సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 8 రౌండ్లు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. విమానాశ్రయంలో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దీంతో 50కి పైగా విమానాలపై ఎఫెక్ట్ పడింది. రైళ్లు , విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు.
కాగా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన మంగళవారం జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఏటీఆర్ 72–600 విమానం హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుంది. రన్ వేపై దిగేందుకు దగ్గరగా వచ్చిన సమయంలో పైలెట్లు ఒక్కసారిగా విమానాన్ని తిరిగి గాల్లోకి లేపడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
ఐదు నిమిషాల వ్యవధిలో విమానాన్ని తిరిగి సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే రన్‌వేపై ల్యాండింగ్ అయ్యే ప్రాంతం కంటే ముందుకు విమానం రావడంతో పైలెట్లు భద్రత ప్రమాణాల్లో భాగంగా వెంటనే టేకాఫ్ తీసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విమానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు.
ఇది చదవండి: ఢిల్లీ: 12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి
Comments
Please login to add a commentAdd a comment