ఓట్ల లెక్కింపుపై పెరిగిన ఆసక్తి
15 రోజుల ముందే లాడ్జీలన్ని బుకింగ్
3వ తేదీనే కర్నూలుకు చేరుకున్న రాజకీయ నేతలు, అనుచరులు
కర్నూలు(అర్బన్): సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ఫలితాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, వారి అనుచరగణం కర్నూలుకు చేరుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరగనున్న విషయం తెలిసిందే. కౌంటింగ్ విధులు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాయలసీమ విశ్వ విద్యాలయానికి వెళ్లేందుకు వీలుగా 4వ తేదిన ఉదయం 5 గంటలకే బస్సులను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. వీరంతా కచ్చితంగా ఉదయమే రావాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎన్నికల విధుల్లో భాగంగా ఉదయం 5 గంటలకు కర్నూలుకు చేరుకునే పరిస్థితులు లేని కారణంగా ఒక రోజు ముందుగానే ఇక్కడకు చేరుకున్నారు. వీరంతా రాత్రి బస చేసేందుకు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లు, లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు.
సారీ ... రూముల్లేవు!
కర్నూలులోని పలు ప్రధాన లాడ్జీలతో పాటు చిన్న చితకా లాడ్జీల్లో కూడా రూములు లేవనే సమాధానం వినిపిస్తోంది. ప్రధాన రాజకీయ పారీ్టలకు చెందిన నేతలు పలు లాడ్జీల్లో 15 రోజుల ముందుగానే ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుంచి 4వ తేదీ వరకు గదులను అడ్వాన్స్‌గా అద్దెకు తీసుకున్నారు. దీంతో మెజారిటీ లాడ్జీలన్నీ రాజకీయ నేతలతో సందడి చేస్తున్నాయి. ఏసీ రూములు లేకపోయినా ఫరవాలేదు. కనీసం టీవీ ఉంటే చాలు అంటూ నేతలు లాడ్జీలల్లో దిగిపోతున్నారు. ఆయా లాడ్జీలకు అనుసంధానంగా ఉన్న హోటళ్లలో రాత్రి డిన్నర్, ఉదయం టిఫెన్, మధ్యాహ్నం లంచ్‌కు సరపడా మెనూను కూడా అడ్వాన్స్‌గా ఆర్డర్ చేసుకుంటున్నారు. నగరంలోని ప్రధాన లాడ్జీలతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు కూడా హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే స్థాయికి వచ్చాయి.
నేతల ఇళ్ల వద్ద జన సందోహం ...
జిల్లాలోని ఒక పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పారీ్టలకు చెందిన మెజారిటీ అభ్యర్థుల నివాసాలు కర్నూలులోనే ఉన్నాయి. వారి ఇళ్ల వద్దకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఓట్ల లెక్కింపులో అనుభవం ఉన్న పలువురు నేతలు ఓట్ల లెక్కింపు సమయంలో ఉండాల్సిన చురుకుదనం, ప్రశ్నించే తత్వం, తెలివితేటలు, సమయస్ఫూర్తిపై తమ ఏజెంట్లకు తెలియజేస్తూ కౌంటింగ్ కేంద్రాలకు పంపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment