ఇరాన్ దాడుల నేపథ్యంలోతెలుగువారి ఆందోళన
ఇజ్రాయెల్‌లో నివాసం ఉంటున్న5 వేల మంది తెలుగు వారు
తెలంగాణ నుంచి 800 మంది కార్మికులు
ఫోన్లు చేసి క్షేమ సమాచారంకనుక్కుంటున్న కుటుంబ సభ్యులు
ఆర్మూర్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్ దేశానికి వలస వెళ్లిన తెలంగాణ కార్మికుల కుటుంబాలు ఇక్కడ భయాందోళనలకు గురవుతు న్నాయి. తమ వారికి ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు సైతం భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఊళ్లలో సరైన పనులు దొరక్క నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల జిల్లాలతో పాటు తెలంగాణవ్యాప్తంగా సుమారు 800 మంది ఇజ్రాయెల్‌లో ఉపాధి కోసం వలస వెళ్లారు. వీరిలో పలువురు ఇజ్రాయెల్ వాసుల ఇళ్లలో కేర్‌టేకర్లుగా పనులు చేస్తున్నారు. మరో వైపు ఆ దేశంలో సుమారు ఐదు వేల మంది తెలుగు వారు వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నివాసం ఉంటున్నారు.
కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డ కార్మికులు ఇప్పుడు ఏడాది కాలంగా యుద్ధ పరిస్థితులతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయె ల్‌లోని రమద్‌గాన్ పట్టణం తలవిల ప్రాంతంలో అత్య«ధికంగా తెలంగాణ వాసులు నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ బాంబుల మోతతో దద్దరిల్లు తోందని తెలంగాణ వాసులు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.
కాగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల్లో భాగంగా బాంబుల దాడి సమయంలో అధికారులు సైరన్ మోగిస్తారు. వెంటనే ప్రజలు ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో పటిష్టంగా నిర్మించిన బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకుంటారు.
కొత్త సంవత్సర వేడుకల్లో ఉన్నాం..
బుధవారం ఇక్కడ నూతన సంవత్సరం. అందరం సామూహిక ప్రార్థనల్లో ఉన్నాం. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి టెల్ అవీవ్ పరిసరాల్లో సుమారు ఐదువేల మంది వరకు ఇక్కడ వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతానికి మాకు భయమేమీ లేదు. భద్రంగానే ఉన్నాం. ఏదైనా ముప్పు ఉంటే ముందే హెచ్చరిస్తారు. బంకర్లు సిద్ధంగా ఉన్నాయి. – లాజరస్ కొల్లాబత్తుల(ఇజ్రాయెల్), మల్కిపురం, కోనసీమ జిల్లా, ఏపీ
రక్షణ చర్యలు చేపట్టారు
ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరుల రక్షణకు గట్టి చర్యలు చేపట్టింది. దాడులు జరుగుతున్న ప్రాంతం మా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల తెలంగాణ వాసులు పెద్దగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. – సోమ రవి,తెలంగాణ – ఇజ్రాయెల్‌అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నాము..
ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించిన ప్రకారం భద్రతాపరమైన చర్య లను తీసుకుంటున్నాం. దాడులు సరిహద్దు ల్లోనే జరుగుతున్నాయి కాబట్టి మాకు ప్రాణభయం లేదు. కోవిడ్‌లో ఉపాధి లభించక ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు యుద్ధం కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. – శ్రీనివాస్ (ఇజ్రాయెల్), అమ్దాపూర్, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం
Comments
Please login to add a commentAdd a comment