
నేటి నుంచి విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు, స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. అమ్మవారి సన్నిధిలో సోమవారం నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు.
రోజూ తెల్లవారుజామున నాలుగు నుంచి రాత్రి పదిగంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అక్టోబర్ రెండో తేదీన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రెండులక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అదేరోజు అమ్మవారికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా సీపీ టి.కె.రాణా ప్రత్యేక పూజలు చేసి దుర్గమ్మకు పట్టువ్రస్తాలు సమర్పించారు.