ఆరు నెలల క్రితం మే నెలలో దావోస్ వెళ్లినప్పుడు నన్ను గుర్నానీ కలిశారు. ఆయన నాతో మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ వైపు వేస్తున్న అడుగులకు ఎలాగూ ఊతమందిస్తున్నాం. మరోవైపు నా కుమారుడు ఇథనాల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ ప్లాంట్ ఎక్కడ పెట్టాలా.. అని ఆలోచిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల వైపు చూసి ఆలోచిస్తున్నారు. మన (ఏపీ) రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది’ అని నన్ను అడిగారు. రాష్ట్రంలో ఏ రకంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామో చెప్పాం. మన రాష్ట్రానికి రావాలని ఆహ్వానం పలికాం. అప్పటి నుంచి ఇప్పటికి కేవలం ఆరే ఆరు నెలలు. అంతలోనే పరిశ్రమకు భూములివ్వడం దగ్గర నుంచి.. కావాల్సిన అనుమతులన్నీ మంజూరు చేసి, ఈ రోజు భూమిపూజ చేసుకుంటున్నాం. ఇదీ మన రాష్ట్రంలో జ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనం.
రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న ఎంఎన్‌సీలు కూడా పలు రాష్ట్రాలను పరిశీలించినప్పుడు వాటికి తొలుత మన రాష్ట్రమే కనిపిస్తోంది. అందువల్లే ఏపీపై ఆసక్తి కనబరుస్తున్నాయి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
గుమ్మళ్లదొడ్డి నుంచి సాక్షి ప్రతినిధి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు మన ప్రభుత్వం సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే పారిశ్రామిక దిగ్గజం అస్సాగో భారీ పెట్టుబడితో ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శుక్రవారం ఆయన కంపెనీ సీఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నానీ.. తండ్రి, టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశీష్‌గుర్నాని, సీపీ గుర్నానీలను దావోస్‌లో కలిసి మాట్లాడి.. ఆరు నెలలు తిరక్కుండానే గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమకు భూమి పూజ చేసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంటుందని అన్నారు.
మన పిల్లలకే ఉద్యోగాలు
► ఈ ప్లాంట్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేసిన అస్సాగో ఇండస్ట్రీస్ ఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నాని, ఆయనకు అన్ని విధాలా మార్గదర్శకత్వం వహిస్తున్న తండ్రి, టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు.. అందరికీ హృదయ పూర్వక అభినందనలు.
► టెక్ మహీంద్రా.. పెద్ద సాప్ట్‌వేర్ కంపెనీ అనే విషయం మనందరికీ తెలుసు. ఈ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీ కుమారుడు అశీష్ గుర్నానీ ఆధ్వర్యంలో ఇక్కడ 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
► ఈ ప్లాంట్‌తో 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వాటిలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం తీసుకురావడంతో చదువుకున్న మన పిల్లలకు మంచి జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా రైతులకు, వ్యవసాయాధారమైన ఈ ప్రాంతానికి చాలా మేలు చేస్తుంది.
► తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడమే కాకుండా ముక్కిపోవడం, బియ్యం విరిగిపోయే పరిస్థితులు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సమస్యలకు ఈ ప్లాంట్ పరిష్కారం చూపిస్తుంది.
► బ్రోకెన్ రైస్‌తో పాటు నూకలు, మొక్కజొన్న.. ఈ రెండింటి ఆధారంగా ఈ ఇథనాల్ ప్లాంట్ పని చేస్తుంది. దానివల్ల మన రైతులకు మేలు జరుగుతుంది. రంగు మారిన, విరిగి పోయిన ధాన్యానికి కూడా మంచి రేటు ఇప్పంచగలిగే గొప్ప అవకాశం ఉంటుంది. ఈ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిలో నిర్మిస్తుండటంతో కాలుష్యానికి అవకాశాలు చాలా తక్కువ. ఈ ప్లాంటుతో పాటు బై ప్రొడక్ట్ కింద హైక్వాలిటీ ప్రోటీ¯న్ పశువుల దాణా, చేపల మేత, కోళ్ల దాణా వంటి ఫీడ్ అందుబాటులోకి వస్తుంది.
మరిన్ని పరిశ్రమలకు రాచబాట
► త్వరితగతిన ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వేత్తల వద్ద, రకరకాల ఫోరమ్‌ల వద్ద మన రాష్ట్రంలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ప్రస్తావించే అవకాశం, పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ పరిశ్రమలు గుర్నానీ ద్వారా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది.
► ప్రతి అంశంలో మేం మీకు తోడుగా ఉంటామని గుర్నానీకి మాట ఇస్తున్నాను. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మా పిల్లలకు మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా చేయడానికి మీరు అంబాసిడర్‌లా ఉండండి.
► ఏలేరు కుడి కాలువ నిర్మాణం గురించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇందాకే అడిగారు. దానికి దాదాపు రూ.50 కోట్లు అవుతుంది. ఈ పనులకు ఈ వేదికపై నుంచే అనుమతి మంజూరు చేస్తున్నా. ఈ పనుల ద్వారా 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయి. రైతులు, ప్రజలకు మంచి జరుగుతుంది.
► అస్సాగో ఇండస్డ్రియల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అశిష్ గుర్నాని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, చింతా అనురాధ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధిని ఆపలేరు
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం లేదు.. అభివృద్ది జరగడం లేదు.. పరిశ్రమలు తరలిపోతున్నాయని ఒక మాజీ మంత్రి సీఎంకు లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే, ఇది మా ప్రాంతానికి వద్దు.. మాకు అవసరం లేదని లేఖలు రాశారు. ఇదీ వాళ్ల దుర్బుద్ధి. జరుగుతున్న అభివృద్ధి, తరలి వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వారు అడుగులు వేస్తున్నారు. లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడుల కార్యచరణతో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు.
– గుడివాడ అమర్‌నాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
30 సెకన్లలో సీఎం అంటే ఏమిటో తెలిసింది..
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. మహానేత రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పీపుల్ ఓరియంటెడ్, సోషల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ విధానంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచారు. పరిశ్రమకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో నా కుమారుడు అశిష్ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహమే లేదు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌తో కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడాము. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా అమలు చేస్తారని, యువత ఉపాధికి ఏ రకంగా వినియోగిస్తారని అడిగాను. ఆ సమయంలోనే రాష్ట్ర అభివృద్ధి పట్ల సీఎం అంకితభావం తెలిసింది. ఈ ప్రాంతంలో యువత, పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్న లక్ష్యం.. సంకల్పం తెలియజేశారు. దావోస్‌లో చెప్పిన మాట ప్రకారం కేవలం ఆరు నెలలల్లోనే అన్ని అనుమతులు ఇచ్చారు. ఇదీ సీఎం నిబద్ధత, నిజాయితీకి నిదర్శనం. తొలిసారి ఒక పరిశ్రమ స్థాపనకు ఆసక్తి చూపించిన నా కుమారుడు కూడా జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా. ఇందుకు సరైన వేదిక ఆంధ్రప్రదేశ్ అని భావించి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం.
– సీపీ గుర్నానీ, టెక్‌మహీంద్రా ఎండీ, సీఈఓ
చదవండి: రాళ్లు విసిరించుకోవడం చంద్రబాబుకు సాధారణమే: మంత్రి జోగి రమేష్
Comments
Please login to add a commentAdd a comment