Vetapalem
-
గుక్క పట్టి ఏడుస్తూ.. వద్దమ్మా అంటున్నా ఆమె మనసు కరగలేదు
సాక్షి, ప్రకాశం (వేటపాలెం): అభం శుభం తెలియని బాబుకు.. తన తల్లి ఏం చేస్తుందో తెలియక.. గుక్క పట్టి ఏడుస్తూ.. వద్దమ్మా వద్దు అంటున్నా ఆమె మనసు కరగలేదు.. పిల్లాడు చూస్తుండగానే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలోని పద్మశాలి వీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పద్మశాలి వీధిలో అద్దె ఇంట్లో అమరలింగేశ్వరరావు, అనూష (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి కాగా ఒక పాప, బాబు ఉన్నారు. అమరలింగేశ్వరరావు బేల్దారి పనులు చేస్తుంటాడు. అయితే శుక్రవారం ఉదయం భర్త పని కోసం వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనూష ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొనేందుకు ఉపక్రమించింది. ఇంట్లోనే ఉన్న ఐదేళ్ల కుమారుడికి తల్లి ఏంచేస్తుందో అర్థం కాలేదు. ఏడుస్తూ వద్దమ్మా అని వేడుకున్నా ఆమె వినలేదు. దీంతో బాలుడు ఇంటి ముందు ఉన్న వారిని తీసుకొచ్చేలోపే తల్లి ప్రాణాలు వదిలింది. భార్య, భర్తలు అన్యోన్యంగానే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై జి.సురేష్, సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చదవండి: (అంబులెన్స్‌కు చోటివ్వని చంద్రబాబు కాన్వాయ్) -
తండ్రి కర్మకాండలకు నిరాకరించిన కొడుకు.. నిర్వహించిన కూతురు!
వేటపాలెం: కొడుకు ఉన్నప్పటికీ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తండ్రికి కర్మకాండలు చేసేందుకు నిరాకరించాడు. దీంతో కుమార్తే తన తండ్రికి కర్మకాండలు నిర్వహించింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని నాయినపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పోలేరమ్మ దేవస్థానం దగ్గర నివాసం ఉండే సూరిశెట్టి సాంబశివరావు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. కుమార్తె, కుమారుడు సంతానం కాగా, ఇద్దరికీ వివాహం చేశాడు. కుమారుడు విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబశివరావు బుధవారం మరణించాడు. గురువారం కర్మకాండలు నిర్వహించాల్సి ఉంది. అయితే, తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారుడు నిరాకరించాడు. దీంతో మృతుడి కుమార్తె శ్రీలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది. -
Bapatla District: పారిశ్రామికాభివృద్ధికి అడుగులు
సాక్షి, బాపట్ల: జిల్లాలో తీర ప్రాంతం విస్తరించి ఉండడంతో అటు పర్యాటకం, ఇటు పారిశ్రామికంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త అవకాశాలు కల్పిస్తూ, ప్రోత్సహిస్తుంది. నూతనంగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాలో 74 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉంది. సూర్యలంక, పాండురంగాపురం, రామచంద్రాపురం, ఓడరేవు, కృపానగర్, అడవిపల్లెపాలెం బీచ్‌లు పర్యాటకానికి అనువుగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. తీరంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుండడంతో స్టార్ హోటళ్లను తలదన్నేలా రిసార్ట్స్ వెలుస్తున్నాయి. అతిథ్య రంగం కూడా పుంజుకుంటుంది. తీర ప్రాంతం వెంబడి రొయ్యలు, చేపల సాగు విస్తృతంగా చేస్తుండడంతో ఆక్వా పరంగా రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు ఐదు ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు మరో 18 హేచరీలు ఉన్నాయి. ఆయా యూనిట్లలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, చీరాల పరిధిలోని ఓడరేవు హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్న ఆ ప్రాజెక్టులు పూర్తయితే అనుబంధంగా మరెన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ► తాజాగా కేరళకు చెందిన టెడ్ఎక్స్ ఛాయిస్ గ్రూప్ విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఆ సంస్థ జిల్లాలోని తీర ప్రాంతంలో ఆక్వా రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. తీరం వెంబడి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆ ప్రాజెక్టు డీపీఆర్ కూడా పూర్తిచేసి అనుమతులు కోసం పంపారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు రూపకల్పన జరగనుంది. ► క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 80 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రం, 5 శాతం లబ్ధిదారులు వాటాగా ఇస్తూ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధానం అమలులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. బాపట్లలో భావపురి రైస్ క్లస్టర్ పౌండేషన్ ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ధాన్యం ఆరబెట్టే మిషనరీతోపాటు ఫోర్టిఫైడ్ బియ్యం తయారీ మిషనరీ ఏర్పాటు చేశారు. ► ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా జిల్లాకు 104 ప్రాజెక్టులకుగాను రూ.30.60 కోట్లు మంజూరయ్యాయి. ఆ పథకానికి ఇప్పటికే 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 32 మందికి రూ.94.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో 15 గ్రౌండింగ్ అయ్యాయి ► చీరాల పరిధిలోనే ఈపూరుపాలెం వద్ద ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 44.57 ఎకరాల్లో లే–అవుట్ వేసి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. స్మాల్ ఇండస్ట్రీయల్తో ఎంతో మందికి ఉపాధి లభించనున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా అడుగులు పడుతున్నాయి. తీరంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన పథకాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనున్నాయి. – ఎన్ మదన్మెహన్, పరిశ్రమల శాఖ జీఎం, బాపట్ల -
Vetapalem: బండ్ల బాపయ్య విద్యాసంస్థకు వందేళ్లు
వేటపాలెం (బాపట్ల జిల్లా): వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ బడిని 1921 నవంబర్ 4న బండ్ల బాపయ్య శెట్టి హిందూ మాధ్యమిక పాఠశాల పేరుతో నెలకొల్పారు. దీనికి ఐదెకరాల స్థలం కేటాయించి అందులో శాశ్వత భవనం నిర్మించారు. దీనికి అప్పట్లో ప్రభుత్వం రూ.12,457 గ్రాంటు కూడా మంజూరు చేసింది. అప్పటి నుంచి పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. బడికి అనుబంధంగా 1946లో హైస్కూలు, 1961లో హయ్యర్ సెకండరీ స్కూల్, 1969లో జూనియర్ కళాశాల, 1981లో డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలోని ఒక భాగంలో కొంత కాలం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులూ నిర్వహించారు. 400 మంది ఉపాధ్యాయులు ఇక్కడ శిక్షణ పొందారు. పూర్వం ఈ పాఠశాలను అందరూ ఇంగ్లిషు బడి అని పిలిచేవారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నతస్థానాలు అధిరోహించారు. విదేశాల్లోనూ ఉన్నత స్థితికి చేరారు. చేయూతగా రాధాకృష్ణయ్య హాస్టల్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం పథకం తరహాలో ఈ పాఠశాలలో స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి విద్యార్థులకు భోజనం పెట్టేవారు. గొల్లపూడి రాధాకృష్ణయ్య ఈ విధానానికి నాంది పలికారు. 1933లో పాఠశాలకు అనుసంధానంగా ఉచిత భోజన హాస్టల్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ రాధాకృష్ణయ్య వారసుల ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుండడం విశేషం. నవంబర్‌లో శతజయంత్యుత్సవాలు బండ్ల బాపయ్య విద్యా సంస్థ నెలకొల్పి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కాలేజీలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు పాల్గొననున్నారు. ఇంగ్లిష్ బాగా చెప్పేవారు నేను 1971–73లో వేటపాలెం బండ్ల బాపయ్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివాను. అప్పట్లోనే అధ్యాపకులు ఇంగ్లిషు బోధించారు. అందువల్ల నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇంగ్లిష్‌లో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. గొల్లపూడి రాధాకృష్ణయ్య హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసేవాడిని. అది నా అదృష్టం. – డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ ఉపాధ్యాయ వృత్తికి పునాది ఇక్కడే ఈ పాఠశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించేవారు. 1940లో 4వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాశాను. పాసై బడిలో చేరాను. మా తల్లిదండ్రులు ఇంగ్లిష్ బడిలో చదువుతున్నానని గొప్పగా చెప్పుకునేవారు. ఈ విద్యా సంస్థల్లోనే విద్యనభ్యసించి, 37 ఏళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. – లొల్లా శ్రీరాం మూర్తి, విశ్రాత ప్రధానోపాధ్యాయుడు -
బాపట్లలో విషాదం.. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
చీరాల టౌన్: విహారయాత్ర కోసం బీచ్‌కు వచ్చిన నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యా రు. వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో గురువారం జరిగింది. చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు... గుంటూరుకు చెందిన జీవీఆర్‌ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రామాపురం బీచ్‌కు వచ్చా రు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా పెద్ద అలలు వచ్చాయి. తెనాలికి చెందిన యడవల్లి రమణ (19), పులివర్తి గౌతమ్ (20), అమరావతి మండలం పరిమి గ్రామానికి చెందిన తాళ్లూరి రోహిత్ (20), హైదరాబాద్‌కు చెందిన తిరుణగిరి మహదేవ్ (18) అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో కేకలు వేస్తున్న విద్యార్థుల ను కాపాడేందుకు రామాపురం మత్స్యకారులు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మహదేవ్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొ చ్చింది. మిగిలిన ముగ్గురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మహదేవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీరంలో మిన్నంటిన రోదనలు... గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు రామాపురానికి చేరుకున్నారు. కుమారులు సముద్రంలో గల్లంతుకావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్న తమపై విధి కక్షగట్టి తీసుకెళ్లిందని, తమకు కడుపుకోత మిగిల్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అక్కడికి చేరుకుని విద్యార్థులు, డీఎస్పీ పి.శ్రీకాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..
సాక్షి, వేటపాలెం (బాపట్ల జిల్లా): విహార యాత్ర విషాదయాత్రగా మారింది. సరదాగా వాగులో దిగిన ముగ్గురు విద్యార్థినులు ఆ నీటి ప్రవాహానికి బలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం సోకిలేరు వద్ద జరిగిన ఈ ఘటనతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశాయిపేట పంచాయతీ అనుజ్ఞ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న 21 మందిలో 15 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినిలను ఆదివారం ఉదయం బస్‌లో భద్రాచలం, అరకు ప్రాంతాలకు విహారయాత్రకు యాజమాన్యం తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం చేరుకున్నారు. అక్కడ ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలను సందర్శించుకొని అక్కడ నుంచి సోమవారం ఉదయానికి చింతూరు చేరుకున్నారు. చింతూరు వ్యూపాయింట్ వద్ద సోకిలేరు వాగు నీటిలో సరదాగా విద్యార్థులు దిగారు. అయితే వాగు నీటిలో దిగిన విద్యార్థినిలు గుమ్మడి జయశ్రీ (14), సువర్ణకమల (14), గీతాంజలి (14) లోతు గమనించకపోవడంతో వారిలో ఒక అమ్మాయి వాగునీటిలో జారి పడిపోయింది. పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిలు స్నేహితురాలి చేయి పట్టుకునే సమయంలో ప్రమాదవ శాత్తు ముగ్గురూ లోతైన నీటి గుంటలో పడి వాగులో గల్లంతై మృతి చెందారు. బాలికల కుటుంబాల్లో విషాద ఛాయలు.. విహార యాత్రకు వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే వాగులో గల్లంతై ప్రాణాలు విడిచిన తమ పిల్లల సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని కేపాల్ కాలనీకి చెందిన వెంకారెడ్డికి గీతాంజలి (14) ఒకే ఒక్క కుమార్తె. వెంకారెడ్డి విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుమార్తెను మంచి చదువులు చదివించాలని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. విహార యాత్రకు వెళతానని చెప్పగానే కుమార్తె ఆనందానికి అడ్డుచెప్పకుండా పంపించాడు. యాత్రకు వెళ్లిన ఒక్క రోజు గడవక ముందే తన కుమార్తె ఇకలేదని వార్త తెలియడంతో హతాశుడయ్యాడు. భార్యకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో తన కూతురు మరణించిన విషయం భార్యకు చెప్పుకోలేక తల్లడిల్లుతున్నాడు. తన భార్య తట్టుకోలేదని భోరున విలపించాడు. ఔ చదవండి: (నాకు మాత్రమే తెలుసు ఎందుకుపోతున్నానో.. మరో జన్ముంటే మళ్లీ కలుద్దాం) విలేకర్లు చెప్పిందాక తెలియదు.. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని సిలోన్ కాలనీకి చెందిన గౌరీ రవికుమార్ చేనేత పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి సువర్ణకమల ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ‘‘విహార యాత్రకు వెళతామంటే పంపించాం. అయితే విహార యాత్రకు వెళ్లిన ప్రాంతంలో ప్రమాదంలో నీటిలో పడి తమ కూతురు మరణించిందని విలేకర్లు చెబితే తెలుసుకున్నాను. హైస్కూల్ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా కూతురు విషయాలు ఇంతవరకు తెలియలేదు. మీరైనా తెలిసి ఉంటే చెప్పాలని’’ విషాద వదనంతో వాపోయాడు. ఇద్దరు బిడ్డల్లో ఒకరిని కోల్పోయా.. వేటపాలెం నాయినపల్లి కాయల లంపకు చెందిన శేషగిరి ప్రైవేట్ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో గుమ్మడి జయశ్రీ అనుజ్ఞ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ‘‘విహార యాత్రకు వెళతామంటే పంపించాను. యాత్రకు వెళ్లిన ఒక రోజు గడవక ముందే ప్రమాదం జరిగిందని తెలిసింది. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. జరిగిన విషయం భార్యకు చెప్పలేదు. కూతురు విషయం తెలిస్తే భార్య ఏమవుతుందో ఆందోళనగా ఉంది. ఇంత నిర్లక్ష్యంగా యాజమాన్యం ఉంటే మా పిల్లలు పరిస్థితి ఏమిటి? ఇద్దరు బిడ్డల్లో ఒకరిని కోల్పోయా..’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
Russia-Ukraine War: నరకం నుంచి బయటకొచ్చా: యర్రా అఖిల
సాక్షి, వేటపాలెం (ఒంగోలు): ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న దేశాయిపేట పంచాయతీ ఐటీఐ కాలనీకి చెందిన యర్రా అఖిల క్షేమంగా బుధవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి బయటపడే క్రమంలో తనతోపాటు తోటి విద్యార్థులు ఎదుర్కొన్న కష్టాలను ‘సాక్షి’తో పంచుకుంది. ‘పశ్చిమ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా సిటీలోని విన్నిట్సియా ఫిరోగోవ్ మెడికల్ యూనివర్శిటీలో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతున్నా. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మేమంతా ఇండియాకి చేరుకుంటామో లేదోననే ఆందోళన మొదలైంది. అక్కడ ఉన్న రోజులు గుర్తు చేసుకుంటే భయమేస్తోంది. సైరన్ మోగగానే బంకర్లోకి పరుగెత్తి దాక్కునేవాళ్లం. స్నేహితులంతా కలిసి ప్రైవేట్ బస్ మాట్లాడుకుని ఉక్రెయిన్ బోర్డర్‌కి చేరుకున్నాం. అయితే ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు రొమేనియా బార్డర్‌కు పది కిలోమీటర్ల ముందే బస్‌లు నిలిపివేశారు. మాపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. అక్కడ నుంచి పది కిలోమీటర్లు లగేజీ మోసుకుంటూ రొమేనియా చేరుకున్నాం. రొమేనియాలో అధికారులు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అక్కడ నుంచి రొమేనేయా రాజధాని బుకారెస్ట్ ఎయిర్పోర్ట్ వరకు ప్రత్యేకంగా బస్ ఏర్పాటు చేశారు. ఇండియన్ ఎంబసీ అధికారులు సిద్ధంగా ఉంచిన విమానంలో నేరుగా ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విజయవాడ వరకు వచ్చాం. అక్కడ నుంచి ప్రభుత్వం వాహనంలో బుధవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నా. ఆ నరకం నుంచి ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నాన’ని అఖిల వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. వేటపాలెం : దేశాయిపేటలోని ఇంటికి ప్రభుత్వ వాహనంలో చేరుకున్న యర్రా అఖిల బుడాపెస్ట్‌కు వెళ్తున్నాం.. మద్దిపాడు: ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా యూనివర్సిటీలో వైద్య విద్యనభ్యసిస్తున్న లింగంగుంట గ్రామానికి చెందిన దేవరంపాటి అశోక్, పాటిబండ్ల యశ్వంత్ క్షేమంగా ఉన్నట్లు వారి తల్లిదండ్రులు తెలియజేశారు. ఉక్రెయిన్ సరిహద్దు వరకు ట్రైన్లో వెళ్లి, అక్కడ నుంచి బస్‌లో హంగరీ రాజధాని బుడాపెస్ట్‌కు చేరుకున్నారని వివరించారు. అశోక్ కుటుంబం లింగంగుంటలో ఉండగా, యశ్వంత్ తల్లిదండ్రులు ఒంగోలులో నివాసం ఉంటున్నారు. బుడాపెస్ట్ నుంచి బుధవారం రాత్రి విమానంలో బయలుదేరే అవకాశముందని, గురువారం సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు. కాగా అశోక్ కుటుంబ సభ్యులతో తహసీల్దార్ లక్ష్మీనారాయణ మాట్లాడి భరోసా కల్పించారు. రొమేనియా షెల్టర్‌లో ఉన్నా.. కురిచేడు: ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న పడమరవీరాయపాలెం విద్యార్థి నాగప్రవీణ్ తండ్రి కాశయ్య, కుటుంబ సభ్యులను తహసీల్దార్ నాగూర్‌మీరా, వీఆర్వో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి జగన్మోహనరెడ్డి బుధవారం పరామర్శించారు. నాగప్రవీణ్‌తో వీడియో కాల్లో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వివరించి ధైర్యం చెప్పారు. నాగప్రవీణ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను రొమేనియాకు చేరుకున్నా. ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఉంటున్నా. ఇక్కడ మొత్తం 70 మంది విద్యార్థులుండగా బుధవారం 30 మందిని భారత్‌కు తరలించారు. మిగిలిన వారిని వెంటనే తరలిస్తామని అధికారులు చెప్పార’ని తహసీల్దార్‌కు వివరించాడు. -
103 ఏళ్ల పురాతన చరిత్ర
వేటపాలెం(ప్రకాశం): 103 పురాతన చరిత్ర కల్గిన విజ్ఞాన భాండాగారంగా వేటపాలెం సారస్వత నికేతన్ గంథాలయం గుర్తింపు పొందింది. పాతతరంలో ఎందరినో విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ధిన ఘనత సారస్వత నికేతన్‌కు ఉంది. 103 ఏళ్ల కిందట స్థాపించబడిన గ్రంథాలయం రాష్ట్రంలోనే ఖ్యాతి గడించింది. గ్రంథాలయంలో ఉన్న గాంధీజీ చేతి కర్ర గ్రంథాలయం ఆవిర్భావం.. 1918 అక్టోబర్ 15న విజయదశమి నాడు గ్రామంలో అభ్యుదయ బావాలు కల యువకులు, ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు శేష్టి ప్రోత్సా హంతో కొందరు హిందూ యువజన సంఘం పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1923వ సంవత్సరంలో గ్రామం మధ్యలో పెంకుటింటిలో మార్చి అక్కడ కొనసాగించారు. 1924లో నూతన భవనం నిర్మించి గ్రంథాలయాన్ని మార్పు చేశారు. 1929 ఏప్రిల్ 18 తేదీన మహాత్మాగాంధీ గ్రంథాలయం నూతన భవనానికి శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్రను గ్రంథాలయంలో వదిలివెళ్లారు. నేటీకి అది భద్రంగా ఉంది. 1923లో పెంకుటింటిలో ఉన్న గ్రంథాలయం అమూల్యగ్రంథాలు.. రాష్ట్రంలో నెలకొల్పిన గ్రంథాలయాల్లో ఉత్తమ గ్రంథ సేకరణ, గ్రంథాల ను భద్రపరచడంలో సారస్వత నికేతనం ప్రథమస్థానంలో నిలిచింది. తెలుగులో ముద్రణ ప్రారంభమైన నాటి నుంచి వెలువడిన ఉత్తమ గ్రంథాలలో చాలావరకు తొలి, తుది పుటలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. దాదాపు లక్ష పుస్తకాలు ఇక్కడ ఉండగా అందులో 50 వేలు తెలుగు గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, 28 వేల ఇంగ్లీషు గ్రంథాలు, రెండు వేలు హిందీ గంథాలు, వెయ్యి ఉర్దూ తదితర గ్రంథాలు ఉన్నా యి. పత్రికల్ని భద్రపరచటంలో కూడా గ్రంథాలయానికి సమున్నత స్థానం ఉంది. 1942 నుంచి ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు సంపుటలుగా భద్రపరచడం జరిగింది. గ్రంథాలయంలోని విజిటర్స్ పుస్తకంలో మహాత్మాగాంధీజీ స్వహస్తాలతో రాసిన ఒపీనీయన్ పరిశోధనా కేంద్రం.. తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారికి సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. శాస్త్ర పరిశోధకులకు ముఖ్యంగా సాహిత్య పరిశోధకులకు బాగా తోడ్పడుతూ వస్తుంది. దేవ వ్యాప్తంగా ఉన్న వివి« ద విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు సారస్వత నికేతనానికి వచ్చి విష యసేకరణ చేస్తుంటారు. వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాల యాన్ని ఎందరో పండితులు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు తరచూ సందర్శించి వెళుతుంటారు. నేటికీ తగ్గని ఆదరణ.. ప్రసార మాధ్యమాలు, ఇంటర్ నెట్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఈనాటికీ గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. ప్రధా నంగా సివిల్స్ గ్రూప్ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు, గ్రంథాల యంలో గ్రంథ సేకరణ చేస్తుంటారు. పీహెచ్డీ చేసేవారు ఎక్కువగా ఇక్కడకు వచ్చి విలువైన పుస్తకాలను పరిశీలిస్తుంటారు. రాష్ట్రంలో వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్ మెంట్‌కి ఎంపికచేశారు. -
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్‌లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్‌తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
వేటపాలెం సొసైటీ అవకతవకలపై విచారణ
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఈ సొసైటీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆదివారం ఆయన స్పందించారు. ఏపీ సహకార సంఘాల చట్టం సెక్షన్ 51 ప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రకాశం జిల్లా సహకార శాఖాధికారి రాజశేఖర్, డీఎస్పీ శ్రీకాంత్, సీఐ రోశయ్య ఇప్పటికే వేటపాలెం సొసైటీలో విచారణ చేపట్టారన్నారు. బాధితుల ఫిర్యాదుతో కార్యదర్శితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేశారన్నారు. కాగా ఈ వ్యవహారంపై ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించామని, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
వేటపాలెం సొసైటీపై విచారణ చేపట్టాలి: కన్నబాబు
సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. ఈ సొసైటీలో అవకతవకలు జరిగాయంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై వాస్తవాలతో నివేదిక అందజేయాలన్నారు. డిపాజిట్‌దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సహకార శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో కలిసి పని చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. వేటపాలెం సొసైటీ కార్యదర్శి, సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ: నమ్మించి.. ముంచేసి!
సాక్షి, చీరాల/వేటపాలెం: వేటపాలెం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఒక్కో అక్రమం వెలుగులోకి వస్తోంది. సొసైటీని కొన్నేళ్లపాటు సజావుగానే నడిపారు. వడ్డీ తక్కువ అయినా కష్టపడిన సొమ్ము భద్రంగా ఉంటుందన్న ఆశతో చిరు వ్యాపారులు తమ డబ్బును అందులో దాచుకున్నారు. ఇళ్లలో పాచిపనులు చేసుకొనే నిరు పేదలు తాము సంపదించిన సొమ్మును ఆ సొసైటీలో ఉంచారు. దేవుడి సొమ్ముకు ఇక్కడైతేనే గ్యారంటీ ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని దేవస్థానం కమిటీలు కూడా డిపాజిట్ చేశాయి. మొదటిలో లావాదేవీలన్నీ సజావుగా సాగాయి. సొసైటీ కూడా లాభాల్లోకి వెళ్లింది. కొనేళ్లగా సొసైటీ మేనేజర్‌తో పాటు కమిటీ పెద్దలకు దుర్బుద్ధి పుట్టింది. ప్రజల డిపాజిట్లపై కన్నుపడింది. స్వాహా చేయాలని ప్లాన్ వేశారు. అందుకు మేనేజర్‌ను ఉసిగొల్పారు. అన్ని తానై నడిపిస్తున్న మేనేజర్ ఇందులో కీలకపాత్ర పోషించారు. సొమ్మును స్వాహా చేసి కమిటీ సభ్యులతో చేతులు కలిపి వాటాల రూపంలో పంచుకున్నట్లు సమాచారం. ఇలా చీరాల నియోజకవర్గం పరిధిలో వేటపాలెం, జాండ్రపేట, చీరాల, ఈపుపాలెం, పందిళ్లపల్లి, రామన్నపేట గ్రామాల పరిధిలో 1200 మంది ఖాతాదారులు రూ. 30 కోట్లు పైచిలుక కట్టి ఉన్నారు. ఇందులో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఇదీ..జరిగింది వేటపాలెంలో ప్రధాన బ్యాంకులు ఏర్పాటు కాక ముందు అంటే 1945 ఆక్టోబర్ 15న కొందరు ప్రైవేటు వ్యక్తులు ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. అప్పటిలో అర్బన్ బ్యాంకుగా నామకరణం చేశారు. తదుపరి వేటపాలెం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కంటే ఒక్క శాతం ఎక్కువ వడ్డీ ఇస్తామని ఖాతాదారులకు నమ్మకం కలిగించారు. తక్కువ సమయంలోనే నగదు వేయడం.. తీసుకోవడం సులభతరంగా ఉండటంతో పాటు ఒక్క శాతం వడ్డీ అధికంగా వస్తుందని ఎక్కువ మంది తమ నగదు రూ.లక్షల్లో డిపాజిట్లు చేశారు. సొసైటీ ఏర్పాటు చేసి 70 ఏళ్లు దాటడంతో పాలకవర్గంపై ఖాతాదారులకు నమ్మకం కలిగింది. ఎక్కువ మంది డిపాజిట్లు చేశారు. కార్యవర్గ సభ్యులు ప్రతినెలా సొసైటీ కార్యకలాపాలు, లావాదేవీలపై సమావేశాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం గడువు తీరిన డిపాజిట్‌దార్లకు సొసైటీ నెల రోజులుగా నగదు చెల్లించక పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. డిపాజిట్‌దారులు తమ నగదు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మేనేజర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు. బాధితులు వేటపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సొసైటీ పాలకవర్గ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో మేనేజర్ సొసైటీ మేనేజర్ ఆదివారం నుండి పరారీలో ఉన్నాడు. ఎస్ఐ కమలాకర్ కేసు నమోదు చేసుకొని మేనేజర్ కోసం ప్రత్యేక బృదంతో గాలిస్తున్నారు. మేనేజర్ దొరికితేగానీ రూ.30 కోట్లు నగదు ఎమైంది తెలియదు. పాలకవర్గ సభ్యుల ఆస్తులు విక్రయించి తమ నగదు తమకు ఇప్పిచాలని ఎస్పీ మలికా గర్గ్‌ను బాధితులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే కరణానికి వినతిపత్రం వేటపాలెం సొసైటీలో తాము దాచుకున్న డిపాజిట్లు గల్లంతు చేసి మేనేజర్ పారిపోయాడని బాధితులు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి దృష్టికి తీసుకెళ్లారు. తాము కష్టపడి కూలినాలీ చేసుకొని, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకొని దాచుకొన్న డబ్బులు స్వాహా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దాచుకున్న నగదు తమకు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ వేటపాలెం: వేటపాలెం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డిపాజిట్లు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ మలికా గర్గ్ భరోసా ఇచ్చారు. గురువారం వేటపాలెం పోలీసుస్టేషన్ సందర్శనకు వచ్చిన ఆమెను బాధితులు కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. వివిధ రకాల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించుకుంటున్న దాదాపు 1200 మంది రూ.30 కోట్లకుపై చిలుకు సొసైటీలో డిపాజిట్ల రూపంలో నగదు దాచుకున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో వివిధ దేవస్థానాలకు చెందిన రూ.30 లక్షలు డిపాజిట్లు సైంతం సొసైటీలో ఉన్నాయన్నారు. డిపాజిట్ల కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా కార్యదర్శి(మేనేజర్) పారిపోయాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సొసైటీలో దాచుకున్న నగదు తిరిగిరాని పక్షంలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకోనే పరిస్థితి ఉందని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ సొసైటీ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. పారిపోయిన మేనేజర్‌ను పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారని ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. ఆమెతో పాటు చీరాల డీఎస్పీ శ్రీకాంత్ ఉన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్.. 'ఫాం'లోకి వచ్చాడు
చికెన్ తిందామంటే భయం.. మటన్ రుచి చూద్దామంటే సంకోచం చేపలు ట్రై చేద్దామంటే అనుమానం టైగర్ రొయ్యలు.. పీతలు సరేసరి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్నవారు ఆలోచిస్తున్నారు.. అన్ని రకాల పెంపుడు జంతువులను స్టెరాయిడ్స్.. పలు రకాల రసాయనాలతో పెంచుతున్నారు... అందుకే ఇప్పడు అందరి చూపు ఆర్గానిక్ ఉత్పత్తలపై పడింది.. చివరకు నాటు కోళ్లు.. మేకలకే జై కొడుతున్నారు ఇలాంటి జీవులను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెంచి వాటి మాంసాన్నీ విక్రయిస్తున్నాడు.. సాక్షి, వేటపాలెం: ప్రతి ఒక్కరికీ వృత్తితో పాటు ప్రవృత్తీ ఉంటుంది. అలాగే వేటపాలెంకు చెందిన షేక్ గఫార్ బాషా ఉన్నత చదువులు చదివి.. పదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇతనికి జన్మభూమిపై మమకారం పోలేదు.. పైగా వ్యవయసాయం అంటే మక్కువ. అందుకే తన సంపాదనతో పొలం కొన్నాడు. అయితే ఆయన ప్లాన్ మారింది.. సాగు కాకుండా దానికి అనుబంధ పరిశ్రమలైన నాటుకోళ్లు, కౌజు పిట్టలు, మేకపోతుల కోసం పౌల్ట్రీ స్థాపించి సొంతూరిలోనే పలువురికి ఉపాధి కల్పిస్తూ లాభాలు అందుకుంటున్నాడు. మాంసాహారం అంతా విషమయం అవుతు న్న నేపథ్యంలో సహజంగా జీవులను పెంచుతూ ఆర్గానిక్ మాంసాన్ని అమ్ముతున్న అతన్ని అంతా అభినందిస్తున్నారు. చదవండి: (కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం) మేకపోతులు బాషా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంకామ్, ఎంబీఏ పూర్తి చేశాడు. కష్టపడి ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. కఠారివారిపాలెం గ్రామ శివారులో కొంత భూమి కోనుగోలు చేశాడు. అయితే ముందుగా తనకిష్టమైన వ్యవసాయం చేయాలనుకున్నాడు. దీనిపై పెద్దల సలహాలు తీసుకుని.. నేటి పరిస్థితుల మధ్య వ్యవసాయ చేయడం అంత మంచిది కాదని నిర్ధారించుకున్నాడు. అందుకే ముందుగా నాటు కోళ్ల పెంపకంపై దృష్టి సారించాడు. బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని సొంత భూమిలో రేకుల షెడ్లు నిర్మించాడు. నాటు కోళ్ల ఫాంను బాషా ఏర్పాటు చేసి మూడేళ్లయింది. అయితే నాటు కోళ్ల పెంపకంతో సరైన ఆదాయం రాకపోవడంతో వెంటనే కౌజు పిట్టలు, పొట్టేళ్లను కూడా పెంచడం ప్రారంభించాడు. ఇలా లాభాలు పట్టి తోటి యువకులకు ఆదర్శగా నిలబడ్డాడు. చదవండి: (ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..) ఫాంలో ఉన్న కౌజు పిట్టలు అధునిక పద్ధతుల్లో మార్కెటింగ్ కేవలం జీవాలను అమ్మడమే కాకుండా.. తన ఫాం నుంచి నాటుకోళ్ల మాంసం, నాటు కోడి గుడ్లు, కౌజు పిట్టల మాంసం, పోటేళ్ల మాంసం విక్రయిస్తున్నాడు. సోషల్ మీడియాను బాగా వినియోగించుకుంటున్నాడు. యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా లోకల్ మార్కెట్ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించుకుంటున్నాడు. నాటు కోడి (లైవ్) కేజీ రూ.250, నాటు కోడి గుడ్డు ఒకటి రూ.10, కౌజు పిట్ట ఒకటి రూ.50, మేకపోతు మాంసం కిలో రూ.550 చొప్పున విక్రయిస్తున్నాడు. చిన్నతనం కోరిక నెరవేర్చుకొన్నా నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనే కోరిక ఉంది. అయితే చదువుకున్న తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రతి వారం ఇక్కడకు వచ్చి ఫాం పరిస్థితులు చూసుకొనేవాడిని.. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఇంటి నుంచే ఉద్యోగం చేసే అవకాశం రావడంతో ఫాం పనులు బాగా చూసుకుంటున్నా. మూడేళ్లుగా ఈ పరిశ్రమ నిర్వహిస్తున్నప్పటికీ పశుసంర్థక శాఖ అధికారులు ఎటువంటి సహకారం అందిచడం లేదు. కోళ్లకు ఏవైనా తెగుళ్లు వస్తే గూగుల్లోనే వెతికి మందులు వాడుతున్నాం. కొంతమంది మెడికల్ షాపుల వారి సలహాలు కూడా తీసుకుంటున్నా. – షేక్ బాషా -
సమస్త ‘ప్రకృతి’కి ప్రణామం!
