శ్రీకాకుళం రూరల్: జీవితాంతం కలిసి ఉంటానని పెళ్లినాడు చేసిన బాసలను అతను మరిచిపోయాడు. క్షణికావేశంలో కట్టుకున్న ఆలినే కడతేర్చాడు. ఈ విషాద ఘటన సానివాడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పొన్నాడ కల్యాణి (30) భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. భార్యభర్తల మధ్య మాటామాట పెరగడంతో క్షణికావేశంలో తలగడతో కల్యాణి ముఖంపై అదిమి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామస్తులంతా స్థానికంగా ఉన్న ఆలయంలో నిర్వహించే పూజల్లో నిమగ్నమై ఉన్నారు.
ఇదే గ్రామానికి చెందిన పొన్నాడ నవీన్‌కుమార్, అతని భార్య కల్యాణి రాత్రి ఎనిమిది గంటల నుంచి గొడవపడుతున్నారు. ఉపవాస దీక్ష చేయమని ఆడపడుచు అలేఖ్య సూచించగా.. దానికి కల్యాణి ససేమిరా అనేసింది. ఈ విషయం నవీన్‌కుమార్‌కు తెలియడంతో దంపతుల మధ్య మాటామాట పెరిగింది. సహనం కోల్పోయిన అతను క్షణికావేశంలో మంచంపై ఉన్న కల్యాణిపై దాడి చేసి తలగడతో ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
అక్కపై ప్రేమాభిమానాలే హత్యకు దారితీసిందా?
అక్కపై ఉన్న ప్రేమాభిమానాలే హత్యకు దారితీశాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్‌కుమార్‌కు ఇద్దరు అన్నదమ్ములు, అక్క ఉన్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతిచెందగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కూడా కోల్పోయారు. అక్క అలేఖ్య బాగోగులన్నీ నవీన్‌కుమార్ చూసుకుంటున్నాడు.
కోటబొమ్మాళి మండలం మంచాలపేట గ్రామానికి చెందిన పంచిరెడ్డి ఎర్రన్నాయుడుతో 2021లో వైభవంగా అక్క వివాహం జరిపించారు. అలేఖ్య గర్భం దాల్చడంతో ఏడో నెల సీమాంతం అనంతరం పుట్టినిల్లు సానివాడ గ్రామానికి తీసుకొచ్చారు. నవీన్‌కుమార్‌కు రెండు అంతస్తుల భవనం ఉంది. ఇందులో అక్కను కింద పోర్షన్‌లో ఉంచగా, పై పోర్షన్‌లో నవీన్‌కుమార్ దంపతులు ఉంటున్నారు.
అయితే కల్యాణి, ఆడపడుచు అలేఖ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం అందరూ బాగానే ఉన్నప్పటికీ రాత్రి మాత్రం కల్యాణి, అలేఖ్య మధ్య ఉపవాస దీక్ష విషయమై తగాదా తలెత్తింది. విషయాన్ని కల్యాణి తన భర్త నవీన్‌కుమార్‌కు చెప్పగా ఇద్దరికీ సర్ది చెప్పేశాడు.
అయినప్పటికీ ఆ తరువాత భార్యభర్తలిద్దరి మధ్య ఇదే విషయమై మాటామాట పెరగడంతో మంచంపై పడుకున్న కల్యాణిని నవీన్‌కుమార్ తలగడతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, సీఐ అంబేడ్కర్, ఎస్సై రాజేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కల్యాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment