుకోలేం’ అని లబ్ధిదారులు అంటున్నారంటే వారెంత ఆనందంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘దగ్గర్లోనే పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది, ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మంచిగా వైద్యం చేస్తున్నారంటూ స్థానిక మహిళ జ్యోతి చెప్పారు. ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలం సిద్ధమవుతోంది. అందరికీ ఉపయోపడేలా పార్కును కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలో 88 స్థానిక సంస్థల్లో నిర్మిస్తున్న 163 జీ+3 టిడ్కో అపార్ట్‌మెంట్లను ఇదే రీతిలో తీర్చిదిద్దుతున్నట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు.
పచ్చదనం కోసం త్వరలో మొక్కలు
విశాలమైన ఈ ఇళ్ల ప్రాంగణంలోని ప్రతి అపార్ట్‌మెంట్ సెట్‌బ్యాక్‌లోను పళ్ల మొక్కలు, రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. నివాసితుల అవసరాలకు అనుగుణంగా దుకాణాల నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ జగనన్న నగరాల నిర్వహణకు సంక్షేమ సంఘాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లల్లో ఇన్ని వసతులు ఉంటాయని ఊహించలేదని, ఇక్కడి నిర్మాణాలు చూశాక జగనన్న ప్రభుత్వం తమకెంత మేలుచేసిందో తెలిసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. ‘జగనన్న మాకు సొంతిల్లు ఇచ్చి ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. ఇప్పుడు అందులో ఆనందంగా అడుగుపెట్టాం. బయటి వారు ఎవరో వచ్చి మా ఆనందాన్ని నాశనం చేయాలని చూస్తే ఎలా సహిస్తాం!’ అంటూ గుంటి రాజలక్ష్మి (బి–6 బ్లాక్) అన్నారు.
చిన్న రేకుల షెడ్డులో ఉండేవాళ్లం
తెనాలి రోడ్డులోని రేకుల షెడ్డులో ఉండేవాళ్లం. చిన్నపాటి వర్షానికి కారిపోయేది. మా నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తారు. మాకు ఇక్కడ బి–21 బ్లాక్‌లో ఫ్లాట్ ఇచ్చారు. ఇప్పుడు సొంతింట్లో ఉంటున్నాం. దగ్గర్లోనే ప్లేగ్రౌండ్ కూడా ఉంది. చాలా ఆనందంగా ఉంది.
– ఎండీ యాకూబ్ బేగ్, 8వ తరగతి
అన్ని సౌకర్యాలు ఉన్నాయి
మా అమ్మ షాపులోను, నాన్న టైలర్‌గాను పనిచేస్తారు. చిన్న గది, ఇంటికి ఎవరొచ్చినా ఉండేందుకు అవకాశం ఉండేదికాదు. నా స్నేహితుల సొంతిళ్లను చూసినప్పుడు అలాంటి ఇల్లు మేం కొనుక్కోగలమా అని అనిపించేంది. జగన్నన పుణ్యమా అని ఇప్పుడు మాకూ ఇల్లు వచ్చింది.
– గుమ్మడి జ్యోతిక, ఇంటర్ సెకండియర్
మాటల్లో చెప్పలేని ఆనందం
ప్రైవేటు ఆస్పత్రిలో క్లర్క్‌గా పనిచేసే నేను సొంతిల్లు సంపాదించడం అసాధ్యం. చిన్న గదిలో అద్దెకుండేవారం. బంధువులొస్తే ఉండే అవకాశంలేదు. ఇప్పుడు అన్ని వసతులతో ఇల్లు ఇచ్చారు. మా అబ్బాయి ఎంతో మురిసిపోతున్నాడు. జగనన్న పుణ్మమాని అద్దె ఇంటి కష్టాలు తప్పాయి.
– షేక్ పర్హీన్, ప్రైవేట్ ఉద్యోగి
చిత్రంలో కనిపిస్తున్నామె పేరు షేక్ షహీనా. మంగళగిరి ఇస్లాంపేటలో అద్దె ఇంట్లో ఉండేవారు. ఈమె తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా సొంతిల్లు లేదు. ఇప్పుడు మంగళగిరిలో నిర్మించిన వైఎస్సార్ జగనన్న నగర్‌లోని బి–16 బ్లాక్‌లో ఫ్లాట్ పొందారు. ఇద్దరు పిల్లలతో సరైన ఇల్లులేక ఏడ్చిన సందర్భాలను ఈమె గుర్తుచేసుకున్నారు. ‘నా భర్త నిస్సార్ చెప్పుల దుకాణంలో పనిచేస్తారు. అరకొర జీతం. బంధువులు రాకూడదని షరతు. దీంతో ఎన్ని ఇళ్లు మారానో అల్లాకే తెలుసు.
