
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నామని ఓ దంపతులు సెల్ఫీవీడియో తీసుకోవడం కలకలం రేపుతోంది. ఈ వీడియోను కొడుక్కి పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక వడ్లపూడి తిరుమల నగర్‌లో చిత్రాడ వరప్రసాద్(47), మీరా(41) దంపతులు నివాసముంటున్నారు.వర ప్రసాద్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్య మీరాతో కలిసి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘నా కూతురు, కొడుకును జాగ్రత్తగా చూసుకోండి.. మా అత్తను, అమ్మను మంచిగా చూసుకోండి. నా కూతురు అమాయకురాలు. మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని తనను ఏం అనకండి. లక్ష్మి, తమ్ముడు జాగ్రత్త. మామయ్య వాళ్లందరూ ఉన్నారు కదా మిమ్మల్ని చూసుకుంటారు. ఏవరూ ఏమన్నా పట్టించుకోండి. ఇక మేం వెళ్లిపోతున్నాం’ అంటూ కంటతడిపెట్టుకున్నారు.
ఈ వీడియోను తమ కుమారుడు కృష్ణ సాయితేజకు పంపించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణ సాయితేజ దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగు, మొబైల్ గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment