
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నుంచి కోలుకున్న విజేతలు తమ ప్లాస్మా దానం చేయడం ద్వారా ఈ మహమ్మారి బాధితుల చికిత్సకు సహకరించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ను జయించిన వారు ఈ సంక్షోభ నివారణలో ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని శుక్రవారం విడుదల చేశారు.
కరోనా మహమ్మారిపై మానవాళి త్వరలోనే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలైన శాంతి, అహింస, సంఘీభావం, సోదరభావాన్ని పాటిస్తూ దేశ పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సామాజికదూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment