భారత రక్షణరంగ సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి
సతీష్ రెడ్డికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం
అవనిగడ్డ: రక్షణరంగ ఎగుమతుల్లో భారత్ నంబర్ వన్ స్థానానికి ఎదిగేరోజు దగ్గరలోనే ఉందని భారత రక్షణరంగ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఆదివారం దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు 99వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ప్రతీదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని చెప్పారు. గత ఏడాది రూ.21 వేలకోట్ల విలువైన రక్షణరంగ పరికరాలను మనం విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మన దేశం రూ.50 వేలకోట్ల నుంచి రూ.80 వేలకోట్ల పరికరాలు ఎగుమతి చేసేస్థాయికి చేరుతుందన్నారు.
మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాం సారథ్యంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ప్రాజెక్టులు నేడు మన దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చాయని చెప్పారు. నిమ్మకూరులో ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేస్థాయికి చేరుకుంటామన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఎదురైన ఆటంకాలను తొలగించి అన్ని అనుమతులు వచ్చేలా కృషిచేస్తామని చెప్పారు.
తెలుగువారిని ఒక్కటి చేసిన మండలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సరసన చేర్చదగిన గొప్ప వ్యక్తి సతీష్‌రెడ్డి అని కొనియాడారు. తెలుగు భాషాభివృద్దికి తోడ్పడిన మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెంకటకృష్ణారావు ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు ద్వారా తెలుగువారందరినీ ఒక్కటి చేశారని పేర్కొన్నారు. సతీష్‌రెడ్డి జీవితచరిత్రపై మండలి ఫౌండేషన్ ప్రచురించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment