Three Girls Deceased After Fell In Sarileru Canal - Sakshi
Sakshi News home page

విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..

Published Tue, Sep 27 2022 7:56 AM | Last Updated on Tue, Sep 27 2022 9:02 AM

Three Girls Deceased after fell in Sokileru Canal - Sakshi

సాక్షి, వేటపాలెం (బాపట్ల జిల్లా): విహార యాత్ర విషాదయాత్రగా మారింది. సరదాగా వాగులో దిగిన ముగ్గురు విద్యార్థినులు ఆ నీటి ప్రవాహానికి బలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం సోకిలేరు వద్ద జరిగిన ఈ ఘటనతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశాయిపేట పంచాయతీ అనుజ్ఞ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న 21 మందిలో 15 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినిలను ఆదివారం ఉదయం బస్‌లో భద్రాచలం, అరకు ప్రాంతాలకు విహారయాత్రకు యాజమాన్యం తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం చేరుకున్నారు.

అక్కడ ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలను సందర్శించుకొని అక్కడ నుంచి సోమవారం ఉదయానికి చింతూరు చేరుకున్నారు. చింతూరు వ్యూపాయింట్‌ వద్ద సోకిలేరు వాగు నీటిలో సరదాగా విద్యార్థులు దిగారు. అయితే వాగు నీటిలో దిగిన విద్యార్థినిలు గుమ్మడి జయశ్రీ (14), సువర్ణకమల (14), గీతాంజలి (14) లోతు గమనించకపోవడంతో వారిలో ఒక అమ్మాయి వాగునీటిలో జారి పడిపోయింది. పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిలు స్నేహితురాలి చేయి పట్టుకునే సమయంలో ప్రమాదవ శాత్తు ముగ్గురూ లోతైన నీటి గుంటలో పడి వాగులో గల్లంతై మృతి చెందారు.  

బాలికల కుటుంబాల్లో విషాద ఛాయలు.. 
విహార యాత్రకు వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే వాగులో గల్లంతై ప్రాణాలు విడిచిన తమ పిల్లల సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని కేపాల్‌ కాలనీకి చెందిన వెంకారెడ్డికి  గీతాంజలి (14) ఒకే ఒక్క కుమార్తె. వెంకారెడ్డి విజయవాడలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుమార్తెను మంచి చదువులు చదివించాలని ప్రైవేట్‌ స్కూల్‌లో చేర్పించాడు.

విహార యాత్రకు వెళతానని చెప్పగానే కుమార్తె ఆనందానికి అడ్డుచెప్పకుండా పంపించాడు. యాత్రకు వెళ్లిన ఒక్క రోజు గడవక ముందే తన కుమార్తె ఇకలేదని వార్త తెలియడంతో హతాశుడయ్యాడు. భార్యకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో తన కూతురు మరణించిన విషయం భార్యకు చెప్పుకోలేక తల్లడిల్లుతున్నాడు. తన భార్య తట్టుకోలేదని భోరున విలపించాడు.  ఔ

చదవండి: (నాకు మాత్రమే తెలుసు ఎందుకుపోతున్నానో.. మరో జన్ముంటే మళ్లీ కలుద్దాం)

విలేకర్లు చెప్పిందాక తెలియదు..  
దేశాయిపేట పంచాయతీ పరిధిలోని సిలోన్‌ కాలనీకి చెందిన గౌరీ రవికుమార్‌ చేనేత పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి సువర్ణకమల ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ‘‘విహార యాత్రకు వెళతామంటే పంపించాం. అయితే విహార యాత్రకు వెళ్లిన ప్రాంతంలో ప్రమాదంలో నీటిలో పడి తమ కూతురు మరణించిందని విలేకర్లు చెబితే తెలుసుకున్నాను. హైస్కూల్‌ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా కూతురు విషయాలు ఇంతవరకు తెలియలేదు. మీరైనా తెలిసి ఉంటే చెప్పాలని’’ విషాద వదనంతో వాపోయాడు.  

ఇద్దరు బిడ్డల్లో ఒకరిని కోల్పోయా.. 
వేటపాలెం నాయినపల్లి కాయల లంపకు చెందిన శేషగిరి ప్రైవేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో గుమ్మడి జయశ్రీ అనుజ్ఞ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ‘‘విహార యాత్రకు వెళతామంటే పంపించాను. యాత్రకు వెళ్లిన ఒక రోజు గడవక ముందే ప్రమాదం జరిగిందని తెలిసింది. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. జరిగిన విషయం భార్యకు చెప్పలేదు. కూతురు విషయం తెలిస్తే భార్య ఏమవుతుందో ఆందోళనగా ఉంది. ఇంత నిర్లక్ష్యంగా యాజమాన్యం ఉంటే మా పిల్లలు పరిస్థితి ఏమిటి? ఇద్దరు బిడ్డల్లో ఒకరిని కోల్పోయా..’’ అని కన్నీటి పర్యంతమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement