కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయాతు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మ యుక్తఃఖలు ధర్మనాథః
పనులు చెయ్యడంలో ఒక యోగిలా ప్రతిఫలం ఆశించకూడదు. కుటుంబాన్ని నడపడం, కార్యాలను నిర్వహించడంలో నేర్పు, సంయమనంతో వ్యవహరించాలి. రూపంలో కృష్ణుడిలా, ఓర్పు లో రాముడిలా ఉండాలి. భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి. సుఖదుఃఖాల్లో కుటుంబానికి మిత్రునిలా అండగా ఉండాలి. మంచి చెడ్డల్లో పాలు పంచుకోవాలి. ఇవి ఆచరించేవాడే ఉత్తమ భర్తని పై శ్లోకం సారాశం.
మేడికొండూరు మండలం జంగంగుంటపాలేనికి చెందిన కత్తి గురవమ్మ, ఏసు భార్యాభర్తలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెకు పెళ్లి చేశారు. ఉన్న ఇంటినీ సంతానానికే ఇచ్చేశారు. రోజులు గడిచే కొద్దీ బిడ్డలకు తల్లిదండ్రులు బరువయ్యారు. నరాల బలహీనతతో గురవమ్మకు చూపు పోయింది. మోకాలి చిప్పలు అరిగిపోయి కాళ్లూ నడవలేని స్థితికి చేరుకున్నాయి. మూడు చక్రాల బండే దిక్కయింది. ఏసుకు కూడా ఓ ప్రమాదంలో కాలు దెబ్బతినడంతో ఆపరేషన్ జరిగింది. ఇద్దరికీ ఆకలి పోరాటం తప్పలేదు. నడవలేని భార్యకు ఏసు అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడు. నలుగురినీ యాచించుకుంటూ, బస్ షెల్టర్లలో బసచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ దంపతులు. ఆదివారం ప్రత్తిపాడు – పెదనందిపాడు మార్గంలో ఈ దంపతులు ‘సాక్షి’కి కనిపించారు.
–ప్రత్తిపాడు
Comments
Please login to add a commentAdd a comment