సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శిల్పారామాలు పర్యాటకులతో నిత్యం కళకళలాడుతున్నాయి. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే 125 శాతం మేర సందర్శకుల తాకిడి పెరిగింది. కోవిడ్ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న శిల్పారామం సొసైటీ ఏడాది కాలంలోనే అనూహ్యంగా వృద్ధిని సాధించింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మెరుగైన రాబడి లభించింది. గతంలో ఎప్పుడూ నష్టాల్లోనే నడిచిన శిల్పారామాలు 2022–23లో ఏకంగా రూ.2 కోట్ల వరకు లాభం గడించడం రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది శిల్పారామాలు ఉండగా సగటున ప్రతినెల 1.25 లక్షల మంది సందర్శిస్తున్నారు.
ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి
గ్రామీణ వాతావరణానికి ప్రతీకలుగా నిలిచే శిల్పారామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుపతి, కడప శిల్పారామాల్లో మల్టీపర్పస్ హాల్, డైనింగ్ హాల్, టాయిలెట్‌ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
పర్యాటకుల భద్రత దృష్ట్యా శిల్పారామాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా బోటింగ్ (జలవిహారం) కార్యకలాపాల పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్–జిమ్, సందర్శకులను ఆకట్టుకునేలా పెయింటింగ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేసింది. మిగిలిన శిల్పారామాల్లోను ఈ తరహా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గుంటూరు శిల్పారామం పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పులివెందుల శిల్పారామంలో పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
కొత్త శిల్పారామాల ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, రాయచోటిల్లో అర్బన్ హట్స్ (శిల్పారామాల) నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లతో కర్నూలులో, రూ.9.20 కోట్లతో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బండపల్లిలో శిల్పారామాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది.
ప్రస్తుతం డీపీఆర్ తయారీ, భూ సేకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు విశాఖ, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరుల్లో ఒక్కోచోట రూ.1.50 కోట్లతో హస్తకళల మ్యూజియాల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది.
జిల్లాకో శిల్పారామం
ప్రతి జిల్లాలో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాటా స్కీమ్‌లను సది్వనియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శిల్పారామాల్లో పచ్చదనాన్ని కాపాడుతూనే ఆధునికీకరణ చేపడుతున్నాం. అందుకే రాష్ట్ర విభజన తర్వాత గణనీయమైన వృద్ధిని సాధించాయి. నెలకు 1.25 లక్షల మంది సందర్శకులు రావడం ఇందుకు నిదర్శనం. – ఆర్.కె.రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి
చక్కని ఆటవిడుపు కేంద్రాలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా శిల్పారామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాం. చక్కని ఆటవిడుపు కేంద్రాలుగా పిల్లలు, పెద్దలు కూడా సంతోషంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ముఖ్యంగా బోటింగ్ కార్యకలాపాలపై దృష్టిసారించాం. హస్తకళలు, కళాకారుల కోసం శిల్పారామాల్లో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్, స్టేజ్‌లను అందిస్తున్నాం. – శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సీఈవో, శిల్పారామం సొసైటీ
Comments
Please login to add a commentAdd a comment