రూ.30 లక్షల మేర నష్టం
ఏడుగురు మత్స్యకారులు సురక్షితం
మహారాణిపేట(విశాఖ దక్షిణ): సముద్రంలో వేటకు వెళ్లిన బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. విశాఖ దక్షిణం వైపు 28 నాటికల్ మైళ్ల దూరం పూడిమడక సముద్ర తీరంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గనగళ్ల అప్పయ్యమ్మ బోటు ఈనెల 15న వేటకు వెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పూడిమడక ప్రాంతంలో బోటు నంబర్ ఐఎన్‌డి–ఏపీ–వి5–ఎంఎం–17తో చేపలు, రొయ్యల వేట సాగుతోంది. తొలుత బోటు ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి.
సిబ్బంది వెళ్లి ఇంజన్‌ను పరిశీలించగా, ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో బోటు సిబ్బంది వెంటనే సముద్రంలో దూకారు. వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. చూస్తుండగానే బోటు కాలిపోయింది. వేటాడిన మత్స్య సంపద, ఇతర సామగ్రి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మత్స్యకారులు మంగళవారం ఉదయానికి స్థానిక ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయట పడిన వారిలో వాసుపల్లి రాజు (36), వాసుపల్లి అప్పన్న (58), వాసుపల్లి దాసీలు (41), వాసుపల్లి అప్పారావు (41), గనగళ్ల ఎరికొండు (40), మైలపల్లి ఎరయ్య్ర (50), గనగళ్ల పోలిరాజు (20) ఉన్నారు.
బోటు దగ్ధం కావడంతో యజమానికి రూ.30 లక్షలు మేర నష్టం కలిగిందని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మీడియాకు తెలిపారు. సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులకు ఆశ్రయం కల్పించామన్నారు. ఘటనలో నష్టపోయిన బోటు యజమానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని కోరారు. ప్రమాదం విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్తానని సంఘం మాజీ అధ్యక్షుడు పి.సి.అప్పారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment