Telangana workers
-
ఇజ్రాయెల్‌లో మా వాళ్లు ఎలా ఉన్నారో?
ఆర్మూర్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్ దేశానికి వలస వెళ్లిన తెలంగాణ కార్మికుల కుటుంబాలు ఇక్కడ భయాందోళనలకు గురవుతు న్నాయి. తమ వారికి ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు సైతం భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఊళ్లలో సరైన పనులు దొరక్క నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల జిల్లాలతో పాటు తెలంగాణవ్యాప్తంగా సుమారు 800 మంది ఇజ్రాయెల్‌లో ఉపాధి కోసం వలస వెళ్లారు. వీరిలో పలువురు ఇజ్రాయెల్ వాసుల ఇళ్లలో కేర్టేకర్లుగా పనులు చేస్తున్నారు. మరో వైపు ఆ దేశంలో సుమారు ఐదు వేల మంది తెలుగు వారు వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నివాసం ఉంటున్నారు. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డ కార్మికులు ఇప్పుడు ఏడాది కాలంగా యుద్ధ పరిస్థితులతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయె ల్లోని రమద్‌గాన్ పట్టణం తలవిల ప్రాంతంలో అత్య«ధికంగా తెలంగాణ వాసులు నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ బాంబుల మోతతో దద్దరిల్లు తోందని తెలంగాణ వాసులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల్లో భాగంగా బాంబుల దాడి సమయంలో అధికారులు సైరన్ మోగిస్తారు. వెంటనే ప్రజలు ఇళ్లు, అపార్ట్మెంట్లలో పటిష్టంగా నిర్మించిన బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకుంటారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఉన్నాం.. బుధవారం ఇక్కడ నూతన సంవత్సరం. అందరం సామూహిక ప్రార్థనల్లో ఉన్నాం. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి టెల్ అవీవ్ పరిసరాల్లో సుమారు ఐదువేల మంది వరకు ఇక్కడ వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతానికి మాకు భయమేమీ లేదు. భద్రంగానే ఉన్నాం. ఏదైనా ముప్పు ఉంటే ముందే హెచ్చరిస్తారు. బంకర్లు సిద్ధంగా ఉన్నాయి. – లాజరస్ కొల్లాబత్తుల(ఇజ్రాయెల్), మల్కిపురం, కోనసీమ జిల్లా, ఏపీ రక్షణ చర్యలు చేపట్టారుఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరుల రక్షణకు గట్టి చర్యలు చేపట్టింది. దాడులు జరుగుతున్న ప్రాంతం మా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల తెలంగాణ వాసులు పెద్దగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. – సోమ రవి,తెలంగాణ – ఇజ్రాయెల్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడుభద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నాము..ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించిన ప్రకారం భద్రతాపరమైన చర్య లను తీసుకుంటున్నాం. దాడులు సరిహద్దు ల్లోనే జరుగుతున్నాయి కాబట్టి మాకు ప్రాణభయం లేదు. కోవిడ్‌లో ఉపాధి లభించక ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు యుద్ధం కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. – శ్రీనివాస్ (ఇజ్రాయెల్), అమ్దాపూర్, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం -
గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న మనోళ్లు
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మన దేశస్తులు పరాయి దేశాల చట్టాలపై అవగాహన లేక చేసిన చిన్నచిన్న తప్పులకు ఆయా దే శాల జైళ్లలోనే మగ్గిపోతున్నారు. రాయబార కా ర్యాలయాల ద్వారా న్యాయసాయం పొందే అవకాశా లు తక్కువగా ఉండడంతో ఏళ్ల తరబడి జైలు పక్షులుగానే ఉండిపోతున్నారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య, వారికి అందుతున్న న్యాయ సహాయంపై పలువురు ఎంపీలు పార్లమెంట్లో చర్చ లేవనెత్తారు. దీనిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఇచ్చిన సమాధానం ప్రకారం 82 దేశాల్లో అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు వివిధ కేసుల్లో శిక్షపడి జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య 8,343 మంది అని తేలింది. ఇందులో 4,755 మంది కేవలం ఆరు గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో బంధించబడి ఉన్నారు. ఆరు దేశాల జైళ్లలో ఉన్న భారతీయులతో పోలిస్తే ఇతర 76 దేశాల జైళ్లలో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. గల్ఫ్ దేశాలతో పాటు మలేషి యా జైళ్లలోనూ భారతీయులు ఎక్కువగానే ఉన్నా రు. అంటే కేవలం ఉపాధి కోసం వెళ్లినవారు వీసా నిబంధనలను అతిక్రమించి జైలు పాలైనట్లు వెల్లమవుతుంది. కంపెనీల వీసాలపై వెళ్లి ఆ కంపెనీల్లో పని నచ్చకపోతే కల్లివెల్లి కార్మికులుగా మారి పనిచేయడం చివరకు పోలీసులకు దొరికిపోవడంతో జైలు పాలయ్యారు. మరికొందరు విజిట్ వీసాలపై వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడంతో కటకటాల పాలయ్యారు. ఇదిలా ఉండగా 31 దేశాలతో శిక్షార్హమైన వ్యక్తుల బదిలీపై మన విదేశాంగ శాఖ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందు లో గల్ఫ్ దేశాల్లోని ఒమాన్ మినహా మిగిలిన ఐదు దేశాలున్నాయి. అయినా ఖైదు చేయబడ్డ భారతీయులకు విముక్తి లభించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి వివిధ దేశా ల్లోని జైల్లో మగ్గుతున్న భారతీయులను మాతృదేశానికి చేరి్పంచాలని పలువురు కోరుతున్నారు. న్యాయసాయం అందించాలి గల్ఫ్ దేశాల్లో అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు శిక్షపడిన ఖైదీల సంఖ్యను కేంద్రం వెల్లడించిన సంఖ్య కన్నా ఎక్కువ మందే జైళ్లలో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మరో ఐదువేల మంది ఔట్ జైళ్లలో ఉన్నారని సమాచారం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయసాయం అందించాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు -
దుబాయ్‌లో తెలంగాణ కార్మికుల కష్టాలు
అబుదాబి : కరోనా లాక్డౌన్ కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన తెలంగాణ వాసులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒకే భవనంలో దాదాపు 80 మంది కార్మికులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావటంతో స్థానిక అధికారులు వారందరినీ ఓ రూములో నిర్బంధించారు. అయితే రోగులకు సరైన వైద్యం అందించడం లేదని వారు చెబుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో కలిసి మిగిలిన వారందరూ ఒకే భవనంలో ఉండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తామందరికి కరోనా టెస్టులు చేసి వైద్య సదుపాయాలు అందించాలని కోరుతున్నారు. తాము పనిచేస్తున్న సెల్ఫ్ బెహస కంపెనీ తమ ఆరోగ్యాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. -
ఉపాధికి వెళ్తే.. అప్పులే మిగిలాయి!
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): కంపెనీ యజమాని చేసిన పనికి వేతనం ఇవ్వకపోగా వీసా రెన్యూవల్ చేయకపోవడంతో పలువురు తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు అష్టకష్టాలు పడి స్వస్థలాలకు చేరుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశం షార్జాలోని ఏఓజీఎం కంపెనీ యజమాని బిచానా ఎత్తివేయడంతో 16 మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. షార్జాలో కేరళకు చెందిన వ్యక్తి కంపెనీ ఏర్పాటు చేసి భవన నిర్మాణ పనులు, ఇతర కాంట్రాక్టులు చేపట్టి మన దేశం నుంచి కార్మికులను రప్పించుకున్నాడు. అలా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 16 మందితో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేయడానికి వీసాలు పొందారు. అయితే కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ ఆరు నెలల నుంచి కంపెనీ యజమానికి జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కో కార్మికునికి రూ.1.80లక్షల చొప్పున వేతన బకాయి చెల్లించాల్సి ఉంది. డబ్బు కోసం ఇంటికి వెళుతున్నా అని చెప్పిన యజమాని తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లిపోయాడు. కంపెనీ యజమాని ఎప్పుడైనా షార్జాకు వస్తాడనే ఆశతో కార్మికులు మూడు నెలల పాటు కంపెనీ క్యాంపులోనే ఉండిపోయారు. అయినా యజమాని నుంచి స్పందన లేకపోవడంతో సొంత ఖర్చులతోనే కార్మికులు ఇంటికి చేరుకున్నారు. జరిమానా చెల్లించి.. వీసాల రెన్యూవల్ గడువు ముగిసిపోవడం, కంపెనీ యజమాని పత్తా లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు జరిమానా భారం మోయాల్సి వచ్చింది. వీసా గడువు తీరిపోయి షార్జాలో చట్ట విరుద్ధంగా ఉన్నందుకు ఆర్మూర్ మండలం ఇస్సాపల్లికి చెందిన ముత్తెన్న, మోర్తాడ్ మండల తిమ్మాపూర్‌కు చెందిన జయరాజ్‌లు రూ.50వేల చొప్పున అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించారు. అయితే 16 మంది కార్మికుల్లో 14 మంది కార్మికులకు వీసా గడువు ఉండటంతో వారికి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. కాగా, 14 మంది కార్మికులు ఒక్కొక్కరు రూ.14వేల చొప్పున విమాన చార్జీలను చెల్లించడానికి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకున్నారు. ముత్తెన్న, జయరాజ్‌లు మాత్రం జరిమానా, విమాన చార్జీల కోసం అందరికంటే ఎక్కువ సొమ్ము ఇంటి నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. ఏఓజీఎం కంపెనీ యజమానిపై షార్జాలోని మన విదేశాంగ శాఖ కార్యాలయంలో కార్మికులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. విదేశాంగ శాఖ అధికారులు తమకు ఏ విధంగానూ సహకరించలేదని దీంతో షార్జా ప్రభుత్వానికి జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చిందని ఇద్దరు కార్మికులు వాపోయారు. అప్పు చేసి డబ్బులు పంపించారు.. షార్జా ప్రభుత్వానికి జరిమానా చెల్లించడానికి, విమాన చార్జీల కోసం మా ఇంటి వద్ద రూ.75వేలు అప్పు తీసుకుని షార్జాకు పంపిస్తేనే నేను ఇటీవల ఇంటికి వచ్చాను. కంపెనీ యజమానిపై షార్జాలోని మన విదేశాంగ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో మాకు దిక్కులేకుండా పోయింది.– ముత్తెన్న, ఇస్సాపల్లి(ఆర్మూర్ మండలం) ప్రభుత్వం ఆదుకోవాలి... షార్జాలో కంపెనీ యజమాని వంచనతో అవస్థలు పడుతూ ఇంటికి చేరుకున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. చేసిన పనికి వేతనం రాలేదు. వీసా గడువు ముగిసిపోయినందుకు జరిమానా మీద పడింది. మా పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం స్పందించి మాకు ఆర్థిక సహాయం అందించాలి.– జయరాజ్, తిమ్మాపూర్(మోర్తాడ్ మండలం) -
మాకు దిక్కెవరు..!
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో భవన నిర్మాణ రంగానికి చెందిన ఏఓజీఎం కంపెనీ యజమాని కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ కంపెనీ నిర్వహణ లోపం కార్మికుల పాలిట శాపంగా మారింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల నుంచి షార్జాలో భవన, ఇతర నిర్మాణాల కాంట్రాక్టులను నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన 14 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఇద్దరు, చెన్నైకి చెందిన మరో కార్మికుడు పనిచేస్తున్నాడు. కార్మికులకు యజమాని ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. ఒక్కొక్కరికి రూ.1.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికులకు కంపెనీ నిర్వాహకులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు మంజూరైనా.. కాకపోయినా కార్మికులకు మాత్రం వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. అయితే, ఆ కంపెనీ యజమాని ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమకు రావాల్సిన వేతనాల కోసం సమ్మె కొనసాగిస్తున్నారు. లేబర్ కోర్టుకు.. వేతన బకాయిల కోసం కార్మికులు షార్జాలోని లేబర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు.. కంపెనీ యజమానికి నోటీసులు జారీచేసింది. అక్కడే ఉంటే తాను జైలుపాలు కావాల్సి వస్తుందని గ్రహించిన కంపెనీ యజమాని తన స్వస్థలమైన కేరళకు వెళ్లిపోయాడు. కార్మికులు మాత్రం క్యాంపులోనే ఉండిపోయారు. షార్జాలోని క్యాంపులో కార్మికులతో మాట్లాడుతున్నగుండెల్లి నర్సింహ విద్యుత్, గ్యాస్, నీటిసరఫరా నిలిపివేత.. క్యాంపులో ఉంటున్న కార్మికులు దుర్భర జీవనం గడుపుతున్నారు. కంపెనీ యజమాని క్యాంపు కోసం తీసుకున్న భవనానికి అద్దె చెల్లించడానికి ఇచ్చిన చెక్కులతో పాటు గ్యాస్, విద్యుత్, నీటి బిల్లుల కోసం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. కార్మికులను సైట్ వద్దకు తీసుకెళ్లే బస్సులకు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ నిర్వాహకులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. దీంతో క్యాంపు కొనసాగుతున్న భవనానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్, ఫిల్టర్ నీటి సరఫరా సైతం నిలిచిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే ఉంటున్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంట చేసుకుంటున్నారు. ఫిల్టర్ నీటి సరఫరా లేక పోవడంతో ఉప్పు నీటిని తాగాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కాన్సులేట్‌లో ఫిర్యాదు.. కంపెనీ యజమాని నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు నర్సింహ ఇండియా కాన్సులేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విదేశాంగ శాఖ అధికారులు కేసును నమోదు చేశారు. కార్మికులకు వేతనాలు అందకపోవడంతో వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. దీంతో ఎన్ఆర్ఐ సెల్ ద్వారా విమాన టిక్కెట్లు ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి టికెట్లు అందకపోతే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా