సాదిక్‌ను నగరానికి తీసుకొస్తాం
► ఆయన తండ్రికి విదేశాంగ శాఖ లేఖ
► ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో యువకుడి నరకయాతన
► ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి నిమిత్తం కానరాని దేశం వెళ్లి నరకయాతన అనుభవిస్తున్న ఓ యువకుడిని రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఏజెంట్ల మోసానికి బలై సౌదీ ఎడారిలో అష్టకష్టాలు పడుతున్న సాదిక్ అనే హైదరాబాద్ యువకుడిని నగరానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ‘అలా ఉన్నాడు...ఇలా అయ్యాడు’ అనే శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు స్పందించారు. సాదిక్‌ను నగరానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని అతడి తండ్రి అలీయోద్దీన్‌కు విదేశాంగ కార్యాలయం అధికారులు లేఖ రాశారు.
సాదిక్ ఉపాధి నిమిత్తం స్థానిక ఏజెంట్ అర్షద్, ముంబైలోని రాజు అనే ఏజెంట్ సాయంతో గత ఏడాది జూన్ 23న సౌదీకి వెళ్లాడు. తీరా వెళ్లాక ఏజెంట్లు హామీ ఇచ్చిన తోటమాలి పని కాకుండా అబా నగరంలో ఒంటెలు, మేకలకు కాపలా కాసే పనిలో పెట్టారు. అయితే, ఖఫీల్(యజమాని) అన్నపానీయాలు కూడా సరిగా ఇవ్వడంలేదు. 11 నెలలపాటు జీతం ఇవ్వలే దు. సౌదీ ఎడారిలో నరకం అనుభవించాడు. అతని దీనస్థితిని చూసిన అక్కడి హైదరాబాద్ యువకులు యజమాని చెర నుంచి పారిపోవడానికి సహకరించారు. ప్రస్తుతం సాదిక్ రియాద్ సమీపంలోని ఉన్నట్లు అలీయోద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు.
ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని రెయిన్‌బజార్ పోలీసులను, ముంబైలోని అంధేరీ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరకు ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తన కొడుకును సౌదీ ఖఫీల్ బంధీఖానా నుంచి రక్షించాలని భారత విదేశాంగ వ్యవహారాలశాఖకు ఉత్తరం రాశారు. ‘సాదిక్ సౌదీ నుంచి నగరానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటాం’ అంటూ సాదిక్ తండ్రికి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. మరోవైపు రియాద్‌లో ఉన్న హైదరాబాద్ యువకులు భారత కాన్సులేట్‌కు సాదిక్ వ్యవహారం తెలియజేశారు. దీంతో సౌదీ కాన్సులేట్ వారు సాదిక్ ఖఫీల్‌కు ఫోన్ చేసి రియాద్‌కు రావాలని కోరగా వారం రోజుల్లో వస్తానని చెప్పినట్లు తెలిసింది.