![IMD Says Heavy Rain Forecast For North Coast Of Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/16/Rain.jpg.webp?itok=PaUQYejx)
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర కోస్తాలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘పశ్చిమ’లో భారీ వర్షం: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటున 13.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెంలో అత్యధికంగా 70.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా ఏలూరులో 51.4 మి.మీ. కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ పలుచోట్ల వర్షాలు పడ్డాయి. గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. గుంటూరు నగరంతో పాటు సత్తెనపల్లి, మేడికొండూరు, ఫిరంగిపురం, పెదకూరపాడు, క్రోసూరు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment