నాలుగు నెలలుగా నరకయాతన | Four months of hell | Sakshi
Sakshi News home page

నాలుగు నెలలుగా నరకయాతన

Published Mon, Aug 28 2017 2:46 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

నాలుగు నెలలుగా నరకయాతన - Sakshi

నాలుగు నెలలుగా నరకయాతన

- సౌదీలో తెలంగాణ కార్మికుల అరిగోస
ముగిసిన క్షమాభిక్ష గడువు
ఎక్కడ అరెస్టు చేస్తారోనని కార్మికుల ఆందోళన
స్వదేశానికి రావడానికి సహకరించని రాయబార కార్యాలయం అధికారులు
తిండి లేక అలమటిస్తున్న తెలుగు కార్మికులు  
 
మోర్తాడ్‌ (బాల్కొండ): ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశానికి వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండలేక, స్వదేశానికి రాలేక నాలుగు నెలల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారు దేశం విడిచి వెళ్లేందుకు సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష అవకాశం కల్పించింది. అయితే, తెలుగు కార్మికులపై అక్కడి కంపెనీల యజమానులు తప్పుడు కేసులు పెట్టడంతో కార్మికులకు ఔట్‌ పాస్‌పోర్టులను మన రాయబార కార్యాలయ అధికారులు జారీ చేయలేకపోయారు.

సౌదీలోని కంపెనీల యజమానులు తమను వంచించారని, అందువల్లనే తాము కంపెనీలను వదిలి బయట పనులు చేశామని, తమకు ఎలాగైనా దౌత్య సహాయం అందించాలని కార్మికులు రియాద్‌లోని మన విదేశాంగ శాఖ కార్యాలయం అధికారులను అభ్యర్థించారు. అయితే, రియాద్‌లోని విదేశాంగశాఖ కార్యాలయం అధికారులు తాము సహాయం అందించలేమని చేతులెత్తేయడంతో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 40 మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. క్షమాభిక్ష ముగిసి పోవడంతో సౌదీలో అక్రమంగా ఉంటున్న కార్మికులను అరెస్టు చేయడానికి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పోలీసులకు పట్టుబడితే కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుందనే భయంతో కార్మికులు రహస్యంగా జీవనం గడుపుతున్నారు. తమ ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా గల్ఫ్‌ తెలంగాణ కల్చరల్‌ అసోషియేషన్‌ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డితోపాటు పలువురికి వివరించారు. విదేశాంగశాఖ కార్యాలయం అధికారులు సహాయం అందించలేమని స్పష్టం చేయడంతో తమకేమీ పాలుపోవడం లేదని వారు వాపోతున్నారు. నాలుగు నెలల నుంచి సరైన తిండి కరువైందని, తమ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సౌదీలో రహస్యంగా ఉంటున్న కార్మికుల్లో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ విషయమై గల్ఫ్‌ తెలంగాణ కల్చరల్‌ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సౌదీలోని కార్మికుల విషయాన్ని ఎన్‌ఆర్‌ఐ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు విదేశాంగశాఖ చొరవచూపితే కార్మికులు ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని, సౌదీలోని కంపెనీల యజమానులు తమకు జరిమానా చెల్లిస్తేనే ఔట్‌ పాస్‌పోర్టులకు ఆమోదం తెలుపుతామని చెబుతున్నారని వివరించారు. విదేశాంగ శాఖ అధికారులు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపితే కార్మికులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement