సాక్షి, ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం అంటే పండుగ. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను దేశంనుండి తరిమి కొట్టి స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నపోరాట స్ఫూర్తిని తలుచుకుని రోమాంచితమయ్యే ఒక అపూర్వ సందర్భం. కానీ కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నవేళ దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు చాలా నిరాడంబరంగా ప్రారంభమైనాయి. ఒకపక్క కరోనాకు వ్యతిరేకంగా దేశ పోరాటం కొనసాగుతోంది. మరోపక్క ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం గతంతో పోలిస్తే మహమ్మారి అదనపు జాగ్రత్తలకు పరిమితమైపోయిన సందర్భంలో ఉన్నాం. నిబంధనలు, ఆంక్షలతో ఉరిమే ఉత్సాహంతో కదిలే విద్యార్థులు, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా...అంటూ సాగే బాలలు లేకుండానే జెండా ఆవిష్కరణ వేడుకలు జరగనున్నాయి. అంతేకాదు ప్రతి సంవత్సరం ఎర్రకోట వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగే రెండున్నర గంటల సుదీర్ఘ ఉత్సవాలకు బదులు ఈ ఏడాది కేవలం 90 నిమిషాలు మాత్రమే పరిమితం.
కరోనా ఆంక్షల కారణంగా ఎన్‌సిసి క్యాడెట్లు తప్ప ఈ ఏడాది వేడుకలలో పిల్లలు పాల్గొనలేరు. షేక్ హ్యాండ్లు లేవు...ఆత్మీయ ఆలింగనాలు లేవు..ఎక్కడ చూసినా మాస్కులు, శానిటైజేషన్ పాయింట్లు..పీపీఈ కిట్లలో సిబ్బంది. గతంలో ఎక్కడా చూసినా విద్యాలయాలు పిల్లలు, జెండాలతో కళకళ్లాడేవి. దేశభక్తి పాటలు, కేరింతలతో, మువ్వన్నెల జెండాలతో మురిసిపోయే పిల్లలు ఈ విపత్కరవేళ చిన్నబోయారు. త్రివర్ణ పతాకాల తోరణాల రెపరెపలతో గర్వంగా తలయెత్తి జెండాకు వందనం చేసే పాఠశాలలు కూడా బోసిపోయాయి. సమయంలో పిల్లల సంబరాలు, ఆటపాటల ఉత్సాహాలు, దేశభక్తిగీతాల హోరు తగ్గిపోయింది. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలొదిన త్యాగమూర్తులను గుర్తు చేసుకుంటూ తమలో వారిని ఆవాహన చేసుకుంటూ పిల్లల వేషధారణలు అందరి మనసుల్లో తెలియని భావోద్వేగాన్నినింపేవి. ప్రభాత భేరీ, జాతీయ నేతల వేషధారణ, జాతీయ గీతాలతో హోరెత్తించే మైకులు మూగబోయాయి.ఎక్కడికక్కడ పరిమిత సంఖ్యలో, మాస్కులు, భౌతికదూరాన్ని పాటిస్తూ జెండావందనాలు నిర్వహించుకోనున్నారు.
హృదయాలపై జాతీయపతాకాన్నితడుముకుంటూ గర్వంగా దరహాసం చేసే చిన్నారులను చూసి మురిసిపోయే చదువుల తల్లి కూడా జాతీయ గీతాలు హోరును తలచుకుంటోంది. గత ఏడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని ఈ విపత్కర పరిస్థితులు సమసిపోయి..మళ్లీ తన బిడ్డలు గత వైభవాన్నినింపుకోవాలని..ఆరోగ్యంగా ఉండాలని భరతమాత దీవిస్తోంది. ఉందిగా మంచి కాలం ముందు ముందున..అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటూ విద్యార్థి లోకం త్రివర్ణ పతాకాన్ని గుండెలకు హత్తుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment