ములుముడి– తాటిపర్తిరోడ్డు
నెల్లూరు జిల్లాలో రహదారులు కళకళలాడుతున్నాయి. గత ప్రభుత్వ పాలనకు చిహ్నాలుగా మారిన గతుకులు, గుంతల రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. రెండేళ్లుగా తరచూ భారీ వర్షాలకు రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నిధుల కొరత, పనుల నిర్వహణ చేపట్టలేని పరిస్థితుల్లో మరమ్మతులు, అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. రోడ్ల అభివృద్ధికి గతేడాదే నిధులు కేటాయించడంతో రాచబాటలు రూపుదిద్దుకుంటున్నాయి.
నెల్లూరు (బారకాసు): జిల్లాలో రోడ్లకు మహర్దశ పట్టింది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలను కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు సైతం అభివృద్ధి బాట పట్టాయి. రోడ్ల మరమ్మతులు, బాగా దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు నిధులు కూడా మంజూరు చేయడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన రహదారులు కళకళలాడుతున్నాయి.
రోడ్ల అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వం
గత ప్రభుత్వం ఐదేళ్లు జిల్లాలో ప్రధాన రహదారుల అభివృద్ధిని విస్మరించింది. ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేసి గొప్పగా చెప్పుకుంది. దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధికి నోచుకోని రహదారులతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రజల విన్నపాలను పట్టించుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించింది. అయితే నిధులు సమీకరించే లోగా తరచూ భారీ వర్షాలు, ఆ తర్వాత కరోనా విపత్తు కారణంగా రోడ్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలకు రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి.
84 రోడ్లకు రూ.322.11 కోట్లు మంజూరు
గతేడాది ఆగస్టులోనే రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నిధులు కేటాయించింది. అక్టోబరు నుంచి దాదాపు డిసెంబరు ప్రారంభం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు వరదలు వచ్చాయి. వర్షాలు, కరోనా తగ్గుముఖం పట్టడంతో పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు రోడ్లు మరమ్మతులు, బాగా దెబ్బతిన్న రోడ్ల పటిష్టత కోసం వివిధ స్కీంల కింద ప్రభుత్వం రూ.322.11 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 337 కి.మీ. మేర మొత్తం 84 రోడ్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో రోడ్లు నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కళకళలాడుతున్న రోడ్లు
జిల్లాలో గతంలో పది నియోజకవర్గాలుండేవి. ఆర్‌అండ్‌బీశాఖ పరిధిలో కావలి, నెల్లూరు, గూడూరు మూడు డివిజన్లు ఉండేవి. అయితే జిల్లాల పునర్వి భజన తర్వాత నెల్లూరు, కావలి రెండు డివిజన్లు మాత్రమే ఈ శాఖ పరిధిలో ఉన్నాయి.
నెల్లూరు డివిజన్ పరిధిలో 64 రోడ్ల నిర్మాణాల పనులు చేపడుతున్నారు. రూ.153.63 కోట్ల నిధులతో 363.23 కి.మీ మేర మరమ్మతులు, పునర్నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే రూ.46.44 కోట్లు ఖర్చు చేసి 65.23 కి.మీ. మేర రోడ్లు పూర్తి చేశారు. ఇందులో పొదలకూరు–రాపూరు, నెల్లూరు నగరం నుంచి ములుముడి–తాటిపర్తి, కృష్ణపట్నంపోర్టు రోడ్డు–గొలగముడి రోడ్డు, ఆత్మకూరు–సోమశిల, నెల్లూరుపాళెం–ఆత్మకూరు తదితర రోడ్ల నిర్మాణాలు పూర్తయి కళకళలాడుతున్నాయి.
కావలి డివిజన్ పరిధిలో రూ.198 కోట్లతో 196 కి.మీ మేర 26 రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. కావలి–ఉదయగిరి, సీతారామపురం రోడ్డు నుంచి గంగిరెడ్డిపల్లి మీదుగా తెల్లపాడు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. చిలకపాడు, బ్రాహ్మణక్రాక, ఏపిలగుంట, కావలి పట్టణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి.
జూలై లోపు పూర్తి చేసేలా చర్యలు
జిల్లాలో మరమ్మతులకు గురైన రోడ్లు, బాగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నాం. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. మరో మూడు నెలల్లో జూలై నెలాఖరులోపు పూర్తి స్థాయిలో నిర్మాణాలను చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం
– రామాంజనేయులు, ఇన్‌చార్జి ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ
Comments
Please login to add a commentAdd a comment