అతనో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. ఉన్నత చదువులు చదివి హార్డ్‌వేర్ కంపెనీ నడుపుతూ ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితుడై చివరికి తన కంపెనీని వదులుకున్నాడు. తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాగిస్తూ ఆదర్శ రైతుగా అధికారుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నాడు. అతని పేరు చెరుకూరి రాంబాబు. సాక్షి, వేటపాలెం (ప్రకాశం): మండలంలోని పందిళ్లపల్లికి చెందిన చెరుకూరి బసవయ్యది వ్యవసాయ కుటుంబం. తాను కష్టపడుతూ కుమారుడైన రాంబాబును బీఎస్సీ కంప్యూటర్ చదివించాడు. తండ్రి ఆశించినట్లు రాంబాబు విద్యాభ్యాసం అనంతరం 2002లో చీరాల్లో మైక్రో కంప్యూటర్స్ పేరుతో హార్డ్‌వేర్ కంపెనీ స్థాపించి మంచి పేరు సంపాదించాడు. కానీ అతనిలో ఏదో తెలియని కొరత ఉన్నట్లు గ్రహించాడు. వ్యవసాయంలోనే నూతన ఒరవడి సృష్టించాలనుకున్నాడు. అలా ఆలోచిస్తున్న తరుణంలో సుభాష్ పాలేకర్ చేపట్టిన ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని సృజనాత్మకతతో మెళకువలు త్వరగా ఆకలింపు చేసుకుని తనకున్న నాలుగు ఎకరాల్లో వరిసాగు ప్రారంభించాడు. మొదటి సంవత్సరం ఎకరానికి 15 నుంచి 17 బస్తాల దిగుబడి వచ్చింది. తక్కువ దిగుబడి వచ్చిందని కుంగిపోకుండా నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. ఎలా చేస్తారు.. ముందుగా విత్తనశుద్ధి చేసుకొని నారుమడి వేసి 25 నుంచి 30 రోజుల వ్యవధిలో నారు పీకి పొలంలో నాట్లు వేస్తారు. ప్రతి పది రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో కలిపి పైరుకు అందించడం జరుగుతుంది. 15 రోజులకు ఒక పర్యాయం జీవామృతం పైరుపై పిచికారీ చేస్తారు. పురుగు ఆశించినప్పుడు అజ్ఞాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ని కషాయాలు ముందుగానే తయారుచేసి ఉంచుకుని అవసరమైనప్పుడు పిచికారీ చేస్తారు. ఇలా నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం వలన ఈ సంవత్సరం 36 బస్తాలు ఎకరానికి పండించగలిగాడు. ఈవిధంగా పండించిన ధాన్యంను బియ్యంగా మలచి 50 కేజీల బస్తా బియ్యం రూ. 2500కు అమ్ముతున్నాడు. అదే క్రిమిసంహారక మందులు వాడిన ధాన్యం రూ.1300 అమ్ముతున్నారు. మార్కెట్లో 25 కేజీల సాధారణ బియ్యం రూ.1250 గా ఉంది. అదే ధరకు ఈ ప్రకృతి వ్యవసాయం బియ్యంను కూడా అమ్ముతున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఆహారం ప్రజలకు అందుతుంది. ప్రకృతి వ్యవసాయం వలన ఎకరానికి రూ. 5వేల నుంచి రూ. 7వేలు వరకు పెట్టుబడి మిగులుతుంది. ఇలా 25 బస్తాలు పండించినా, రసాయనిక పద్ధతిలో 35 బస్తాలు పండించినా ముందు విధానంలోనే అధిక లాభం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయమే లాభసాటి.. ఉదాహరణకు ఎకరానికి ప్రకృతి వ్యవసాయం ద్వారా 25 బస్తాలు పండిస్తే బస్తాకు రూ.2500 చొప్పున రూ.62,500 వస్తాయి. పురుగు మందులు ఖర్చు లేదు. అదే రసాయనిక పద్ధతిలో 35 బస్తాలకు రూ.1300 చొప్పున రూ.45,500 వస్తాయి. యూరియా, పురుగు మందులకు రూ.7000 ఖర్చవుతుంది. మిగిలేది రూ. 38,500 మాత్రమే. అదే కౌలు చేసే రైతులకు కౌలు రూ. 20 వేలు పోను 35 బస్తాలు పండించగలిగితే సుమారు రూ. 15 వేల నుంచి రూ 20 వేల వరకు మాత్రమే మిగులుతాయి. ఈ లెక్కల ప్రకారం ప్రకృతి వ్యవసాయంలో అధిక లాభం ఉంటుంది. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం వలన అధిక లాభాలే కాకుండా అందరికీ ఆరోగ్యం అందేలా చేయవచ్చు. రైతే దేశానికి వెన్నుముక అనే నానుడికి సరైన అర్థం రావాలంటే ప్రతి రైతూ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి. మనం పండించిన ఆహారం మన ప్రాంతాల వారే తినడం వలన ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. రూపాయి విలువ పెరుగుతుంది. రాబోయే తరానికి బలమైన, దృఢమైన పౌరులను దేశానికి అందించినవాళ్లమవుతాము. పెట్టుబడి లేకుండా అధిక లాభాలు పొందుతున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా సహజంగా లభించే ఆకుల ద్వారా కషాయాలు తయారు చేసి అధిక లాభాలు పొందుతున్నాను. ముందు ప్రయత్నంలో కొద్దిపాటి దిగుబడి వచ్చినప్పటికీ ఇప్పుడు దిగుబడి బాగా పెరిగింది. అందరూ ఈ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ఆశిస్తున్నా. గతేడాది ప్రభుత్వ ఎన్‌పీఎం షాపు ఏర్పాటుకు సహాయం చేశారు. దీని ద్వారా అన్ని రకాల కషాయాలను తయారుచేసి గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు కాషాయాలు అందిస్తున్నాను. రెండేళ్ల క్రితం ఉత్తమ ఆదర్శ రైతుగా ప్రభుత్వం అవార్డు అందుకోవడం జరిగింది. ఎవరైనా ఈ వ్యవసాయ పద్ధతులు ఆచరించేందుకు ముందుకు వస్తే నేర్పేందుకు సిద్ధంగా ఉన్నా. గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయ శాఖలో ఐసీఆర్పీగా నియమించి, సేవలు అందజేస్తున్నా. వ్యవసాయంలో సలహాలు కావాలన్నా.. బియ్యంతో పాటు ఇతర సేంద్రియ ఉత్పత్తులు కావాలనుకున్నా 9966889697 నంబర్‌ను సంప్రదించవచ్చు. - రైతు రాంబాబు -
సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
వేటపాలెం: కార్తీక మాసం ముగిసినందున పోలి పాడ్యమి రోజున సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు మృతిచెందారు. ఈ విషాద సంఘటన ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం రామాపురంలో జరిగింది. గుంటూరుజిల్లాకు చెందిన యోగి(32), జ్యోతి(20), మౌలాలి(25), మరో వ్యక్తి ఆదివారం సముద్ర స్నానానం కోసం రామాపురం తీరానికి వచ్చారు. స్నానం కోసం సముద్రంలోకి వెళ్లగా యోగి, జ్యోతి మృతిచెందారు. మౌలాలి గల్లంతయ్యాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వేటపాలెం వెతలు
-
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య.
-
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వీరు వేటపాలెం రైల్వే స్టేషన్లో రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. . చీరాలలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వీరు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. మృతులను ఇంకొల్లు మండలం తిమ్మసముద్రానికి చెందిన బత్తుల సాయిసందీప్ (24), గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన భోగిరెడ్డి మోనిక (23)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరూ మంగళవారం విజయవాడ వెళ్లి పెళ్లి చేసుకుని చీరాల వచ్చి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కాగా చదువుతో పాటు ఎప్పుడు చలాకీగా ఉండే సాయి సందీప్, మోనిక ఆత్మహత్య చేసుకోవటంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేటపాలెం టు హైదరాబాద్!
వేటపాలెంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు వ్యభిచారిణులు, నిర్వాహకులు, బ్రోకర్ల అరెస్టు నిందితుల్లో ఒకరు పాలమూరు వాసి చీరాల రూరల్: వేటపాలెంలో సెక్స్ రాకెట్ గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేశారు. మహిళల పేదరికాన్ని ఆసరా చేసుకుని వారికి డబ్బులు ఎరగావేసి వ్యభిచార కూపంలోకి దింపే ముఠాను కటకటాల వెనక్కి నెట్టారు. వేటపాలెం, హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిర్వాహకులతో పాటు ముగ్గురు బ్రోకర్లు, వ్యభిచారానికి పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. చీరాల కొత్తపేటలోని టూటౌన్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ డాక్టర్ ఎం.ప్రేమ్‌కాజల్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు Ðð ల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. వేటపాలెం రావూరిపేటలోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పక్క వ్యూహం ప్రకారం పోలీసులు ఆ కేంద్రంపై దాడి చేసి దేశాయిపేటకు చెందిన కట్టా తిరుపతమ్మ, చీరాల మండలం వాడరేవుకు చెందిన చౌడిపిల్లి సుజాత, హైదరాబాద్ ఎస్సార్ నగర్లో నివాముంటున్న కంచెం మాధవరెడ్డి, బంజారాహిల్స్‌కు చెందిన చింతల లక్ష్మీనారాయణ, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం బురుగుంటకు చెందిన కారు డ్రైవర్ బేగారి శ్రీనివాస్, బ్రోకర్లు వేటపాలెం మండలం నాయనిపల్లెకి చెందిన గుత్తి సాంబశివరావు, అదే మండలం దేశాయిపేటకు చెందిన గుత్తి సాంబశివరావు (ఇద్దరిదీ ఒకే పేరు), తెలగతోటి అశోక్‌తో పాటు వ్యభిచారానికి పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 20 సెల్ఫోన్లు, రూ.4 వేల నగదు, ఒక బొలేరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాభిచారిణులను ఒంగోలు రిస్క్వూ హోమ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇక్కడి నుంచి అక్కడికి.. వేటపాలేనికి చెందిన కట్టా తిరుపతమ్మ, వాడరేవుకు చెందిన చౌడిపిల్లి సుజాతలు స్థానికంగా నివాసముంటూ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తుంటారు. మహిళల అవసరాలను ఆసరా చేసుకుని వారిని చేరదీసి వ్యభిచార రొంపిలోకి దించుతారు. వీరిద్దరికి హైదరాబాద్‌కు చెందిన వ్యాభిచార కేంద్రం నిర్వాహకులు మాధవరెడ్డి, లక్ష్మీనారాయణతో సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వ్యభిచారం చేసేందుకు వేటపాలెం నుంచి మహిళలను తరలిస్తుంటారు. మహిళలను తరలించేందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బేగారి శ్రీనివాస్‌ను వాహన డ్రైవర్‌గా ఉపయోగిస్తారు. మహిళలను వ్యభిచార గృహానికి తీసుకొచ్చేందుకు వేటపాలే నికి చెందిన గుత్తి సాంబశివరావు, తెలగతోటి అశోక్, గుత్తి సాంబశివరావులను వినియోగిస్తుంటారు. -
బాలిక అనుమానాస్పద మృతి
వేటపాలెం: ఓ బాలిక పురుగుమందు తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక బీబీహెచ్ జూనియర్ కళాశాల ఎదుట బుధవారం జరిగింది. వివరాలు.. పేరాలకు చెందిన పోగుల బ్రహ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు. 9 ఏళ్ల కిందట భార్య చనిపోయింది. బ్రహ్మయ్య ఇల్లు వదిలి ఎటో వె ళ్లిపోయాడు. ఇద్దరు కుమార్తెలను వేటపాలెం నాయినపల్లికి చెందిన మేనమామ చుండూరి శ్రీనివాసరావు తీసుకెళ్లి పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట మద్దులూరి సీతామహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు బాలిక పద్మినిని తమ ఇంటికి తీసుకెళ్లారు. బాలికతో వారు ఇంటి పనులు చేయించుకుంటున్నారు. దుస్తులు సరిగా సర్దలేదని ఇంటి యజమాని బాలికను మందలించింది. మనస్తాపం చెంది ఇంట్లో పూల మొక్కలకు ఉపయోగించే పురుగుమందు తాగింది. ఇంటి యజమాని స్థానిక వైద్యుల వద్ద బాలికకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందింనట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఇంటి యజమాని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎండీ షరీఫ్ సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆ తంతును ఆపించారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, రూరల్ సీఐ ఎండీకే ఆల్తాఫ్‌హుసేన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించారు. మృత దేహన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుమార్తెను కొట్టి చంపిన తండ్రి
ప్రకాశం జిల్లాలో పరువు హత్య ఓ యువకుడిని ప్రేమించడమే ఆమె చేసిన నేరం చీరాల రూరల్: ఓ తండ్రి.. 18 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తెను బంధువుల సాయంతో హతమార్చాడు. ఆమె చేసిన నేరం.. ఓ యువకుడిని ప్రేమించడమే. పరువు పోయిందని భావించి కన్నపేగును ఆ తండ్రి నిలువునా చీల్చాడు. ఈ పాపంలో బాలిక మేనత్త, ఆమె భర్త, వారి ఇద్దరు కుమారులు భాగస్వాములయ్యారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన కటకం దుర్గాభవానీ(18) గత నెల 27న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దుర్గాభవానీ సోదరుడు గోపి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఆమె తన తండ్రి, బంధువుల చేతిలో హత్యకు గురైనట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేశారు. దుర్గాభవానీ చీరాలలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈమెకు నెల్లూరు జిల్లాకు చెందిన పోలయ్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో నెల క్రితం అతడి వెంట వెళ్లిపోయింది. దుర్గాభవానీ మైనర్ కావడంతో పోలయ్య ఆమెను నెల్లూరు పోలీసుల సాయంతో వెంకటగిరిలోని రెస్క్యూ హోమ్‌లో చేర్పించాడు. విషయం తెలిసిన తండ్రి రెస్క్యూ హోమ్‌కు వెళ్లి ఇంటర్ పరీక్షలు రాయిస్తానని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. బంధువుల సాయంతో ఇనుప రాడ్డుతో కొట్టి చంపి, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. -
వేటపాలెంలో ఏం జరిగింది?
అమ్మా నాన్నా అనే పిలుపుకు దూరమై, మంచీ చెడుల తేడా తెలియని కొంత మంది పిల్లలు క్రిమినల్స్‌గా మారుతున్నారు. అలాంటి వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనే కథాంశంతో తెరకెక్కిన చిత్ర ం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్యా, శిల్ప నాయకా నాయికలుగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తంగిరాల అపర్ణ. -
కరుగుతున్న కరకట్ట
వేటపాలెం: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల ఆధునికీకరణ పనుల్లో అవినీతి తాండవిస్తోంది. జిల్లా పరిధిలోని రొంపేరు రైట్టరం, లెఫ్ట్టరంతో పాటు అనేక డ్రైనేజీలు (వ్యవసాయ మురుగు కాలువలు) ఆధునికీకరించాలని ప్రభుత్వం 2006లో తలపెట్టింది. అందులో భాగంగా వేటపాలెం పరిధిలోని ముసలమ్మ మురుగునీటి కాలువను ఆధునికీకరించారు. అయితే ఈ కాలువపై వేటపాలెం- సంతరావూరు మధ్య గతంలో ఉన్న నేలచప్టాపై రూ.1.10 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ఐదు నెలల కిందట పనులు చేపట్టారు. రోడ్డు మధ్యలో ఉన్న నేలచప్టాను తొలగించి రాకపోకలకు పక్కనే తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం కోసం పక్కనే ఉన్న ముసలమ్మ మురుగునీటి కాలువ కరకట్ట మట్టిని పొక్లెయిన్ సహాయంతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాంట్రాక్టు నిబంధనల మేరకు బ్రిడ్జి నిర్మాణం కోసం బయట ప్రాంతం నుంచి మట్టిని కొనుగోలు చేసి వినియోగించాలి. అయితే బయటి ప్రాంతం నుంచి మట్టిని తరలిస్తే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని..సదరు కాంట్రాక్టరు కాలువ కరకట్టను ధ్వంసం చేసి మట్టిని తరలిస్తున్నారు. అధికారుల అండదండలతోనే మురుగునీటి కాలువల కరకట్ట మట్టి అక్రమంగా తరలిపోతోందని రైతులు ఆరోపిస్తున్నారు. తరచూ ముంపునకు గురవుతున్న పొలాలు: ముసలమ్మ మురుగునీటి కాలువపై ఐదు నెలలుగా నత్తనడకన సాగుతున్న బ్రిడ్జి నిర్మాణంతో ఆప్రాంతంలోని పొలాలు తరచూ ముంపునకు గురవుతున్నాయి. నేల చప్టా తొలగించిన ప్రాంతం పక్కనే కాలువలో నీటి పారుదలకు తాత్కాలికంగా తూములు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలు కురిసిన సమయంలో వచ్చిన వరదలకు పొలాలు మునిగిపోతున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పొలాలు ముంపు బారిన పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కరకట్టల మట్టిని తరలించిన వారిపై చర్యలు: మురుగునీటి కాలవ కరకట్ట మట్టిని అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకొంటామని డీఈ సుబ్బారావు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి కరకట్ట మట్టిని వినియోగిస్తే నిధులు రికవరీ చేస్తామన్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయిస్తామని చెప్పారు. -
స్కూల్ బస్సు బోల్తా.. ముగ్గురికి గాయాలు
వేటపాలెం : ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు శిథిలావస్థకు చేరిన బస్సులు తిప్పుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అనుభవం లేని డ్రైవర్లు తక్కువ జీతాలకు వస్తుండంతో వారిని స్కూల్ బస్సులకు డ్రైవర్లుగా నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వేటపాలెం పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూలు బస్సు శనివారం బొచ్చులవారిపాలెం -ఊటుకూరి సుబ్బయ్యపాలెం గ్రామాల మధ్య అదుపుతప్పి బోల్తా కొట్టగా ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. స్కూల్ యాజమాన్యం గాయాలైన చిన్నారులకు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయించారు. బోల్తాకొట్టిన బస్సును వెంటనే రోడ్డుపైకి చేర్చి ఏమీ జరగనట్లు సర్దుబాటు చేశారు. ఆ తర్వాత వెంటనే పాఠశాలకు సెలవు ఇచ్చి చిన్నారులను ఇళ్లకు పంపించారు. -
నీట మునిగి నలుగురు చిన్నారుల మృతి
వేటపాలెం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలోని రామాపురంలో విషాదం చోటుచేసుకుంది. వాగులో పడి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈతకు వెళ్లి నీటిలో ముగినిపోయి చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు వావెల సుజాత(9), రాముడు(10), అంజమ్మ(7), ఆంజనేయులు(9)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. చిన్నారులు మృతిని తట్టుకోలేక వాళ్ల అమ్మమ్మ నాగమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో రామాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
హవ్వా.. ఇదే మి చోద్యం!
వేటపాలెం : సామాజిక ఆర్థిక కులగణన ముసాయిదా జాబితా తప్పులు తడకగా ఉంది. ఇంటింటికీ తిరిగి సర్వే చేయాల్సిన ఎన్యుమరేటర్స్ ఒక చోట కూర్చొని ఇష్టం వచ్చింది రాసుకుని చేతులు దులుపుకున్నారు. ఫలితంగా సర్వేలో అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2011-12 సంవత్సరంలో గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల గణన చేశారు. దాని తాలూకా ముసాయిదా జాబితాను ప్రజల పరిశీలనకు ఈ నెల ఒకటో తేదీన మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ఉంచారు. జాబితాల్లో పొందు పరిచిన కుటుంబ వివరాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ముసాయిదా జాబితాలో తప్పులు సరి చేసేందుకు 30 రోజుల గడువు విధించారు. సర్వే జాబితాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెల సరి వేతనం రూ.5 వేలలోపేనని నమోదు చేసి పలువురిని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఇంటికి రెండు గదులే ఉన్నట్లు రికార్డు చేశారు. ఉద్యోగులను వ్యసాయ కూలీలుగా నమోదు చేశారు. దాదాపు ఊరంతా వ్యవసాయ కులీలుగా జాబితాల్లో రూపొందించారు. ఉద్యోగులు ప్రాథమిక విద్య మాత్రమే చదివినట్లు ఎన్యుమరేటర్లు తమ సర్వేలో పొందుపరిచి తమ నిర్లక్ష్యాన్ని బహిరంగ పరిచారు. మండలంలోని రామచంద్రాపురంలో మహిళలంతా వితంతువులుగా నమోదు చేశారు. వేటపాలెం 7,8,9 వార్డుల్లోని కుటుంబాల నెలసరి ఆదాయం రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపుగా నమోదు చేశారు. దాదాపు 40 ఎకరాల రైతులకు అసలు సాగుభూమీలేదన్నారు. రూ. లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తువారు వ్యవసాయ కులీలుగా మారారు. కోటి రూపాయల విలువైన ఇళ్లు ఉన్న వారికి కేవలం రెండు గదుల ఇళ్లు ఉన్నట్లు చూపారు. ఆధారాలు ఇవిగో.. వేటపాలెం 8వ వార్డుకు చెందిన పి.మోహన్‌రావు టెలిఫోన్‌శాఖలో లైన్మెన్గా పనిచేస్తుంటాడు. సర్వే జాబితాల్లో ఆయనకు రెండు గదుల ఇల్లు, నెలకు రూ.5 నుంచిరూ.10 వేలలోపు ఆదాయమని, వ్యవసాయ పనులు చేస్తున్నట్లు నమోదు చేశారు. వేటపాలేనికి చెందిన టి.కోటేశ్వరరావు పోస్టుమాస్టర్. ఇతనికి నెల సరి ఆదాయం రూ.5 వేలులోపుగా జాబితాలో నమోదు చేశారు. ఈయనా వ్యవసాయ కులేనట, రెండు గదుల ఇంట్లో ఉంటున్నట్లు చూపారు. డీవీఆర్ నాగరాజు ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుడు. ఈయనకు రెండు గదుల ఇల్లు ఉన్నట్లు రాశారు. వ్యవసాయ కూలి పనులతో జీవనం గడుపుతున్నట్లు నమోదు చేశారు. ఈయన ఆదాయం కూడా రూ.5 వేల లోపేనట. రిఫ్రిజరేటర్ లేదని, సెల్‌ఫోన్ వాడరని చెప్పారు. పుల్లరిపాలెం పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో మహిళలంతా వితంతువులుగా నమోదు చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సర్వే రికార్డులో 80 శాతం తప్పుల తడకలుగా నమోదు చేశారు. ఈ వివరాలతో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి రీసర్వే నిర్వహించి వాస్తవ వివరాలు తెలియజేయాల్సి ఉందని పలువురు పేర్కొన్నారు. -
జీడిపప్పు పరిశ్రమలో యాంత్రీకరణ
వేటపాలెం,న్యూస్‌లైన్ : జీడిపప్పు పరిశ్రమల్లో కూలీల కొరతను అధిగమించేందుకు వ్యాపారులు యంత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. జీడిపప్పు పరిశ్రమకు రాష్ట్రంలోనే పేరుగాంచిన ప్రదేశం వేటపాలెం. అయితే ఈ పరిశ్రమను ప్రస్తుతం కూలీల కొరత పట్టిపీడిస్తోంది. జీడిపప్పు పరిశ్రమలో పనిచేయడానికి వేటపాలెం చుట్టు పక్కల గ్రామాల మహిళలు వచ్చి వెళ్తుంటారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో చాలా మంది కూలీలు జీడిపప్పు పరిశ్రమల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో జీడిపప్పు వ్యాపారులు యంత్రాలను ఉపయోగించడం ప్రారంభించారు. వేటపాలెంలో దాదాపు 20 జీడిపప్పు పరిశ్రమలున్నాయి. వీటిలో ఐదు వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. వేటపాలెం ప్రాంతంలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యాపారులు తమ పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టారు. మిగిలిన వ్యాపారులు కూడా యంత్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జీడిపప్పు పరిశ్రమలో యంత్రాలు పనిచేసేది ఇలా.. జీడిపప్పు ఫ్యాక్టరీల్లో జీడి గింజలను కాల్చిన తర్వాత కార్మికులతో జీడిపప్పును వేరుచేయిస్తారు. అనంతరం జీడిపప్పు పైన ఉండే పలుచటి పొరను తొలగింపజేస్తారు. అలా వచ్చిన జీడిపప్పు నాణ్యతను బట్టి గ్రేడ్లుగా విభజించి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇదంతా పాత విధానం. ప్రస్తుతం కూలీల స్థానంలో యంత్రాలొచ్చాయి. కాలుష్యం పెరుగుతోందనే కారణంతో జీడి గింజలు కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కొత్త పరిశ్రమలకు లెసైన్సులు కూడా నిలిపేసింది. దీంతో వ్యాపారులు యంత్రాలు ఉపయోగించి బాయిల్డ్ పద్ధతి ద్వారా జీడి గింజల నుంచి పప్పును వేరు చేయడం ప్రారంభించారు. పరిశ్రమలో జీడి గింజలను ఉడక బెట్టిన తర్వాత వాటిని కత్తిరించి పప్పును వేరు చేసి యంత్రాల వద్దకు చేరుస్తారు. అక్కడ ఉన్న హాట్ బాక్సుల్లో పప్పును వేడి చేసి యంత్రాల్లో వేస్తారు. పప్పు పైన ఉన్న పల్చటి పొరను యంత్రాలు తొలగించడమే కాకుండా నాణ్యతను బట్టి గ్రేడ్లుగా విభజిస్తాయి. ‘యంత్రాల ద్వారా త్వరగా పనిజరుగుతోంది. ఒక్కో కూలీ రోజుకు పది కిలోల జీడిపప్పు గ్రేడింగ్ చేస్తారు. అదే యంత్రంతో అయితే గంట వ్యవధిలో 50 కిలోల జీడిపప్పు గ్రేడ్ చేస్తున్నాం. వంద మంది కూలీలు చేసే పని కేవలం ఒక యంత్రంతో పూర్తవుతోంది. కూలీల కొరత తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంద’ని వ్యాపారులు పేర్కొంటున్నారు. -
‘ఉపాధి’ నిధులు బొక్కేశారు
వేటపాలెం, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పనుల్లో ఉద్యోగుల అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. సోషల్ ఆడిట్లో అక్రమాలు బయటపడుతున్నాయి. వేటపాలెం మండలంలో జరిగిన ఉపాధి పనులపై మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సామాజిక తనిఖీ సభలో రూ. 16 లక్షల అవినీతి వెలుగులోకి వచ్చింది. మండలంలో 2012-13 సంవత్సరానికి సంబంధించిన పనులపై సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ నిర్వహించాయి. గత ఏడాది మండల పరిధిలో 250 పంట కాలువల పూడికతీత పనులు, 850 ఐఎస్ఎల్ఎస్ పనులు రూ. 90 లక్షలతో చేపట్టారు. వీటిపై నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేలింది. అత్యధికంగా అక్కాయిపాలెం పంచాయతీ పరిధిలో 45 పనులకు రూ. 22.83 లక్షలు ఖర్చుచేశారు. అందులో రికార్డుల్లో కూలీల పేర్లపై సిబ్బంది వేలిముద్రలు వేసి రూ. 12,79,855 అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వాస్తవంగా కూలీలు మూడు, నాలుగు వారాలు పనిచేయగా సిబ్బంది 17 వారాలు పనిచేసినట్లు రికార్డుల్లో వేలిముద్రలు వేసి సొమ్ము కాజేశారు. కూలీలను విచారించగా తాము కేవలం నాలుగు వారాలు మాత్రమే పనిచేశామని తెలిపారు. 363 పింఛన్లు ఉండగా వీటిల్లో పింఛన్లు పంచకుండా సీఎస్పీ రూ. 63 వేలు డ్రాచేసుకుంది. గ్రామంలో 90 శాతం మంది కూలీల వద్ద జాబ్‌కార్డులు లేవు. తనిఖీ నివేదికలు సభలో చదివి వినిపించారు. దీనిపై ఫీల్డు అసిస్టెంట్ శివకృష్ణను అధికారులు వివరణ కోరగా టెక్నికల్ అసిస్టెంట్ రవి దొంగ రికార్డులు తయారు చేయమంటే చేశానని తప్పును అంగీకరించాడు. సభకు హాజరైన సర్పంచ్ జంగిలి కోటేశ్వరరావు, గ్రామపెద్దలు మాట్లాడుతూ ఫీల్డు అసిస్టెంట్ అవినీతికి పాల్పడి గ్రామదేవాలయానికి చందా ఇస్తానని నిర్భయంగా గ్రామస్తులకు ఆశచూపాడని అధికారుల దృష్టికి తెచ్చారు. అక్కాయిపాలెం నుంచి గ్రామస్తులు, సర్పంచ్ ట్రాక్టర్లో తరలి వచ్చి అవినీతిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాపాయిపాలెం పంచాయతీ పరిధిలో జరిగిన తనిఖీ నివేదికలు చదివారు. రూ. 18 లక్షల విలువైన వివిధ పనులు చేయగా కూలీల పేర్లతో రికార్డులు సృష్టించి అక్రమంగా లక్ష రూపాయల అవినీతికి పాల్పడినట్లు తేలింది. గ్రామంలో పోలేరమ్మ దేవాలయం నుంచి సిమెంటు రోడ్డు వరకు పంట కాలువ పూడికతీత పనులు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే గ్రామస్తులు మాజీ సర్పంచ్ పులివెంకటేశ్వర్లు, మరికొంత మంది గ్రామపెద్దలు మాట్లాడుతూ కాలువ పనులు చేయకుండానే చేసినట్లు కూలీల రికార్డుల్లో చూపారని అధికారులకు తెలిపారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని తెలిపినందుకు ఫీల్డు అసిస్టెంట్ పులి నాగరాజు కూలీలు, గ్రామస్తులపై దాడిచేశాడని ఫిర్యాదు చేశారు. ఫీల్డు అసిస్టెంట్ నాగరాజు పోలీస్ స్టేషన్లో తమపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులను గ్రామానికి పంపి గ్రామసభకు రాకుండా అడ్డగించారని ఆరోపించారు. పాపాయిపాలెం నుంచి దాదాపు మూడు ట్రాక్టర్లలో కూలీలు, మహిళలు సభకు తరలి వచ్చారు. దేశాయిపేట పంచాయతీలో 32 పనులకు రూ. 8.58 లక్షలు ఖర్చు చేశారు. పంట కాలువల పూడికతీత పనుల్లో కూలీలపేర్లతో వేలిముద్రలు వేసి రూ. 2.50 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. మిగిలిన ఆరు పంచాయతీల్లో వేటపాలెంలో రూ. 4 వేలు, పుల్లరిపాలెంలో రూ. 3 వేలు, చల్లారెడ్డిపాలెంలో రూ. 30 వేలు, రామన్నపేటలో రూ. 30 వేలు అవినీతి జరిగినట్లు సోషల్ ఆడిట్లో బయటపడింది. ఇవి కాక సామాజిక వన సంరక్షణ పథకంలో పాపాయిపాలెం, అక్కాయిపాలెం, చల్లారెడ్డిపాలెం, వేటపాలెం గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి దాదాపు రూ. 5 లక్షలు ఖర్చుచేసినట్లు ఉంది. అయితే ఆశాఖ అధికారులు రికార్డులు ఇవ్వకపోవడంతో వాటి లెక్క తేలలేదు. మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ.. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో కూడా అవినీతి బయటపడింది. నిర్మాణాలు చేపట్టకుండా చేసినట్లు చూపి నగదు డ్రాచేసినట్లు రికార్డుల్లో బయటపడింది. దీంతో అవినీతికి పాల్పడిన అక్కాయిపాలెం ఫీల్డు అసిస్టెంట్ శివకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ జీ రవిని సస్పెండ్ చేస్తున్నట్లు, సీఎస్పీ బుజ్జమ్మపై క్రిమినల్ కేసు పెడతామని డీఆర్డీఏ అడిషనల్ పీడీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. సభలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ శివనాయణ, క్వాలిటీ కంట్రోల్ డీఈ కే చంద్రశేఖర్, సోషల్ ఆడిట్ విజిలెన్స్ అధికారి సత్యనారాయణ, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీఓ(పింఛన్లు) కిషన్, ఎంపీడీఓ పీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.