వర్క్ వీసా అన్నారు.. విజిటర్ వీసాపై పంపారు!
- మలేసియాలో తెలంగాణ కార్మికుల అవస్థలు
- ఔట్ పాస్ పోర్టుకోసం వెతలు
మోర్తాడ్(నిజామాబాద్): ఏజెంట్ల మోసాలు, విదేశాంగ శాఖ నిర్లక్ష్యం, అవగాహనలేమి కారణంగా పొట్టకూటికోసం మలేసియా వెళ్లిన తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మలేసియాలోని పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ వేతనాలు ఇస్తామని ఆశ చూపిన ఏజెంట్లు వేలాది మంది కార్మికులను వర్క్ వీసాలు అని చెప్పి విజిట్ వీసాలపై పంపించారు. విజిట్ వీసా జారీ చేసిన స్పాన్సర్ వద్దనే పాస్‌పోర్టులు ఉంటాయి. కార్మికులు జిరాక్సు కాపీతో మాత్రమే బయట తిరగాల్సి వస్తుంది.
వీసా కోసం కార్మికులు ఒక్కొక్కరు ఏజెంట్లకు రూ.75 వేల నుంచి రూ.1లక్ష వరకు చెల్లించారు. మలేసియా వెళ్లడం కోసం ఎక్కువ వడ్డీకి అప్పు చేసిన కార్మికులు.. విజిట్ వీసాపై వెళ్లినా అక్కడే ఉండి ఎక్కడ పని దొరికితే చాలనుకుని కాలం గడుపుతున్నారు. అయితే, మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పట్టుబడిన కార్మికులు ఇళ్లకు వెళ్లాలంటే అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మంది కార్మికులు మలేసియా జైళ్లు, డిటెన్షన్ సెంటర్‌లలో ఉండి జరిమానా చెల్లించి ఇళ్లకు చేరుకున్నారు. వలస కార్మికుల సంక్షేమ సంఘం అంచనాల ప్రకారం మలేసియాలో తెలంగాణకు చెందిన దాదాపు 8వేల మంది కార్మికులు వర్క్ పర్మిట్, వీసా లేకుండా ఉన్నారు.
కొద్దిరోజుల కిందట నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్‌కు చెందిన అమీర్ ఖాన్, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన హన్మంతు ఇంటికి రాగా, కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్‌కు చెందిన నరేందర్ మాత్రం మలేసియాలోనే ఉండిపోయాడు. సుమారు నాలుగేళ్ల కింద మలేసియాకు విజిట్ వీసాపై వెళ్లిన నరేందర్ అక్కడే పని చేస్తున్నాడు. నరేందర్ ఇంటికి రావడం కోసం ఔట్ పాస్‌పోర్టు పొందాల్సి ఉంది. ఇండియన్ హైకమిషన్ కార్యాలయానికి వారం కింద వెళ్లగా అక్కడి అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని నరేందర్ 'సాక్షి'కి ఫోన్‌లో తెలిపాడు. తనతో పాటు చాలా మంది హైకమిషన్ కార్యాలయానికి వెళ్లారని తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తమను ఎలాగైన ఇళ్లకు చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని మలేషియాలో ఉన్న కార్మికులు కోరుతున్నారు. కాగా, విదేశాలలో పని చేస్తున్న మన ప్రాంత కార్మికులకు రాయబార కార్యాలయం ద్వారా ఔట్ పాస్‌పోర్టు జారీ కావాలంటే పాస్‌పోర్టు జిరాక్సు కాపీ, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉండాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధి మంద భీమ్‌రెడ్డి చెప్పారు.