టిక్కెట్లను ఇప్పించడానికి కృషిచేస్తామని జీడబ్ల్యూపీసీ అధ్యక్షుడు నర్సింహ ‘సాక్షి’కి వివరించారు. కార్మికులకు అండగా జీడబ్ల్యూపీసీ.. షార్జాలో అవస్థలు పడుతున్న కార్మికులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి(జీడబ్ల్యూపీసీ) అండగా నిలిచింది. ఆరు నెలలుగా వేతనాలు అందక.. క్యాంపులో సరైన సౌకర్యాలు లేక తిప్పలు పడుతున్న కార్మికులను గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహ షార్జాలో కలుసుకున్నారు. కంపెనీ యజమాని కేరళకు వెళ్లిపోవడంతో కార్మికుల పాస్‌పోర్టులు అతని వద్దనే ఉండిపోయాయి. అయితే నర్సింహ.. కంపెనీ యజమానితో ఫోన్లో మాట్లాడి పాస్‌పోర్టులు కార్మికులకు వాపసు చేయాలని సూచించారు. కంపెనీ క్యాంపులో మొత్తం 17 మంది కార్మికులు ఉండిపోగా అందులో ఇద్దరికి వీసాలను రెన్యూవల్ చేయలేదు. దీనికి సంబంధించి జరిమానా చెల్లించి కార్మికులను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మిగిలిన కార్మికులకు వారి పాస్‌పోర్టులను ఇప్పించి సొంతూళ్లకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేతన బకాయిలు ఇప్పించండి మాకు ఆరు నెలల వేతనం అందాల్సి ఉంది. కంపెనీపై లేబర్ కోర్టులో కేసు వేశాం. ఎలాగైనా వేతన బకాయిలు ఇప్పించాలి. ఆరు నెలల వేతనం యజమాని వద్దనే ఉండిపోవడంతో మాకు ఇబ్బందిగా ఉంది. విదే శాంగ శాఖ చొరవ తీసుకుని వేతనం ఇప్పించాలి. కంపెనీ యజమాని కేరళకు వెళ్లిపోవడంతో మమ్మల్ని పట్టించుకునే వారు లేరు.– ముత్తెన్న, ఇస్సాపల్లి, నిజామాబాద్ జిల్లా ఎంతో ఇబ్బంది పడుతున్నాం.. క్యాంపులో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. నరకంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదేమో. కంపెనీ యజమాని మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మేము మాత్రం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఎలాగైనా ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలి. – లస్మన్న, గొల్లమడ, నిర్మల్ జిల్లా ఇంటికి రావడానికిడబ్బులు లేవు.. ఆరు నెలల నుంచి వేతనం ఇవ్వకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇంటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వమే దయ ఉంచి విమాన టిక్కెట్లు ఇవ్వాలి. కనీసం ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవు. మా పరిస్థితి దయనీయంగా ఉంది. – విఠల్, గొల్లమడ,నిర్మల్ జిల్లా మానవతా దృక్పథంతో ఆదుకోవాలి షార్జాలోని కంపెనీ క్యాం పులో ఉన్న మమ్మల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. కంపెనీ యజమాని ఏమీ చెప్పకుండా కేరళకు వెళ్లిపోయాడు. మేము మాత్రం అనాథల్లా కంపెనీ క్యాంపులోనే ఉండిపోయాం. మాకు దేవుడే దిక్కు. మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. మమ్మల్ని ఇంటికి పంపించడానికి చర్యలు తీసుకోవాలి.– ఎల్లేష్, గుండారం, కామారెడ్డి జిల్లా ఏం చేయాలో అర్థం కావడం లేదు కొన్ని రోజుల నుంచి క్యాంపుకే పరిమితమైన మాకు ఏమిచేయాలో అర్థం కావడం లేదు. మా పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. వేతనాలు లేవు. క్యాంపులో కనీస సౌకర్యాలు లేవు. రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతోంది. కంపెనీ యజమాని కేరళ నుంచి షార్జాకు వస్తాడనే నమ్మకం లేదు.– సంపంగి మహేష్, అమతాపూర్, డిచ్పల్లి మమ్మల్ని ఇంటికి చేర్పించండి షార్జా నుంచి మమ్మల్ని ఎలాగైనా ఇంటికి చేర్పించండి. మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. కనీసం మా పాస్‌పోర్టులు కూడా ఇవ్వలేదు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడితే పాస్‌పోర్టులు పంపిస్తానని చెబుతున్నాడు. పాస్‌పోర్టులతో పాటు టిక్కెట్లను ఇప్పిస్తేనే ఇంటికి చేరుకోగలుగుతాం.– జోగు ఊషన్న,జీజీ నడ్కుడ, నిజామాబాద్ జిల్లా -
అడ్డదారిలో యూఏఈకి..
సాక్షి, నిజామాబాద్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు విజిట్ వీసాపై వెళ్లి ఉపాధి పొందాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఆ దేశంలో ఉపాధి పొందాలనుకుంటే ఇక నుంచి కచ్చితంగా వర్క్ వీసా ఉండాల్సిందే. ఈ నిబంధన గతంలోనే ఉన్నా ఇటీవల యూఏఈ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. విజిట్ వీసాలపై వచ్చి కల్లివెల్లి(అక్రమ నివాసులు)గా మారి పనిచేస్తున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతుండటంతో దీనిని నియంత్రించడానికి యూఏఈ చర్యలు చేపట్టింది. విజిట్ వీసాపై వచ్చిన వారిని పనిలో పెట్టుకోవద్దని కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. ఆ దేశంలో మన విదేశాంగ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రం సానుకూలంగా స్పందించింది. విజిట్ వీసాలపై వచ్చి ఉపాధి పొందాలనుకునేవారికి కలిగే నష్టాల గురించి వివరిస్తోంది. సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏం జరుగుతుందంటే.. యూఏఈకి ఇప్పటి వరకు విజిట్ వీసాపై వచ్చి వర్క్ వీసా పొందేందుకు అవకాశం ఉంది. కానీ, వర్క్ వీసా పొందిన కార్మికులు ఆ వెంటనే ఆ దేశం విడిచి వచ్చి.. ఆ తర్వాత వర్క్ వీసాపై మళ్లీ కొత్తగా యూఏఈకి వెళ్లి ఉపాధి పొందవచ్చు. అయితే, దీనిని ఆసరా చేసుకుని లైసెన్స్డ్ ఏజెంట్లు అక్రమార్జనకు దారులు తెరిచారు. యూఏఈ వర్క్ వీసా లభించకపోతే విజిట్ వీసాపై వెళ్లి ఏదైనా కంపెనీలో పని దక్కించుకునే అవకాశం ఉండటంతో ఏజెంట్లు కార్మికులను ఇదే తరహాలో ఆ దేశానికి తరలిస్తున్నారు. వర్క్ వీసా దొరికిన కార్మికులు ఢిల్లీ లేదా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ చేయించుకుని వెళ్లడానికి అవకాశం ఉంది. లైసెన్స్డ్ ఏజెంట్ల మోసాలు ఇలా.. అక్రమ వలసలను అరికట్టి, చట్టబద్ధమైన సురక్షిత వలసల కోసం ప్రభుత్వం లైసెన్స్‌లు మంజూరు చేస్తోంది. అయితే, ఈ లైసెన్స్‌లు పొందిన రిజిస్ట్రర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్లే అక్రమ దందాకు తెరలేపారు. మన దేశంలో వీసా స్టాంపింగ్ చేయించుకుంటే రూ.6 వేలు మెడికల్ టెస్ట్‌ల కోసం, రూ.11వేలు యూఏఈ ఎంబసీకి ఫీజు చెల్లించాలి. ఎంబసీలో సకాలంలో పనికాకపోతే ఒకటి రెండు రోజులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇందుకు మరికొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. లైసెన్స్డ్ ఏజెంట్లు కార్మికుల నుంచి వీసా కోసం రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో ఎంబసీలో స్టాంపింగ్ కోసం రూ.17వేలు, ఇతర ఖర్చులు పోను మిగిలిన దానిలో విమాన చార్జీలు, మధ్యవర్తులకు కమీషన్ చెల్లించడం వల్ల తమకు లాభం తగ్గిపోతుందని లైసెన్స్డ్ ఏజెంట్లు భావిస్తున్నారు. ఇక్కడ స్టాంపింగ్ చేయించడం కంటే విజిట్ వీసాపై యూఏఈ పంపిస్తే రూ.20వేల ఖర్చులో కార్మికుడు అక్కడకు చేరుకుంటున్నాడు. ఎలాగూ కంపెనీతో ఏజెంట్లు ముందుగా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వర్క్ వీసా సులభంగానే లభిస్తుంది. అందువల్ల విజిట్ వీసాలపైనే కార్మికులను యూఏఈకి తరలించడానికి ఏజెంట్లు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా విజిట్ వీసాలపై కార్మికులను యూఏఈకి తరస్తున్నారు. ప్రయోజనాలుపొందలేకపోతున్న కార్మికులు విజిట్ వీసాపై యూఏఈ వెళ్లి వర్క్ వీసా పొందుతున్న కార్మికులు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన వారి సమాచారం మన ప్రభుత్వం వద్ద ఉండే అవకాశం లేదు. ఇక్కడి నుంచి వర్క్ వీసాపై యూఏఈ వెళ్లిన వారికి రూ.10లక్షల ప్రవాసీ భారతీయ బీమా యోజన, ఇతర సదుపాయాలు అందుతాయి. కానీ, లైసెన్స్డ్ ఏజెంట్లు తమ లాభం పెంచుకోవడానికి అడ్డదారిలో కార్మికులను తరలిస్తుండటంతో వలస జీవులు ఎంతో నష్టపోతున్నారు. పోలీసులు, విదేశాంగ శాఖ దృష్టిసారిస్తేనే.. యూఏఈకి అడ్డదారిలో కార్మికుల తరలింపుపై మన పోలీసులు, విదేశాంగ శాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. విజిట్ వీసాలపై కార్మికులను తరలిస్తుండటాన్ని అడ్డుకుని ఇక్కడే వర్క్ వీసా జారీ చేయించి వలస వెళ్లేలా విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది. కార్మికుల ప్రయోజనాలను కాపాడాలన్నా, మన ప్రభుత్వం వద్ద వలస కార్మికుల వివరాలు ఉండాలన్నా.. చట్ట బద్దంగా ఇక్కడి నుంచి వర్క్ వీసాలపై యూఏఈ వెళ్లడానికి విదేశాంగ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. యూఏఈలో ఉపాధి కోసం రెండు రకాల వీసాలు.. యూఏఈలో పని కల్పించడానికి రెండు రకాల వీసాలను జారీచేస్తున్నారు. మన దేశం నుంచి యూఏఈ వెళ్లాలనుకునేవారికి సౌదీ అరేబియా తరహాలో పాస్‌పోర్టుపై మన దేశంలోనే యూఏఈ రాయబార కార్యాలయంలో వీసా స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, అబుదాబి, షార్జా, దుబాయిలలోనే కొన్ని ఎంపిక చేసిన కంపెనీల్లో ఉపాధి కోసం పాస్‌పోర్టులో వీసా స్టాంపింగ్ చేయిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ లేదా కేరళలోని తిరువనంతపురం యూఏఈ రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంది. వీసా పొందిన వారికి మన దేశంలోనే మెడికల్ టెస్టులను చేస్తారు. రెండో రకం వర్క్ వీసాలను పేపర్ ప్రింటింగ్ ద్వారానే జారీచేస్తున్నారు. ఈ వీసాలు పొందిన వారు యూఏఈ వెళ్లిన తరువాత ‘గమ్కా’ మెడికల్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. విజిట్ వీసాపై వెళ్లి నెల రోజులు ఉండివచ్చా.. వర్క్ వీసాను దుబాయిలో తీసుకోవచ్చనే ఉద్దేశంతో విజిట్ వీసాపై గత నెలలో వెళ్లాను. కానీ, అక్కడ సరైన పని దొరకలేదు. దీంతో నెల రోజుల పాటు ఉండి వర్క్ వీసాల కోసం ఎంతో ప్రయత్నించాం. ఆశించిన పని, వేతనం లేక పోవడంతో తిరిగి ఇంటికి వచ్చా. ఇక్కడే చిన్న కిరాణ దుకాణం నడుపు కుంటున్నా. – పెండెం మోహన్, వడ్యాట్(నిజామాబాద్ జిల్లా) ఇక్కడే వర్క్ వీసా పొందాలి.. మా గ్రామానికి చెందిన వ్యక్తి దుబాయిలో ఉన్నాడు. వర్క్ వీసా ఇప్పిస్తానంటే.. నాతో పాటు మరో వ్యక్తి కలిసి నెల రోజుల కిందట విజిట్ వీసాపై వెళ్లాం. కానీ, పని దొరకకపోవడంతో అక్కడి నుంచి తిరిగి వచ్చాం. విజిట్ వీసాలపై వెళ్లి వర్క్ వీసా తీసుకోవాలనుకోవడం పొరపాటే. ఆర్థికంగా నష్టపోయాం. – విప్పులాయి నవీన్, వడ్యాట్(నిజామాబాద్ జిల్లా) -
మా వినతుల సంగతి ఏమైంది?
మోర్తాడ్: సౌదీ అరేబియాలోని కంపెనీ వంచనతో ఇంటికి చేరిన తెలంగాణ కార్మికులు పునరావాసం కోసం కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి పేషీలో వినతి పత్రం సమర్పించారు. అయితే, దానిపై స్పందన కనిపించకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి దరఖాస్తు చేశారు. పునరావాసం కల్పించాలని సీఎం పేషీని ఆశ్రయించిన గల్ఫ్ బాధితులు.. తమ వినతుల సంగతి ఎంత వరకు వచ్చిందనే అంశంపై సమాచార చట్టం ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం ఇదే ప్రథమం అని పలువురు వెల్లడిస్తున్నారు. సౌదీ అరేబియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థ జేఅండ్‌పీ కంపెనీలో పనిచేయడానికి కొన్నేళ్ల క్రితం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి అనేక మంది కార్మికులు వలస వెళ్లారు. కొంతకాలం బాగానే నడిచిన కంపెనీ.. ఆర్థిక కారణాలను చూపుతూ కార్మికుల వేతనాలను నిలిపివేసింది. అంతేకాకుండా యాజమాన్యం కార్మికులకు పని కల్పించకుండా క్యాంపులకే పరిమితం చేసింది. అలాగే, అకామా (గుర్తింపు కార్డు) రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు మరో కంపెనీలో పని వెతుక్కునే వీలు లేకుండా పోయింది. దాదాపు ఆరు నెలల పాటు కార్మికులను జేఅండ్‌పీ కంపెనీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కార్మికులు తాము పడుతున్న ఇబ్బందులను సౌదీ అరేబియాలోని లేబర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రియాద్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయంలో కంపెనీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. సౌదీ లేబర్ కోర్టు, మన విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కార్మికులను క్యాంపుల నుంచి వారి స్వస్థలాలకు పంపించారు. జూన్ లో కొందరు, జూలైలో మరికొందరు కార్మికులు వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు 102 మంది ఉన్నారు. కంపెనీ మోసం చేయడంతో తిరిగి వచ్చిన తమకు ప్రభుత్వం పునరావాసం చూపించాలని వేడుకున్నారు. జూలై 16న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట్‌కు చెందిన సైండ్ల రాజిరెడ్డి సౌదీ నుంచి వాపసు వచ్చిన కార్మికుల తరపున సీఎం పేషీలో పునరావాసం కోసం దరఖాస్తు అందించారు. అయితే, దీనిపై స్పందన కనిపించకపోవడంతో ఈనెల 14న సమాచార చట్టం కింద తమ వినతి పత్రం సంగతి ఎంత వరకు వచ్చిందో తెలపాలంటూ దరఖాస్తు అందించారు. సమాచార చట్టం ద్వారానైనా న్యాయం జరుగుతుందని.. సమాచార చట్టం ద్వారానైనా గల్ఫ్ బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మేము ప్రభుత్వానికి పునరావాసం కోసం విన్నవించాం. కానీ, స్పందన లేదు. సమాచార చట్టాన్ని వినియోగించి ప్రభుత్వ స్పందనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.– సైండ్ల రాజిరెడ్డి, గల్ఫ్ బాధితుడు -
దుబాయ్‌లో బోరిగాం వాసి మృతి
సారంగపూర్(నిర్మల్): మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన బొల్లి నర్సయ్య(39) అనారోగ్యంతో శుక్రవారం దుబాయ్‌లో మృతి చెందాడని ఆయన కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం మృతుడు నర్సయ్య ఉపాధి కోసం దుబాయిలోని అబుదాభికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో రెండు నెలల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం తిరిగి 20 రోజుల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. కానీ, అక్కడ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అక్కడి కంపెనీ యాజమాన్యం ఆయనను అబుదాభిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ నర్సయ్య శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. నర్సయ్య మృతి వార్త తెలుసుకున్న వలస కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతుగంటి సాయేందర్ బోరిగాం చేరుకుని ఆయన భార్య ప్రమీల నుంచి వివరాలు సేకరించారు. అలాగే మృతుడు బొల్లి నర్సయ్యకు చెందిన ఆధార్‌కార్డు తదితర వివరాలు తెలుసుకొని త్వరలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని సాయేందర్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. -
దుబాయ్ వీధుల్లో దుర్భర జీవితం
దుబాయ్ నుంచి జనార్దన్‌రెడ్డి : ఎడారి దేశం దుబాయ్‌లో తెలంగాణ జిల్లాల కార్మికులు కొందరు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కల్లివెల్లి కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను సద్వినియోగం చేసుకుని ఇంటికి చేరుకోవాలంటే తమకు మొదట్లో వీసా జారీ చేసిన కంపెనీలకు వలస కార్మికులు జరిమానా చెల్లించాల్సి ఉంది. జరిమానా చెల్లించే స్థోమత లేక ఎంతో మంది కార్మికులు ఇంటికి చేరుకోలేకపోతున్నారు. వలస కార్మికులు నివాసం ఉన్న చోట ఉండాలంటే గదికి అద్దె, భోజనానికి కొంత పైకం చెల్లించాలి. అయితే.. చేతిలో చిల్లిగవ్వ లేక బల్దియా పార్కులు, ట్రక్కుల మెకానిక్ షెడ్లను ఆవాసంగా మార్చుకుని రోజులు వెళ్లదీస్తున్నారు. కొందరు కార్మికులైతే నిలచి ఉన్న ట్రక్కుల పైభాగంలో సేద తీరుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఇంటికి వెళ్లడానికి ఔట్‌పాస్ కోసం 500 ధరమ్స్ నుంచి 1,000 ధరమ్స్ వరకు జరిమానాగా చెల్లించాల్సి ఉంది. మన కరెన్సీలో రూ.7,500 నుంచి రూ.19 వేల వరకు అన్నమాట. కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లిస్తేనే వారికి గతంలో వీసా జారీ చేసిన కంపెనీలు ఔట్‌పాస్ జారీకి ఆమోదం తెలుపుతాయి. అయితే.. క్షమాభిక్ష కార్మికులకు విమాన టిక్కెట్లను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ.. కార్మికులు చెల్లించాల్సిన జరిమానా విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేక పోయింది. నిబంధనలు సవరిస్తేనే కార్మికులకు విముక్తి యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు జరిమానా చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం విమాన టికెట్లు ఉచితంగా పంపిణీ చేయడానికి విమానయాన సంస్థలకు చెక్కు రూపంలో చెల్లింపులు జరిపారు. అయితే.. కల్లివెల్లి కార్మికులు చెల్లించే జరిమానాలకు నగదు రూపంలో ప్రభుత్వం సహాయం అందించాల్సి ఉంది. కానీ.. నిబంధనల ప్రకారం నగదు చెల్లింపులకు అనుమతి లేదని ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి చిట్టిబాబు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యూఏఈలో కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లించడానికి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సి ఉంది. గల్ఫ్‌లో పని చేసి ఇంటికి డబ్బులు పంపించాల్సింది పోయి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో అప్పులు చేసి దుబాయ్‌కి ఎంతో ఆశతో వచ్చిన తాము నిరాశతో వెనుదిరుగుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలను సవరించి కార్మికుల తరఫున జరిమానాను చెల్లించడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎండలో ఎండుతూ.. చలికి వణుకుతూ.. పార్కులు, ట్రక్కులు, షెడ్లలో తలదాచుకుంటున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పగటి పూట ఎండ వేడిమికి, రాత్రిపూట చలి తీవ్రతను తట్టుకోలేక వణికిపోతున్నారు. కాగా.. బయట ఉంటున్న వారిపై కొందరు విదేశీ వ్యక్తులు ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన దుండగులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల వద్ద ఉన్న బ్యాగులను దుండగులు అపహరిస్తున్నారు. దీంతో కార్మికులు ఆదమరిస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాహనాలు ఏర్పాటు చేసిన నర్సింలు యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోవాలనుకునే కార్మికులకు మెదక్ జిల్లాకు చెందిన గుండేటి నర్సింలు అందించిన సహకారం ఎంతో ఉంది. ఒకప్పుడు కల్లివెల్లి కార్మికునిగా దుబాయ్‌లో పనిచేసిన నర్సింలు ఇప్పుడు ఒక కంపెనీకి యజమాని అయ్యాడు. కార్మికుల కష్టాలను గుర్తెరిగిన ఆయన.. వారి కష్టాలను తన కష్టాలుగా భావించి తన కంపెనీ వాహనాలను క్షమాభిక్ష కార్మికుల కోసం వినియోగించాడు. క్షమాభిక్ష పొందిన కార్మికులు లేబర్ క్యాంపుల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి నర్సింలు వాహనాలను తిప్పాడు. అంతేకాక రాయబార కార్యాలయంలో కార్మికులకు అవసరమైన సేవలను అందించాడు. కార్మికులకు ఎన్నో విధాలుగా సేవలు అందించిన నర్సింలును అందరూ అభినందిస్తున్నారు. 84 మందికి విముక్తి కలిగించాం యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకున్న 84 మంది కార్మికులను రెండు దశల్లో ఇంటికి చేర్పించాం. కొంత మంది కార్మికులు స్వచ్ఛందంగానే ఇంటికి చేరుకున్నారు. మరికొంత మందికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించాం. జరిమానా చెల్లించలేని స్థితిలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మంత్రి కేటీఆర్‌కు విన్నవించాం. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. –కొటపాటి నర్సింహానాయుడు, ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి -
కువైట్‌లో క్యూ కడుతున్న కార్మికులు
మోర్తాడ్(బాల్కొండ): కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో అక్కడి మన రాయబార కార్యాలయం వద్ద ఔట్ పాస్ కోసం ఎదుట స్వదేశానికి వచ్చేందుకు కార్మికులు క్యూ కడుతున్నారు. రాష్ట్రానికి చెందిన సుమారు 50 వేల మంది కార్మికులు కువైట్‌లో అక్రమంగా ఉంటున్నారు. ఏజెంట్ల మోసాలు యజమానుల వంచన నేపథ్యంలో చట్టబద్ధంగా అక్కడ ఉండలేక ఇంత కాలం ఇబ్బందులు పడుతూ బతికారు. ఏడేళ్ల తర్వాత కువైట్ ప్రభుత్వం క్షమాభిక్షను అమలు చేసింది. ఇందుకోసం ఫిబ్రవరి 22 వరకు గడువు విధించింది. దీనితో లబ్ధి పొందే కార్మికులలో తెలంగాణ వారే అధికంగా ఉన్నారు. వీరంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2016 చివరి రోజుల్లో అక్కడి పోలీసులు దాడులు నిర్వహించి వందలాది మందిని అరెస్టు చేశారు. వారంతా జైళ్లలోనే మగ్గుతున్నారు. ప్రభుత్వం టికెట్లను సమకూర్చాలి కువైట్ నుంచి తిరిగి రావడానికి ఔట్ పాస్‌లు పొందుతున్న కార్మికులకు ప్రభుత్వం విమాన టికెట్లను అందించాలి. కార్మికులు మన దేశానికి రాలేని పరిస్థితుల్లోనే రహస్యంగా ఉండిపోయారు. దీనిని గుర్తించి ప్రభుత్వం టికెట్లను సమకూరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. – పాట్కూరి బసంత్‌రెడ్డి, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక మండలి అధికార ప్రతినిధి -
సౌదీలో ఉండలేక.. స్వదేశం రాలేక !
మోర్తాడ్(బాల్కొండ): పొట్ట చేత పట్టుకొని.. పని కోసం సౌదీ వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడి కంపెనీ చేసిన మోసంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌదీ అరేబియా దమామ్‌లో ప్రాజెక్టు సిస్టమ్ గ్రూపు అనే జనరల్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టులను నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు కార్మికులకు కంపెనీ వీసాలు జారీ చేసింది. తెలంగాణ జిల్లాల నుంచి పలువురు కార్మికులు వీసాలు పొంది అక్కడికి వెళ్లారు. ఇటీవల సౌదీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కంపెనీ కాంట్రాక్టులు తగ్గించుకుంది. మొత్తం 56 మంది కార్మికులుండగా, 12 మందిని ఆరు నెలల క్రితం ఇళ్లకు పంపించి వేసింది. మిగిలిన వారికి అకామా ఇవ్వకుండా.. పని కూడా చెప్పకుండా సతాయిస్తోంది. ఆరు నెలలుగా వేతనాలు కూడా ఇవ్వటం లేదు. చివరికి అక్కడి లేబర్ కోర్టును ఆశ్రయించగా, కార్మికులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తమపై కోర్టుకు వెళ్లినందుకు కంపెనీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ భోజన, సరైన నీటి వసతి కూడా కల్పించడం లేదు. వేతనం.. పాస్‌పోర్టులు ఇస్తే ఇంటికి వెళ్తామని చెప్పినా వినటం లేదు. ఈ క్రమంలో కార్మికులు అక్కడి మన విదేశాంగ శాఖలో ఫిర్యాదులు చేసినా స్పందన లభించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని కార్మికులు కోరుతున్నారు. నరకంలో ఉన్నట్లుంది... కంపెనీ యాజమా న్యం వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నా యి. సౌదీలో ఉండటం అంటే నరకంలో ఉన్నట్లుగా ఉంది. మమ్మల్ని ఎలాగైనా ఇళ్లకు రప్పించాలి. – రవీందర్, జక్రాన్‌పల్లి, నిజామాబాద్ జిల్లా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్తాం సౌదీలోని దమామ్‌లో తెలంగాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై విదేశాంగశాఖను ఆశ్రయిస్తాం. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలసి బాధితులను ఇండ్లకు రప్పించడానికి చర్యలు తీసుకుంటాం. – పి.బసంత్‌రెడ్డి, టి.గల్ఫ్ కల్చరల్ ప్రతినిధి -
ఒమన్‌లో విషవాయువులతో ముగ్గురు మృతి
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఒమన్ దేశానికి వెళ్లిన ఇద్దరు తెలంగాణ కార్మికులు విషవాయువు ప్రభావంతో మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు కార్మికులు మరణించారు. అందులో ఒకరు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వాసి తిరుమలేశ్ కాగా, మరొకరు జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతానికి చెందిన రమేశ్ అని తెలిసింది. మరో వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిగా గుర్తించారు. ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లిన తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల కార్మికులు అక్కడి షిప్‌యార్డులో ఓడల నుంచి సరుకులను లోడింగ్, అన్లోడింగ్ చేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం ఒడ్డుకు చేరుకున్న షిప్ నుంచి సరుకులను దించేందుకు తిరుమలేశ్ కిందికి దిగగా, విషవాయువు ప్రభావంతో సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని రక్షించాలనే ఉద్దేశంతో రమేశ్ కార్గో షిప్‌లోకి దిగడంతో అతను కూడా సొమ్మసిల్లాడు. వీరిద్దరిని గమనించిన మణి అరుస్తూ కార్గో షిప్‌లోకి వేగంగా వెళ్లడంతో విషవాయువు గుప్పుమని అతనూ కింద పడిపోయాడు. ముగ్గురు కార్మికులు ఒకరి వెనుక మరొకరు సొమ్మసిల్లి పడిపోవడంతో మిగతా కార్మికులు, సేఫ్టీ బృందం గమనించి విషవాయువు వస్తున్న ప్రాంతంలో దాన్ని నిరోధించే మందును స్ప్రే చేశారు. కాగా, సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు కార్మికులను ఆస్పత్రిలోకి తీసుకెళ్లే క్రమంలోనే వారు మరణించారు. కార్గో షిప్ సముద్రంలో ప్రయాణించే సమయంలో ప్రాణాంతకమైన జలచరాలు వచ్చి చేరుతుంటాయి. వీటిని సంహరించడానికి రసాయనాలను షిప్లో చల్లుతారు. కార్గో షిప్ ఒడ్డుకు చేరుకున్న తరువాత రసాయనాలు నింపి ఉన్న అరల తలుపులను గంటపాటు తెరిచి ఉంచాలి. అయితే సేఫ్టీ బృందం ఇదేమీ పట్టించుకోక పోవడంతో కార్మికులు విషవాయువుల బారిన పడి మృత్యువాత పడినట్లు మృతుల సన్నిహితులు కుదురుపాక ప్రదీప్, నూగూరు రణధీర్ ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. తిరుమలేశ్ ఆరోగ్యం బాగాలేక పోవడంతో నెలరోజుల క్రితమే ఇంటికి వచ్చి చికిత్స చేయించుకుని ఒమన్ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొన్నిరోజులకే మృత్యువాత పడటాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమవారి మృతదేహాలను త్వరగా రప్పించాలని మృతుల కుటుంబీకులు కోరుతున్నారు. -
నాలుగు నెలలుగా నరకయాతన
- సౌదీలో తెలంగాణ కార్మికుల అరిగోస - ముగిసిన క్షమాభిక్ష గడువు - ఎక్కడ అరెస్టు చేస్తారోనని కార్మికుల ఆందోళన - స్వదేశానికి రావడానికి సహకరించని రాయబార కార్యాలయం అధికారులు - తిండి లేక అలమటిస్తున్న తెలుగు కార్మికులు మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశానికి వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండలేక, స్వదేశానికి రాలేక నాలుగు నెలల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారు దేశం విడిచి వెళ్లేందుకు సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష అవకాశం కల్పించింది. అయితే, తెలుగు కార్మికులపై అక్కడి కంపెనీల యజమానులు తప్పుడు కేసులు పెట్టడంతో కార్మికులకు ఔట్ పాస్‌పోర్టులను మన రాయబార కార్యాలయ అధికారులు జారీ చేయలేకపోయారు. సౌదీలోని కంపెనీల యజమానులు తమను వంచించారని, అందువల్లనే తాము కంపెనీలను వదిలి బయట పనులు చేశామని, తమకు ఎలాగైనా దౌత్య సహాయం అందించాలని కార్మికులు రియాద్‌లోని మన విదేశాంగ శాఖ కార్యాలయం అధికారులను అభ్యర్థించారు. అయితే, రియాద్‌లోని విదేశాంగశాఖ కార్యాలయం అధికారులు తాము సహాయం అందించలేమని చేతులెత్తేయడంతో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 40 మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. క్షమాభిక్ష ముగిసి పోవడంతో సౌదీలో అక్రమంగా ఉంటున్న కార్మికులను అరెస్టు చేయడానికి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులకు పట్టుబడితే కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుందనే భయంతో కార్మికులు రహస్యంగా జీవనం గడుపుతున్నారు. తమ ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోషియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్రెడ్డితోపాటు పలువురికి వివరించారు. విదేశాంగశాఖ కార్యాలయం అధికారులు సహాయం అందించలేమని స్పష్టం చేయడంతో తమకేమీ పాలుపోవడం లేదని వారు వాపోతున్నారు. నాలుగు నెలల నుంచి సరైన తిండి కరువైందని, తమ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో రహస్యంగా ఉంటున్న కార్మికుల్లో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ విషయమై గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సౌదీలోని కార్మికుల విషయాన్ని ఎన్ఆర్ఐ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు విదేశాంగశాఖ చొరవచూపితే కార్మికులు ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని, సౌదీలోని కంపెనీల యజమానులు తమకు జరిమానా చెల్లిస్తేనే ఔట్ పాస్‌పోర్టులకు ఆమోదం తెలుపుతామని చెబుతున్నారని వివరించారు. విదేశాంగ శాఖ అధికారులు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపితే కార్మికులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. -
రిటర్న్ టు హోం
ఖతర్‌లో సంక్షోభం - వెనుదిరిగిన కార్మికులు మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది. పొట్ట చేతపట్టుకొని అక్కడికి వెళ్లిన కార్మికులు ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణకు చెందిన సుమారు ఆరు వందల మంది ఖతర్ నుంచి ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇంకా, చాలామంది కార్మికులు కొద్ది రోజుల్లోనే ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని ఇటీవల ఖతర్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులు చెబుతున్నారు. తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతర్‌పై తోటి గల్ఫ్ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతర్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి. -
‘నోటు’ దెబ్బకు ఆ‘దారం’ తెగుతోంది!
► సూరత్‌లో టెక్స్టైల్ రంగం విలవిల ► తెలంగాణ కార్మికుల అష్టకష్టాలు ► మూతపడుతున్న దుకాణాలు ►30 శాతం తగ్గిన గ్రే బట్ట ఉత్పత్తి.. కోట్లలో నష్టం ► పనుల్లేక పస్తులుంటున్న కార్మికులు సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్‌లో టెక్స్టైల్ రంగం విలవిల్లాడుతోంది. ఈ రంగంపై ఆధారపడి బతుకుబండి లాగుతున్న తెలంగాణ కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. పలు జిల్లాల నుంచి పొట్టచేతబట్టుకుని ఇక్కడకు వచ్చిన వారంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూరత్‌లో ప్రతినిత్యం గ్రే బట్ట సుమారు 4 కోట్ల మీటర్ల మేర ఉత్పత్తి అవుతుంది. అయితే పెద్దనోట్ల రద్దు దెబ్బకు దీని ఉత్పత్తి 30 శాతం తగ్గింది. ఫలితంగా టెక్స్టైల్ రంగం కోట్లల్లో నష్టపోతోంది. అనేక మంది ఫ్యాక్టరీలను నడపలేక కార్మికులకు వారానికి రెండు నుంచి నాలుగు రోజులపాటు సెలవులు ఇస్తున్నారు. కొందరైతే కొన్నిరోజులపాటు పరిశ్రమను పూర్తిగా మూసేయాలనే ఆలోచనలో ఉన్నారు. మనోళ్లే ఎక్కువ సూరత్‌లోని టెక్స్టైల్ రంగంలో అత్యధికంగా తెలంగాణకు చెందినవారే ఉన్నారు. పవర్‌లూమ్స్ పరిశ్రమలన్నీ కుదేలవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా నానా అవస్తలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు కోసం వచ్చే బట్టల వ్యాపారులతో ఇక్కడి మార్కెట్లన్నీ కిటకిటలాడేవి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఈ మార్కెట్లన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. అనేక మంది తమ దుకాణాలను మూసివేసుకుని కూర్చుంటున్నారు. ఇలాగైతే ఫ్యాక్టరీ మూసివేయాల్సిందే.. నోట్ల రద్దుతో మార్కెట్లోని 30 శాతం దుకాణాలు మూతబడ్డాయి. బట్టలు కొనేందుకు ఎవరు రావడంలేదు. ఇప్పటికే కార్మికులకు జీతాలు ఇవ్వలేకున్నాం. తాత్కాలికంగా మా ఫ్యాక్టరీని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. – రుద్ర శ్రీనివాస్, పవర్‌లూమ్స్ యజమాని, గుమ్మడవెల్లి, సూర్యాపేట జిల్లా జీతాలకే కష్టమైంది.. మార్కెట్లన్నీ బోసిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడం తగ్గింది. కార్మికుల జీతాలు ఇవ్వడమే కష్టతరం గా మారింది. మార్కెట్లలో లావాదేవీలన్ని నిలిచిపోయాయి. – ఎనగందుల శ్రీధర్, గణేష్ సిల్క్ మిల్ షాపు యజమాని,తూర్పుగూడెం, సూర్యాపేట పనుల్లేవు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత పనులు సరిగ్గా లభించడం లేదు. మా యజమాని ఫ్యాక్టరీకి రెండు రోజులు సెలవులు ప్రకటించాడు. పనుల్లేక పస్తులుంటున్నాం. – సిలివేరి నాగేష్, పవర్‌లూమ్స్ కార్మికుడు, కుక్కడం, సూర్యాపేట అంచనాలన్నీ తారుమారయ్యాయి.. నాలుగు నెలలకిందటే సొంతంగా ఫ్యాక్టరీ పెట్టా. పది మంది వర్కర్లున్న నా ఫ్యాక్టరీకి దీపావళి వరకు మంచి ఆర్డర్లు ఉండేవి. ఇప్పుడు అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇలా పనులు లభించక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. –చిట్యాల నరేశ్, టెక్స్టైల్ డిజిటల్ ప్రింటింగ్ యజమాని, నర్సింహులపేట, మహబూబాబాద్ -
‘ఇరాక్‌లో చిక్కుకున్న వారిని రక్షించండి’
న్యూఢిల్లీః ఉపాధి కోసమని ఇరాక్ వెళ్లి.. ఏజెంట్ల మోసాలకు బలై విజిట్ వీసాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 500 మంది తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని గల్ఫ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తత్రేయను కోరింది. వర్కింగ్ వీసా అంటూ నమ్మించి విజిట్ వీసాపై ఇరాక్ తీసుకెళ్లి అక్కడ వదిలేస్తున్న ఏజెంట్ల బారి నుంచి తెలంగాణ వాసులను కాపాడాలని వేడుకుంది. వారందరినీ తిరిగి స్వస్థలాలకు రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని గురువారం ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి దత్తాత్రేయకు వినతిపత్రం సమర్పించారు. -
ఇంటికి రావాలంటే జరిమానా కట్టాల్సిందే..
మలేసియాలో నిబంధనలకు విరుద్ధంగా మన కార్మికులు భారీ జరిమానా వసూలు చేస్తున్న ప్రభుత్వం మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): పర్యాటకుల స్వర్గధామంగా పిలిచే మలేసియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి వద్దామన్నా.. అక్కడ పని చేద్దామన్నా నిబంధనలు అడ్డుపడుతుండడం.. భారీ జరిమానా భయంతో క్షణమొక యుగంలా బతుకుతున్నారు. గతంలో ఔట్‌పాస్ పొంది ఇంటికి వచ్చేందుకు మన కరెన్సీలో రూ. 15 వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉండగా, తాజాగా దానిని రూ. 45 వేలకు పెంచింది. పర్యాటక ప్రాంతం కావడంతో తక్కువ పనికి ఎక్కువ వేతనం వస్తుందని ఏజెంట్లు ఇక్కడి నుంచి వేలాది మంది నిరుద్యోగులను మలేసియా పంపించారు. వర్క్‌వీసా పేరిట విజిట్ వీసాలపై అక్కడికి తరలించారు. అయితే, రూ లక్షల్లో అప్పు చేసి అక్కడికి వెళ్లిన వారు విజిట్ వీసా గడువు ముగిసినా.. చేసిన అప్పులు తీర్చడానికి నిబంధనలకు విరుద్ధంగా అక్కడే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటున్నారు. అయితే, కొన్ని నెలలుగా మలేసియాలో వర్క్‌పర్మిట్, సరైన వీసా లేకుండా ఉంటున్న వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు అక్కడే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మరోపక్క ఇంటికి వద్దామంటే పాస్‌పోర్టులు ఏజెంట్ల చేతిలో ఉండడంతో దిక్కుతోచకున్నారు. మూడేళ్లుగా అక్కడ ఉంటున్న వారు ఇంటికి వచ్చేందుకు మలేసియాలోని ఇండియన్ హై కమిషన్‌ను ఔట్ పాస్ కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే, మన హైకమిషన్ ఔట్‌పాస్ జారీ చేసినా వీసా లేకుండా మలేసియాలో ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తోంది. గతంలో ఇండియన్ కరెన్సీలో రూ.15వేలు చెల్లిస్తే మలేసియా నుంచి ఇండియాకు వెళ్లడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. అయితే, మలేసియా ప్రభుత్వం జరిమానాను భారీగా పెంచింది. ఇప్పుడు అలా ఇంటికి వెళ్లాలను కునేవారు రూ. 45 వేలు చెల్లించాల్సి వస్తోంది. జరిమానా మొత్తాన్ని పెంచడంతో ఇళ్లకు వెళ్దామనుకుంటున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడే ఉందామంటే పోలీసులు అరెస్టు చేస్తుండడంతో అయోమయంలో పడ్డారు. పోలీసులు అరెస్టు చేస్తే జరిమానా అయినా కట్టాలి.. లేదంటే జైలుకైనా వెళ్లాల్సి ఉండడంతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
వర్క్ వీసా అన్నారు.. విజిటర్ వీసాపై పంపారు!
- మలేసియాలో తెలంగాణ కార్మికుల అవస్థలు - ఔట్ పాస్ పోర్టుకోసం వెతలు మోర్తాడ్(నిజామాబాద్): ఏజెంట్ల మోసాలు, విదేశాంగ శాఖ నిర్లక్ష్యం, అవగాహనలేమి కారణంగా పొట్టకూటికోసం మలేసియా వెళ్లిన తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మలేసియాలోని పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ వేతనాలు ఇస్తామని ఆశ చూపిన ఏజెంట్లు వేలాది మంది కార్మికులను వర్క్ వీసాలు అని చెప్పి విజిట్ వీసాలపై పంపించారు. విజిట్ వీసా జారీ చేసిన స్పాన్సర్ వద్దనే పాస్‌పోర్టులు ఉంటాయి. కార్మికులు జిరాక్సు కాపీతో మాత్రమే బయట తిరగాల్సి వస్తుంది. వీసా కోసం కార్మికులు ఒక్కొక్కరు ఏజెంట్లకు రూ.75 వేల నుంచి రూ.1లక్ష వరకు చెల్లించారు. మలేసియా వెళ్లడం కోసం ఎక్కువ వడ్డీకి అప్పు చేసిన కార్మికులు.. విజిట్ వీసాపై వెళ్లినా అక్కడే ఉండి ఎక్కడ పని దొరికితే చాలనుకుని కాలం గడుపుతున్నారు. అయితే, మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పట్టుబడిన కార్మికులు ఇళ్లకు వెళ్లాలంటే అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మంది కార్మికులు మలేసియా జైళ్లు, డిటెన్షన్ సెంటర్లలో ఉండి జరిమానా చెల్లించి ఇళ్లకు చేరుకున్నారు. వలస కార్మికుల సంక్షేమ సంఘం అంచనాల ప్రకారం మలేసియాలో తెలంగాణకు చెందిన దాదాపు 8వేల మంది కార్మికులు వర్క్ పర్మిట్, వీసా లేకుండా ఉన్నారు. కొద్దిరోజుల కిందట నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్‌కు చెందిన అమీర్ ఖాన్, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన హన్మంతు ఇంటికి రాగా, కమ్మర్పల్లి మండలం నాగాపూర్‌కు చెందిన నరేందర్ మాత్రం మలేసియాలోనే ఉండిపోయాడు. సుమారు నాలుగేళ్ల కింద మలేసియాకు విజిట్ వీసాపై వెళ్లిన నరేందర్ అక్కడే పని చేస్తున్నాడు. నరేందర్ ఇంటికి రావడం కోసం ఔట్ పాస్‌పోర్టు పొందాల్సి ఉంది. ఇండియన్ హైకమిషన్ కార్యాలయానికి వారం కింద వెళ్లగా అక్కడి అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని నరేందర్ 'సాక్షి'కి ఫోన్లో తెలిపాడు. తనతో పాటు చాలా మంది హైకమిషన్ కార్యాలయానికి వెళ్లారని తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తమను ఎలాగైన ఇళ్లకు చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని మలేషియాలో ఉన్న కార్మికులు కోరుతున్నారు. కాగా, విదేశాలలో పని చేస్తున్న మన ప్రాంత కార్మికులకు రాయబార కార్యాలయం ద్వారా ఔట్ పాస్‌పోర్టు జారీ కావాలంటే పాస్‌పోర్టు జిరాక్సు కాపీ, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉండాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధి మంద భీమ్‌రెడ్డి చెప్పారు. -
సౌదీలో సగం వేతనాలే..
* అంతర్యుద్ధంతో కోత విధించిన కంపెనీలు * ఇబ్బందుల్లో తెలంగాణ కార్మికులు మోర్తాడ్: సౌదీ అరేబియాలో అంతర్యుద్ధం కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిన కార్మికుల వేతనాలను యాజమాన్యాలు సగానికి తగ్గించాయి. స్వదేశాలకు వెళ్తామని కార్మికులు చెబుతున్నా పాస్‌పోర్టులు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనాలు చెల్లించేందుకు తొలుత ఒప్పందాలు కుదుర్చుకున్న యాజమాన్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం వేతనాలనే చెల్లిస్తున్నట్లు అక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ భోజనం, వసతి ఉన్న కార్మికుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, మిగిలిన కార్మికుల పరిస్థితి మరింత భిన్నంగా తయారైంది. ఒక్కో వీసాకు రూ.75 వేల నుంచి రూ. లక్ష వరకు ఏజెంట్లకు చెల్లించి గల్ఫ్‌కు వచ్చిన కార్మికులకు ఇప్పుడు తక్కువ వేతనాలు అందుతుండటంతో దిక్కుతోచకున్నారు. విదేశాలకు వెళ్లడానికి బంగారం అప్పుగా తీసుకుని తులానికి అర్ధ తులం వడ్డీగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, తక్కువ వేతనంతో పని చేస్తే తమ ఖర్చులు పోనూ వడ్డీలకే సరిపోవని వారి ఆవేదన. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మికులకు పూర్తి వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
డ్రగ్స్ మాఫియూ చేతిలో మన కార్మికులు
ఇండియా నుంచి గల్ఫ్‌కు మందుల అక్రమ రవాణా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతున్న దందా మోర్తాడ్: ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకుని గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ కార్మికులకు అదనపు ఆదాయం ఆశ చూపుతూ డ్రగ్స్ మాఫియా తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. అలా వారి చేతుల్లో చిక్కుకున్న కార్మికులు పోలీసులకు చిక్కుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, బాల్కొం డకు చెందిన ఇద్దరు ఇలాగే దుబాయ్ పోలీసులకు చిక్కారు. వారిని అక్కడి జైలుకు పంపినట్టు సమాచారం. కామారెడ్డి కేంద్రంగా బంగ్లాదేశ్‌కు సాగిన పెన్సిడిల్ మందు అక్రమ రవాణా సంఘటనను మరచిపోకముందే ఈ ఘటన వెలుగు చూసింది. గతంలోనూ కమ్మర్‌పల్లికి చెందిన ఒక యువకుడి వద్ద గల్ఫ్‌లో నిషేధించిన మందులు లభించడంతో అతన్ని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండియా నుంచి ఉపాధి కోసం వచ్చే కార్మికులతో గల్ఫ్‌లో నిషేధించిన మందులను పార్శిల్ రూపంలో డ్రగ్స్ మాఫియా రవాణా చేయిస్తోంది. మందుల పార్శిల్ తెచ్చిన కార్మికులకు నజరానా ఇస్తుంది. ఇలా తెచ్చిన మందులను మాఫియా గల్ఫ్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తుందనే విషయం ప్రచారంలో ఉన్నా, వాస్తవానికి మందులను వేరే విధంగా వినియోగిస్తారని కూడా అంటున్నారు. గల్ఫ్ పోలీసులకు ఇటీవల చిక్కిన మోర్తాడ్, బాల్కొండ వ్యక్తులతోపాటు జిల్లాకు చెందిన దాదాపు మరో 15 మంది మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారి జైలుకు వెళ్లినట్టు తెలిసింది. గల్ఫ్‌కు వెళ్లే కార్మికులు ఈ అక్రమ దందాలో చిక్కుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.