సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఐదు శాతం పెరిగింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణతా శాతం 72.26 శాతం వచ్చింది.. అలాగే బాలుర కంటే బాలికలే పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 75.38 శాతంతో పైచేయి సాధించారు. ఇక ఫెయిలైన విద్యార్ధులు అధైర్య పడవద్దని.. జూన్ మొదటీ వారంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
విజయవాడలో టెన్త్ ఫలితాలను మంత్రి బొత్స ప్రకటించారు. కేవలం 18 రోజుల వ్యవధిలోనే విద్యాశాఖ రికార్డుస్ధాయిలో ఫలితాలని ప్రకటించారు.. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 87.47 శాతం ఉత్తీర్ణత సాధించి పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక 60.39 శాతంతో చివరి స్ధానంలో నంద్యాల జిల్లా నిలిచింది. టెన్త్ పరీక్షలకి రాష్ట్రంలో 6,05,052 మంది పరీక్షకు హాజరు కాగా 4,37,196 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 72.26 శాతం కాగా గత ఏడాది 68 శాతం ఉత్తీర్ణత వచ్చింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఐదు శాతం పెరిగింది. వారిలో 69.27 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా 75.38 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలురు కంటే బాలికలు 6.11 ఎక్కువ శాతంలో ఉత్తీర్ణులై పై చేయిగా నిలిచారు. ఇక 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో 95.25 శాతం అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల వివరాలను www.bse.ap.gov.inలో ఉంచారు. దీనికి సంబంధించి పాస్ వార్డ్ CBSE@2025 అని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు.
గత ఏడాది టెన్త్ ఫలితాలలో 71 పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు రాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 38 పాఠశాలలకి తగ్గించగలిగారు. ఇందులోనూ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు 29 ఉండటం విశేషం.. ఇక ఒక ప్రభుత్వ హైస్కూలులో.. మరో ఐదు జెడ్పీ హైస్కూలులో జీరో శాతం ఫలితాలు వచ్చాయి.. జీరో శాతం ఫలితాలపై పాఠశాల వారీగా సబ్జెక్టు వారీగా విశ్లేషించి వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నించాలని మంత్రి బొత్స అధికారులని ఆదేశించారు.
చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే!
అలాగే నేరుగా పరీక్షలు రాసిన ఆరుగురు అంధ విద్యార్ధులు పాసయ్యారు.. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుండి 10వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు అభ్యర్థులు మే 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసిన 80.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స తెలిపారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకుండా ఒక సవాల్ గా తీసుకుని సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించాలన్నారు. పిల్లలు అధైర్య పడకుండా తల్లితండ్రులు వారిని ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక క్లాస్‌లు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు కొరకు హాజరయ్యే విద్యార్థులు మే 7 నుండి 17వ తేదీ వరకూ ఫీజులు చెల్లించవచ్చునన్నారు. టెన్త్ పరీక్షలపై గత ఏడాది జరిగిన సంఘటనలని దృష్టిలో పెట్టుకుని ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎటువంటి ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment