మిమ్మల్ని ఉచితంగా భారత్కు తీసుకువస్తాం
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులందరూ వచ్చే నెల 25వ తేదీ లోపల స్వదేశానికి తిరిగిరావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. ఎలాంటి ప్రయాణ ఛార్జీలు లేకుండా ఉచితంగా భారత్కు తీసుకువస్తామని, ఇందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
మూతపడిన కంపెనీల సమస్యలను సౌదీ అరేబియా ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అప్పడు భారతీయులకు రావాల్సిన జీతాల బకాయిలను పరిష్కరిస్తారని సుష్మా పేర్కొన్నారు. వచ్చే నెల 25లోపు స్వదేశానికి తిరిగిరాలేకపోయిన భారతీయులు సౌదీలో ఉండటానికి సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంతేగాక తిరిగిరావడానికి విమాన ఛార్జీలు కూడా వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
సౌదీ ఆర్థిక వ్యవస్థ దిగజారడం, చమురు ధరలు తగ్గడం వల్ల చాలా కంపెనీలు మూతపడటంతో వేలాది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సమస్యపై సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించి సౌదీలో ఉపాధి కోల్పోయిన భారతీయులకు ఉచిత రేషన్ అందజేయాల్సిందిగా అక్కడ ఎంబసీ అధికారులను ఆదేశించారు.