ఇప్పుడు నా సొంతిట్లో ఉంటున్నాను. ఇదంతా జగనన్న చలవే’ అని చెమర్చిన కళ్లతో చెప్పారు. ఇక షహీనా తల్లి ఫైజాన్ మాట్లాడుతూ.. ‘అద్దె ఇంట్లో నీరు ఎక్కువ వాడుతున్నారని తిట్టేవారు. దాంతో మనవలను చూడాలన్న ఆశ ఉన్నా వెళ్లడానికి ఉండేది కాదు. ఇప్పుడు నా బిడ్డకు జగన్‌బాబు ఇల్లిచ్చారు. నేను ఇక్కడకు ఎప్పుడైనా రావొచ్చు. ఆయన మా పాలిట అల్లాహ్’.. అన్నప్పుడు కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి.
– ఈ తల్లీ బిడ్డల ఆనంద బాష్పాలకు ఖరీదుకట్టే షరాబు ఉన్నాడా?
నేను స్వేచ్ఛగా ఆడుకోవచ్చు..
ఇక్కడ చిత్రంలోని తల్లి జె.రాజ్యలక్ష్మితో కనిపిస్తున్న పిల్లాడి పేరు మోక్షజ్ఞ. ఏడో తరగతి. వీరు గతంలో చిన్న గదిలో అద్దెకుండేవారు. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తల్లి తెచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లు గడిచేది. ఇప్పుడు వీరికి టిడ్కో ప్రాజెక్టులో ఏ–7 బ్లాక్‌లో ఇల్లిచ్చారు. దీనిపై మోక్షజ్ఞ స్పందిస్తూ.. ‘ఇంతకుముందు ఆడుకునేందుకు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడిక్కడ ప్లేగ్రౌండ్ ఉంది. పార్కు కూడా కడతారట’.. అన్నప్పుడు బాబు కళ్లల్లో కనిపించిన మెరుపు వెలకట్టలేం. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘జగనన్న వచ్చాక నాకుంటూ సొంతిల్లు వచ్చింది’ అని చెప్పింది.
– ఈ తల్లీకొడుకుల్లో సంతోషం, ధీమా కనిపించాయి.
ఇరుకు గది నుంచి విశాల ప్రపంచానికి..
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు కరిష్మా. నాలుగో తరగతి చదువుతోంది. నాన్నలేని ఈ బిడ్డకు ఓ తమ్ముడు ఉన్నాడు. వంట పనిచేసి తల్లి తెచ్చే కొద్దిపాటి సంపాదనతో మంగళగిరి ఐదో వార్డులోని చిన్నరేకుల షెడ్డులో వీరుంటున్నారు. ఇక్కడ బి–37లో ఫ్లాట్ ఇచ్చారు. ఈ చిన్నారిని పలకరించినప్పుడు ‘మేం అద్దెకుండే రేకుల ఇల్లు వర్షం వస్తే కారిపోయేది. ఇక్కడ ఇల్లు వచ్చిందని తెలియగానే అమ్మ ఎంతో సంతోషపడింది. అమ్మను అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు’.
– ఆ చిన్నారి కళ్లల్లో వెలకట్టలేని వెలుగు కనిపించింది.
మా పిల్లలకు గర్వంగా చెబుతున్నా..
తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న షేక్ జానీది కష్టాల కథే. పదుల సంఖ్యలో ఇళ్లు కట్టిన ఈ మేస్త్రీకి నిన్నా మొన్నటిదాకా సొంత గూడులేదు. ‘మనం సొంతిల్లు కట్టుకోలేమా నాన్నా.. అని నా పిల్లలు అడిగినప్పుడు మనసు చివుక్కుమనేది. ఎన్నో ఇళ్లు కట్టిన నేను నా పిల్లలకు సమాధానం చెప్పలేకపోయేవాడిని. జగనన్న చలవవల్ల ఇప్పుడు నాకు పది లక్షల విలువైన ఇల్లు (బి–5)వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా జగన్ బాబు పుణ్యమే’ అంటున్నప్పుడు మేస్త్రీ జానీ కళ్లలో కృతజ్ఞత కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment