సాక్షి, విశాఖపట్నం: ‘భారతీయులూ.. వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి’ అంటూ ఇటీవల వివిధ దేశాలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురుచూస్తున్న వారంతా విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా భారతీయులకు ప్రయాణ అవకాశాల్ని మరిన్ని కల్పించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి.
టైర్–2 సిటీస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలపై దృష్టి సారించాయి. వీటిలో విశాఖ ముందువరుసలో ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి థాయ్‌లాండ్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఏషియా సంస్థ.. తాజాగా మలేషియా వెళ్లేందుకు మరో సర్వీసును మొదలు పెట్టేందుకు ముహూర్తం చూసుకుంటోంది. ఈ సర్వీసు ప్రకటనతో విదేశాలకు విమాన సర్వీసులు విశాఖ నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుండటం విశేషం.
వీసాలతో పని లేకుండా..
వీసా ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఎంట్రీ లేదా టూరిస్ట్ వీసాలు దొరక్క.. తమకు నచ్చిన దేశంలో విహరించే ఆలోచనలను మధ్యలోనే విరమించుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు గోల్డెన్ చాన్స్ వచ్చేసింది. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. టికెట్ బుక్ చేసుకుని కొన్ని దేశాలకు ట్రిప్‌కు వెళ్లి రావొచ్చు. భారతీయ పాస్‌పోర్టు బలమైందిగా మారడమే దీనికి కారణం.
ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) విడుదల చేసిన వీసా ఫ్రీ దేశాల జాబితాలో ప్రపంచ దేశాల్లో భారత్ 83వ స్థానంలో నిలిచింది. ఈ కారణంగా కొన్ని దేశాలు భారతీయుల్ని విహారానికి వీసా లేకుండానే ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ అవకాశాల్ని విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకుంటున్నాయి.
థాయ్‌లాండ్, మలేషియాకు..
ఎయిర్ ఏషియా సంస్థ జైపూర్, గోవా, వారణాసితో పాటు విశాఖ నుంచి వీసా ఫ్రీ దేశాలకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపై ఎయిర్ ఏషియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల నుంచి కౌలాలంపూర్‌కు లిమిటెడ్ పీరియడ్‌తో ప్రత్యేక ప్రమోషన్ చార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా సర్వీసులు నడపాలని నిర్ణయించింది.
సౌత్ ఇండియా నుంచి ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లో మొత్తంగా 69 వీక్లీ సర్వీసులు నడుపుతూ ఏడాదికి 1.5 మిలియన్ సీట్లతో రెండు దేశాల మధ్య సేవలను గణనీయంగా పెంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మరో వీసా ఫ్రీ ప్రకటించిన థాయ్‌లాండ్‌కు కూడా విశాఖ నుంచి ఏప్రిల్‌లో సర్వీసులు మొదలు పెడుతున్నట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది.
మరోవైపు.. విశాఖ నుంచి సింగపూర్‌కు స్కూట్ సర్వీస్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతి రోజూ కనీసం 300 నుంచి 350 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న థాయ్, కౌలాలంపూర్ సర్వీసులతో విశాఖ నుంచి ఏకంగా మూడు విదేశీ సర్వీసులు నడవనున్నాయి. ఫిబ్రవరిలో ఇండిగో సంస్థ కూడా మరో విదేశీ సర్వీసు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సర్వీసుల రాకతో విదేశీ ప్రయాణాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు గేర్ మార్చినట్టుగా అధికారులు భావిస్తున్నారు.
దూసుకుపోతున్న ఎయిర్ ఏషియా
ఇప్పటివరకూ దాదాపు 60 దేశాలు వీసా ఫ్రీ ప్రకటించాయి. 30 నుంచి 90 రోజుల వరకూ వీసా లేకుండానే భారతీయులు తమ దేశానికి వచ్చి ఆతిథ్యాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చని ప్రకటించాయి. తాజాగా తమ దేశ పర్యాటకానికి ఊతమిచ్చేందుకు వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక మాదిరిగానే మలేషియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతేడాది డిసెంబర్ 1 నుంచి మలేషియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఇలా వీసా ఫ్రీ టూర్‌కు వివిధ దేశాలు అవకాశమిస్తున్న తరుణంలో విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో ఎయిర్ ఏషియా సంస్థ అగ్రభాగంలో ఉంది. ఈ సంస్థ టైర్–2 నగరాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్నే టార్గెట్ చేస్తూ కొత్త సర్వీసుల్ని మొదలు పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment