
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఈ సొసైటీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆదివారం ఆయన స్పందించారు.
ఏపీ సహకార సంఘాల చట్టం సెక్షన్ 51 ప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రకాశం జిల్లా సహకార శాఖాధికారి రాజశేఖర్, డీఎస్పీ శ్రీకాంత్, సీఐ రోశయ్య ఇప్పటికే వేటపాలెం సొసైటీలో విచారణ చేపట్టారన్నారు. బాధితుల ఫిర్యాదుతో కార్యదర్శితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేశారన్నారు. కాగా ఈ వ్యవహారంపై ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించామని, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.