
చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న ఇద్వా నేతలు
నెహ్రూనగర్(గుంటూరు): కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబును రాష్ట్రం నుంచి వెలివేయాలని ఇద్వా(ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్) వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజికవేత్త డాక్టర్ గోళ్ళమూడి రాజసుందరబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకానికి కోర్టుల ద్వారా అడ్డు తగులుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి అడ్డు తగులుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా గుంటూరు లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ముందుగా శంకర్‌విలాస్ సెంటర్‌లో ‘రాష్ట్ర అభివృద్ధి నిరోధక వైరస్ చంద్రబాబు’ అంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ దళిత, బహుజనుల అభివృద్ధికి బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కంభం ఆనందకుమార్, క్రైస్తవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మద్దు ప్రేమజ్యోతిబాబు మాట్లాడుతూ..ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ భూస్వాముల దాడులు హేయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment