గోపవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో సెంచురీ ఫ్లై పరిశ్రమను నిర్మిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంకా తెలిపారు. వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద నిర్మిస్తున్న పరిశ్రమ పనులను గురువారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భజాంకా మాట్లాడుతూ తొలుత తమిళనాడులో యూనిట్ నెలకొల్పాలని భావించామని, అయితే వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయడం వలన ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ తమకు చెప్పారని, దీంతో తాము ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు చకచక రావడంతో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. 2024 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
ముందుగా రూ.600 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించామని, ఇప్పుడు రూ.1,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు భజాంకా తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కావడం వలన రెండు వేల మందికి ప్రత్యక్షంగాను, నాలుగు వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంని, 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు భజాంకా వెల్లడించారు. నిరుద్యోగులకు ఎలాంటి అనుభవం లేకున్నా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో సెంచురీ ప్యానల్ జీఎం రమేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment